ఆస్కార్ అవార్డు.. భారతీయ సినిమా రంగంలో ఎందరికో ఇది ఓ కల. ఆస్కార్‌ అవార్డు సాధిస్తే తమ జీవితం సాఫల్యమైందని చాలా మంది భావిస్తారు. కానీ.. ఎప్పుడూ విదేశీ చిత్రాల కేటగిరీలో తప్ప ఇతర కేటగిరీలో మన ఇండియన్ సినిమాలు సత్తా చాటలేదు. ఒక్క ఏ ఆర్ రెహ్మాన్‌, రసూల్‌ పోకుట్టి తప్ప ఇతరులెవరూ ఆస్కార్‌ అవార్డులు సాధించలేదు. 1983లో గాంధీ జీవిత చరిత్రపై రూపొందించిన గాంధీ సినిమాకు 8 వరకూ ఆస్కార్ అవార్డులు వచ్చినా విజేతలంతా విదేశీయులే. ఒక్క కాస్ట్యూమ్స్ విభాగంలో భాను అతయా మాత్రమే ఆస్కార్ పొందారు.


ఆ తర్వాత స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు 2008కు కూడా 8 వరకూ ఆస్కార్ అవార్డులు వచ్చినా ఇందులోనూ విజేతలు ఎక్కువగా విదేశీయులే.. ఒక్క బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌కు ఏఆర్ రెహ్మాన్‌ ఆస్కార్ గెలుచుకున్నారు. అలాగే బెస్ట్ ఒరిజినల్ స్కోర్‌ విభాగంలోనూ రెహ్మాన్‌కు ఆస్కార్‌ వచ్చింది. అలా ఆస్కార్‌ ముఖం చూడని దేశానికి ఏకంగా రెండు ఆస్కార్‌లు ఒకేసారి గెలుచుకుని సంచలనం సృష్టించారు ఏ ఆర్ రెహ్మాన్‌. ఇదే సినిమాకు రసూల్‌ పోకుట్టికి.. బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగంలో ఆస్కార్‌ అవార్డ్ వచ్చింది.


ఇంతకుమించి ఇండియన్ సినిమాకు ఆస్కార్‌ అవార్డులు వచ్చింది లేదు. ఏవో ఒకటి రెండు సినిమాలు.. గతంలో విదేశీ కేటగిరీ విభాగంలో నామినేట్ అవుతూ ఉండేవి.. కానీ ఇప్పుడు ఓ అద్భుతం జరగబోతోందని హాలీవుడ్ మూవీ మ్యాగజైన్ వెరైటీ చెబుతోంది. మోస్ట్‌ ఎవైటెడ్‌ ప్రాజెక్ట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇప్పుడు హాలీవుడ్ అవార్డుల రేసులోనూ సంచలనం సృష్టించనుందని ఆ మేగజైన్ అంచనా వేసింది.


రూ.1000 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్‌ ను షేక్ చేసిన ఈ సినిమా త్వరలోనే ప్రతిష్ఠాత్మక ‘ఆస్కార్‌’ అవార్డుల్లోనూ సత్తా చాటబోతోందని ప్రముఖ హాలీవుడ్‌ మ్యాగజైన్‌  వెరైటీ  చెబుతోంది. ఏకంగా నాలుగు విభాగాల్లో ఈ సినిమా పోటీ పడే అవకాశం ఉందని ఆ మేగజైన్ అంచనా వేసింది. బెస్ట్ యాక్టర్‌గా ఎన్టీఆర్, బెస్ట్ మూవీగా ఆర్‌ఆర్‌ఆర్‌, బెస్ట డైరెక్టర్‌గా రాజమౌళి, బెస్ట్ స్క్రీన్‌ప్లే విభాగాల్లో ఆర్ ఆర్‌ ఆర్‌ నామినేట్‌ అయ్యే అవకాశం ఉందని ఆ పత్రిక చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR