రిషి సునాక్.. ఇటీవలి కాలంలో బాగా వినిపిస్తున్న పేరు.. భారత సంతతికి చెందిన వ్యక్తి.. బ్రిటన్‌ ప్రధాని రేసులో ఉన్న వ్యక్తి.. బ్రిటన్ ప్రధాని పదవి కోసం పోటీ పడుతున్న ఇద్దరిలో మన భారత సంతతికి చెందిన ఈ రిషి సునాక్‌ ఒకరు.. ఆయన ప్రధాని అయితే.. ఇండియా మొత్తం పొంగిపోవడం ఖాయం.. అయితే.. కన్జర్వేటివ్ పార్టీ నాయకుడి ఎంపికలో నిన్న మొన్నటి వరకూ రిషి సునాక్ చాలా మందున్నారు. ఎంపీలల్లో చాలా మంది రిషి సునాక్‌నే ఎంచుకున్నారు కూడా.


దీంతో ఇక మన రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని అయినట్టేనని అంతా ఆశలు పెట్టుకున్నారు. కానీ.. ఇప్పుడు సీన్ తిరగబడినట్టు తెలుస్తోంది. బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో మన రిషి సునాక్‌ బాగా వెనుకబడిపోయారట. ఆయన ప్రత్యర్థి లిజ్‌ ట్రస్‌కే ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ పోటీలో లిజ్‌ ట్రస్ గెలుపు అవకాశాలు 90 శాతం వరకూ ఉన్నాయని.. బ్రిటన్ బెట్టింగ్ ఎక్స్ఛేంజ్‌ సంస్థ స్మార్కెట్స్‌ అంచనా వేస్తోంది.


నిన్న మొన్నటి వరకూ రిషికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నా.. ఆ తర్వాత సీన్ లిజ్‌ ట్రస్‌కు అనుకూలంగా మారుతూ వస్తోంది. చర్చా వేదికలపై ట్రస్‌ ప్రసంగాలు ఆమె పట్ల క్రేజ్ పెంచుతున్నాయట. కన్జర్వేటరీ పార్టీ ఓటర్లను ఆమెకు అనుకూలంగా మారుస్తున్నాయట. మొదట్లో ట్రస్‌కు విజయావకాశాలు 60-40 వరకూ ఉండేవని.. కానీ ఇప్పుడు ఆమెకు ఏకంగా 90శాతం విజయావకాశాలు ఉన్నట్లు ఆ సంస్థ అంచనా వేస్తోంది. సునాక్‌ గెలుపు అవకాశాలు 10శాతానికి తగ్గిపోయాయని ఈ బెట్టింగ్‌ ఎక్స్చేంజ్‌ సంస్థ-స్మార్కెట్స్‌ చెబుతోంది.


బోరిస్ రాజీనామా ఖాయం అయ్యాక.. మొత్తం 11 మంది ప్రధాని పదవికి పోటీ పడ్డారు. వారిలో అనేక రౌండ్ల తర్వాత మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌.. విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ బరిలో నిలిచారు. సునాక్ ఎంపీల్లో మెజారిటీ సభ్యుల మద్దతు గెలుచుకున్నా.. కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యుల మద్దతు గెల్చుకున్నవారే పార్టీ అధ్యక్షులవుతారు. వారే ప్రధానిగా కూడా బాధ్యతలు చేపడతారు. వీరి మద్దతు కోసం సునాక్, ట్రస్‌.. తమ వంతుగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప రిషి ప్రధాని కావడం కష్టంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: