మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ బీజేపీ నుంచి పోటీ చేయబోతున్నారు. ఈ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్, బీజేపీ ఎత్తులు వేస్తున్నాయి. అయితే బలమైన నేత పార్టీ ని వీడినా.. ఈ ప్రాంతంపై పట్టున్న కాంగ్రెస్.. తన సిట్టింగ్ సీటు నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది.


ఈ మునుగోడు సీటును కాంగ్రెస్‌ నిలబెట్టుకునేలా పీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. పార్టీ ఫిరాయింపులకు తెలంగాణను సీఎం కేసీఆర్ ప్రయోగశాలగా మార్చారన్న  పీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. మునుగోడులో సర్పంచ్‌లను, ఎంపీటీసీలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాను ఇప్పటికే మునుగోడులో పర్యటించాల్సి ఉందని.. కానీ.. కోవిడ్ కారణంగా రాలేకపోయానని  పీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నారు. ఈనెల 20వ తేదీ నుంచి మునుగోడు లోనే ఉంటానని.. కార్యకర్తలు ఎవరు పార్టీ మారొద్దని  పీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు.


ఒక సంవత్సరం ఓపిక పడితే...కాంగ్రెస్ దే అధికారంలోకి వస్తుందని.. పార్టీ మారి చరిత్ర హీనులుగా మారొద్దని ఆయన నేతలకు సూచిస్తున్నారు. తెలంగాణ భవిష్యత్ మునుగోడు ఎన్నిక కాబోతుందని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. వాస్తవానికి మునుగోడు ఉప ఎన్నికల్లో అసలైన ప్రత్యర్థులుగా బీజేపీ, టీఆర్ఎస్‌ తమను తాము ప్రొజెక్టు చేసుకుంటున్నా.. అక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది.


పార్టీ నుంచి నాయకుడు వెళ్లిపోయినా ఆ ప్రాంతంలో కాంగ్రెస్ బలంగానే ఉంది. ఈ సిట్టింగ్ సీటును కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటే.. అది వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం అవసరమైన నైతిక బలాన్ని కాంగ్రెస్ పార్టీకి అందజేస్తుంది. మునుగోడు ఉప ఎన్నిక గెలవడం ద్వారా ఒకేసారి బీజేపీ, టీఆర్ఎస్‌లకు చెక్ పెట్టొచ్చని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. అయితే.. అదేమంత సులభమైన విషయం కూడా కాకపోయినా.. అసాధ్యం మాత్రం కాదని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: