ఎన్నికల సమయంలో సర్వేలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. జనం కూడా ఎవరిది గెలుపో తెలుసుకోవాలని ఉత్సాహపడుతుంటారు. కానీ.. ఏపీలో ఇంకా ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నా.. అప్పుడే సర్వే హడావిడి మొదలైంది. గతంలో సర్వేల అలవాటు ఉన్నవారే కాకుండా కొత్తగా కొందరు ఈ రంగంలో కాలు పెడుతూ సర్వేలు చేయిస్తున్నారు. అలాంటి జాబితాలో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు కూడా చేరారు.


ఆయన తాజాగా తన సర్వే వివరాలు బయటపెట్టారు. ఆ వివరాలు షాకింగ్‌గా ఉన్నాయి. ఈ సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయం.. జగన్ ఓటమి ఖాయం.. రఘురామ సర్వే ప్రకారం టీడీపీ 93 స్థానాల్లో కచ్చితంగా గెలుస్తుందట. అలాగే మ30 స్థానాల వరకూ టీడీపీకి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయట. అంటే.. తప్పకుండా గెలిచేవి.. గెలుపు అవకాశం ఉన్నవీ లెక్కేసుసుకుంటే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి కనీసం 127 స్థానాలు తప్పకుండా వచ్చే అవకాశం ఉందట.


ఇక వైసీపీ విషయానికి వస్తే.. వైసీపీ తప్పకుండా గెలిచే స్థానాలు కేవలం సింగిల్ డిజిట్‌ కే పరిమితం అయ్యేలా ఉన్నాయి. వైసీపీ తప్పకుండా గెలిచేవి కేవలం 7 సీట్లు మాత్రమేనట. ఇక మరో 65 సీట్లలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య హోరాహోరీ పోరాటం ఉంటుందట. ఇలా హోరా హోరీ పోరాటం ఉన్న వాటిలో ఎక్కువ శాతం వైసీపీ గెలుచుకున్నా.. ఆ పార్టీకి వచ్చే సీట్ల సంఖ్య 73 దాటదని రఘురామ కృష్ణంరాజు అంచనా వేస్తున్నారు.


అంటే ఈ రఘురామ సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవి చూడబోతుందన్నమాట. గత ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకున్న వైసీపీ ఈసారి తప్పకుండా ఓడుతుందని..అదీ ఘోరంగా అని రఘురామ అంచనా వేస్తున్నారు. అంతే కాదు.. తాను చాలా శాస్త్రీయంగా సర్వే చేయించానని.. కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం ఇంగ్లీష్ మీడియా సంస్థల సర్వేలు చూసి మురిసిపోతున్నారని ఆయన విమర్శిస్తున్నారు. చూడాలి మరి ఎవరి సర్వే నిజం అవుతుందో?


మరింత సమాచారం తెలుసుకోండి: