ఏపీ ఉద్యోగులు సీఎం జగన్‌కు ఝలక్ ఇవ్వబోతున్నారా..గతంలో సీపీఎస్‌ విషయంలో ఉద్యమం చేసి.. విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించిన ఉద్యోగులు మరోసారి అదే స్థాయిలో ఆందోళన చేయబోతున్నారా.. అంటే అవుననే అనిపిస్తోంది. సీపీఎస్ రద్దు చేయటం మినహా మరో  మార్గమేదీ లేదని ప్రభుత్వానికి మరోమారు తెలియచెప్పామని సీపీఎస్ ఉద్యోగుల సంఘం చెబుతోంది. మంత్రి బొత్స నివాసంలో నిన్న జరిగిన సమావేశానికి సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేతలతో పాటు ఏపీ సచివాలయంలోని సీపీఎస్ ఉద్యోగులు హాజరయ్యారు.


సెప్టెంబరు 1 తేదీన తాము సీఎం నివాసం ముట్టడి, విజయవాడ మిలియన్ మార్చ్ కార్యక్రమాలను నిర్వహించి తీరుతామని ఉద్యోగులు అంటున్నారు. వీటిని విరమించుకోవాల్సిందిగా మంత్రి బొత్స సత్యనారాయణ వారిని కోరారట. ఈ మేరకు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన్ పై చర్చిస్తామంటేనే మంత్రి బొత్స వద్ద చర్చలకు హాజరయ్యామని  సీపీఎస్ ఉద్యోగులు చెబుతున్నారు.


ప్రభుత్వం  సీపీఎస్ ను రద్దు చేసేంత వరకూ ఆందోళనలు ఆపేది లేదని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే ప్రకటించిన కార్యాచరణ కొనసాగుతుందని కూడా వారు తేల్చి చెప్పేశారు. ఎన్నికల్లో హామీ ఇవ్వక పోయినా రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్  రాష్ట్రాల్లో  సీపీఎస్ ను రద్దు చేశారని వారు గుర్తు చేస్తున్నారు. పథకం పేరు మార్చినా ఓల్డ్ పెన్షన్ స్కీం ప్రయోజనాలు దక్కాలన్నదే ఉద్యోగులుగా తమ డిమాండ్ అని ఉద్యోగులు స్పష్టం చేశారు.


ఉద్యోగుల ఉడుంపట్టుతో సీఎం జగన్‌కు తలనొప్పులు తప్పేలా కనిపించడం లేదు. ఆయన స్వయంగా పాదయాత్రలో సీపీఎస్ రద్దు చేస్తామని గతంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఉద్యోగులు కూడా ఆ హామీని నిలబెట్టుకోమని అడుగుతున్నామే తప్ప.. కొత్త కోరికలు కోరడం లేదుగా అంటూ
నిలదీస్తున్నారు. ఈ సీపీఎస్ అంశం తమను బాగా ఇబ్బంది పెడుతోందని ప్రభుత్వ పెద్దలే ఒప్పుకుంటున్నారు. కానీ వేల కోట్ల రూపాయల అంశం కావడంతో సీఎం జగన్ ఈ హామీ అమలు చేయలేకపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: