టీడీపీ నేత నారా లోకేశ్‌.. టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు. గతంలోనే ఒకసారి మంత్రిగా  పనిచేసినా.. స్వయంగా ఎన్నికల్లో గెలిచిన చరిత్రలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయాడు. దీంతో నారా లోకేశ్‌ను చంద్రబాబు తర్వాత టీడీపీ అధినేతగా ఫోకస్ చేయడం చంద్రబాబుకు కష్టంగా మారింది. అందుకే ఈసారి ఎలాగైనా మంగళగిరిలోనే పోటీ చేసి గెలవాలన్న కసి నారా లోకేశ్‌లో కనిపిస్తోంది. అందుకే ఎన్ని కార్యక్రమాలు ఉన్నా.. మంగళగిరిలో మాత్రం తరచుగా పర్యటిస్తూ వచ్చే ఎన్నికల్లో విజయానికి బాటలు వేసుకుంటున్నాడు.


తాజాగా.. తాను మరోసారి పోటీచేయబోతున్న మంగళగిరి వాసులను ఆకట్టుకునేందుకు నారా లోకేశ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు మంగళగిరి వాసుల కోసం సొంత ఖర్చుతో ఆరోగ్య సంజీవిని పేరిట ఉచిత వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నామన్న లోకేశ్‌... మంగళగిరి ప్రజల ప్రతి ఒక్కరి ఆరోగ్య డేటా పర్యవేక్షించేలా తెలుగుదేశం పని చేస్తుందని తేల్చి చెప్పారు. మంగళగిరిలో సొంత ఖర్చుతో ఆరోగ్య సంజీవిని పేరిట ఉచిత వైద్య కేంద్రాన్ని లోకేశ్‌ ప్రారంభించారు. నియోజక వర్గంలో పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు సంజీవని ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటుచేశారు.


చిన్న స‌మ‌స్యల‌కీ ఆస్పత్రుల చుట్టూ తిరిగలేని... డ‌బ్బు ఖ‌ర్చు చేయ‌లేని నిరుపేదలు, నియోజ‌క‌వ‌ర్గంలో గ్రామీణుల కోసం  సంజీవ‌ని ఆరోగ్య కేంద్రాన్ని నారా లోకేశ్‌ మంగళగిరిలో ప్రారంబించారు. ఆరోగ్య కేంద్రంలో అత్యాధునిక చికిత్స ప‌రిక‌రాలు, ప‌రీక్ష యంత్రాలు, ఎమ‌ర్జెన్సీకి అవ‌స‌ర‌మైన సామాగ్రిని లోకేష్ తన సొంత ఖ‌ర్చుల‌తో స‌మ‌కూర్చారు. ఈ ఆరోగ్య కేంద్రంలో ఒక జ‌న‌ర‌ల్ ఫిజిషియ‌న్, క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్‌, ఫిమేల్ న‌ర్స్‌, కాంపౌండ‌ర్ ఉంటారు. ఆరోగ్య కేంద్రంలోనే 200కి పైగా  రోగ‌నిర్దార‌ణ ప‌రీక్షలు కూడా పూర్తిగా ఉచితంగా చేసే ఏర్పాట్లు చేశారు. అవ‌స‌ర‌మైన‌వారికి మందులు కూడా ఉచితంగా అందుచేయనున్నారు.


అంద‌రికీ ఆరోగ్యమ‌స్తు- ప్రతీ ఇంటికీ శుభ‌మ‌స్తు అనే నినాదంతో ఈ ఆరోగ్య కేంద్రాన్ని అందుబాటులోకి లోకేశ్‌ తెచ్చారు. అంతే కాదు.. మంగళగిరిలో విజయవంతం అయిన కార్యక్రమాలు అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని నారా లోకేశ్ అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: