జగన్ ప్రభుత్వానికి బ్రిటన్ సంస్థ ఫోస్టర్‌ షాక్ ఇచ్చింది. ఈ ఫోస్టర్ సంస్థ గుర్తుందా.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అమరావతి నిర్మాణం కోసం డిజైన్లు రూపొందించిన సంస్థ. అయితే.. అప్పటి బాకీలు ఇంకా ఏపీ సంస్థ ఇవ్వలేదట. దీంతో ఆ సంస్థ తమ బాకీలు ఇప్పించాలని ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బకాయిలు ఇప్పించాలని ఫోస్టర్ సంస్థ ఆర్బిట్రేషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.


ఫోస్టర్‌ సంస్థ దాఖలు చేసిన ఆర్బిట్రేషన్‌ పిటిషన్‌పై సమాధానం చెప్పాలని అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ అభివృద్ది అథారిటీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం ప్రణాళిక, భవన ఆకృతులు రూపొందించిన ఫోస్టర్‌ సంస్థ.. 2019 జూన్‌ తర్వాత నుంచి తమకు ఇవ్వాల్సిన బకాయిలపై పలుమార్లు అథారిటీకి లేఖలు, నోటీసులు పంపినా సమాధానం లేదని కోర్టుకు తెలిపింది.


తమకు రావాల్సిన నిధులను మధ్యవర్తిత్వం ద్వారా ఇప్పించాలని ఫోస్టర్‌ సంస్థ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వి రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఏపీ సర్కారుకు నోటీసులు జారీ చేసింది. అయితే.. ఫోస్టర్ సంస్థ పిటిషన్ దాఖలు చేసినా.. ఆ సంస్థకు అంత సులభంగా బాకీలు చెల్లించే అవకాశం కనిపించడం లేదు. అసలు జగన్ సర్కారు అమరావతి నిర్మాణంపైనే పెద్దగా ఆసక్తిగా లేదు. అలాంటప్పుడు ఇలాంటి పాత బకాయిలు చెల్లిస్తారని కూడా ఆశించలేం.


కానీ ప్రభుత్వాలు మారినంత మాత్రాన.. పాత ప్రభుత్వాలు చేసిన బాకీలు తీర్చకపోవడం కూడా సబబుగా అనిపించుకోదు. ఇందులోనూ ఇది ఇతర దేశానికి చెందిన సంస్థతో వ్యవహారం.. అందుకే జగన్ సర్కారు కూడా కాస్త ఆచి తూచి స్పందించడం మంచిది. అయితే.. కోర్టులు చెప్పిన విషయాలనే పెద్దగా పట్టించుకోవడం లేదన్న పేరు జగన్ సర్కారుకు అమరావతి విషయంలో ఉంది. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: