ఏపీ రాష్ట్ర రాబడిని మరింత పెంచేలా సీఎం జగన్ కొత్త ప్లాన్ రెడీ చేస్తున్నారు. పన్నుల వసూళ్లలో పారదర్శకత అమలు చేయాలని సీఎం జగన్ సూచిస్తున్నారు. తప్పుడు బిల్లులు లేకుండా, పన్ను ఎగవేతలకు ఆస్కారం లేకుండా ఉండేలా అధునాతన విధానాలను రూపొందించడం ద్వారా రాష్ట్ర ఆదాయం పెంచాలని అధికారులకు సీఎం జగన్ సూచిస్తున్నారు.  రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూరుస్తున్న శాఖలపై ముఖ్యమంత్రి  జగన్‌ ఇటీవల సమీక్షించారు. ఎక్సైజ్, రెవెన్యూ, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్, భూగర్భ గనులు, అటవీ పర్యావరణశాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చించారు.


పన్నుల విభాగంలో డేటా అనలిటిక్స్‌ సెంటర్‌ బలోపేతానికి మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని  అధికారులు జగన్‌కు వివరించారు. ప్రభుత్వ విభాగాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం,సమర్థత పెంచాలని సీఎం జగన్ ఆదేశించారు. పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదులు,అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించి రాబడులు ఎప్పటికప్పుడు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు.


ఇందు కోసం ప్రస్తుతం ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. అలాగే అక్రమ మద్యం తయారీ, రవాణాలను నిరోధించాలన్న సీఎం... బెల్టుషాపులు, గ్రామాల్లో అక్రమ మద్యం నిరోధంలో మహిళా పోలీసులది కీలకపాత్ర అని వివరించారు. గ్రామ సచివాలయంలో మహిళా పోలీసుకు సంబంధించి  ఎస్‌ఓపీ రూపొందించాలని సీఎం జగన్ సూచించారు.


గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ఏయే సేవలు అందుబాటులో ఉంటాయనేది పోస్టర్ల రూపంలో డిస్‌ప్లే చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు అర్ధమయ్యేలా పోస్టర్ల రూపంలో ప్రదర్శించాలన్నారు ఇప్పటికే  51 గ్రామాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు విజయవంతంగా జరుగుతున్నాయన్న సీఎం.. మరో 650 గ్రామాల్లోని గ్రామ,వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అదనంగా 2వేల గ్రామాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో అక్టోబరు2 నాటికి  రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకుంటామని అధికారులు సీఎం జగన్‌కు వివరించగా.. ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: