రష్యా ఎంత అరాచకం చేసినా ఇండియా పెద్దగా వ్యతిరేకించదు.. ఎందుకంటే.. ఇండియాకు రష్యా చిరకాల మిత్రుడు.. చిన్నా చితకా విషయాల గురించి రష్యా స్నేహాన్ని ఇండియా ఎప్పటికీ వదులుకోదు. అందుకే అమెరికాతో ఎంత క్లోజ్‌గా మూవ్ అవుతున్నా.. ఇండియా రష్యాను మాత్రం వదలిపెట్టదు. అలాంటి ఇండియా ఇప్పుడు తొలిసారి రష్యాకు షాక్ ఇచ్చింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రష్యాకు వ్యతిరేకంగా తొలిసారి ఇండియా ఓటు వేసింది.


యూఎన్‌ఎస్సీలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రసంగించాలని భావిస్తున్నారు. ఈ అంశంపై ఐక్య రాజ్య సమితిలో ఓటింగ్ జరిగింది. ఈ విషయంలో జెలెన్‌స్కీ ప్రసంగించడానికి అనుకూలంగా ఇండియా ఓటు వేసి రష్యాకు షాక్ ఇచ్చింది. ఓవైపు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టి ఆరు నెలలు పూర్తయ్యాయి. ఇదే సమయంలో ఉక్రెయిన్‌ 31వ స్వాతంత్ర్య దినోత్సవం రాబోతోంది. ఆ సందర్భంగా యుద్ధ పరిస్థితులను ఐక్య రాజ్య సమితి సమీక్షించింది.


ఈ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించాలని ఐక్య రాజ్య సమితి ఆహ్వానించింది. అయితే ఈ నిర్ణయాన్ని రష్యా తీవ్రంగా వ్యతిరేకించింది. జెలెన్‌స్కీ ప్రసంగంపై ప్రొసీజరల్‌ ఓటింగ్‌ చేయాల్సిందేనని రష్యా పట్టుబట్టింది. మొత్తం 15 సభ్యదేశాలు కలిగిన భద్రతా మండలిలో 13దేశాలు జెలెన్‌స్కీ ప్రసంగానికి అనుకూలంగా ఓటు వేశాయి. ఈ 13 దేశాల్లో భారత్‌ కూడా ఉండటం విశేషం.


జెలెన్‌స్కీ ప్రసంగానికి వ్యతిరేకంగా రష్యా మాత్రమే ఓటేసింది. చివరకు రష్యాకు మిత్రుడిగా వ్యవహరిస్తున్న చైనా కూడా ఓటింగ్‌కు దూరంగా ఉంది తప్ప వ్యతిరేకించలేదు. దీంతో  13 సభ్య దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతు ఇచ్చినట్టయింది. అందుకే జెలెన్‌స్కీ భద్రతా మండలిలో ప్రసంగించారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య  తర్వాత భారత్‌ అంతర్జాతీయంగా తటస్థ వైఖరి అవలంబిస్తోంది. చాలా విషయాల్లో రష్యాను వ్యతిరేకించడం ఇష్టం లేక ఓటింగ్‌కు దూరంగా ఉంటోంది. తాజాగా తొలిసారి రష్యాకు వ్యతిరేకంగా ఓటేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: