జగన్ అధికారంలోకి రాగానే ఆర్టీసీ ఉద్యోగులు ఆనందపడ్డారు. ఎందుకంటే.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని జగన్ గతంలో హామీ ఇచ్చారు. అలాగే.. ఇచ్చిన హామీని జగన్ నిలబెట్టుకున్నాడు కూడా. అయినా ఇంకా ఆర్టీసీ ఉద్యోగులు జగన్ పై కోపంగానే ఉన్నారు. ఎందుకంటే.. రాష్ట్రంలోని ప్రజారవాణా శాఖ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు అందట్లేదు. అయితే ఇందుకు ఆర్ధిక శాఖ నిర్లక్ష్యమే కారణమని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి.


అందుకే విజయవాడలోని రెవెన్యూ భవన్‌లో ఏపీ ఐకాస అమరావతి, ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌, కార్మిక పరిషత్తు, సెక్యూరిటీ వెల్ఫేర్‌ అసోయేషన్‌ నేతలు తాజాగా అత్యవసరంగా సమావేశమయ్యారు. తాజా పరిణామాల గురించి ఏం చేయాలో కూలంకుషంగా చర్చించారు. వాస్తవానికి  ఈ ఏడాది జనవరి నుంచి కొత్త వేతన సవరణ ఒప్పందం ప్రకారం ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వేతనాలు అందాల్సి ఉంది. అయినా మార్చి వరకు ఉత్తర్వులు వెలువడలేదు. దీనికి ఆర్ధిక శాఖే కారణమని ఆర్టీసీ నేతలు ఆరోపిస్తున్నారు.


మొత్తం 2096 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారనే సాకు చూపించి పీఆర్‌సీ అమలును వాయిదా వేస్తున్నారు. ఇది సరి కాదని వారిని మినహాయించి ఇతరులకు కొత్త వేతనాలు అమలు చేయాలనే ఆలోచన కూడా ఏమాత్రం సరికాదని ఆర్టీసీ నేతలు అంటున్నారు. ఇలా చేయడం అంటే సుమారు 52 వేలమంది పీటీడీ ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేయడమే అంటున్నారు. పీటీడీ అధికారులు జూన్‌ ఆరో తేదీ నుంచి తరచూ ఆర్ధికశాఖ ఉన్నతాధికారులకు అనేక లేఖలు పంపుతున్నారు. కానీ ఆర్థిక శాఖ అధికారులు మాత్రం ఏ లేఖకు సమాధానం ఇవ్వట్లేదంటున్నారు.


ప్రజారవాణా శాఖలో పనిచేస్తోన్న ఉద్యోగులకు జీతాల నిర్ణయానికి, చెల్లింపులకు ఇప్పటికే ప్రత్యేకంగా అధికారులను నియమించారు. కానీ.. వారి సేవలు వినియోగించుకోవడం లేదని ఆర్టీసీ కార్మిక నేతలు అంటున్నారు. అలాగే ఈ శాఖలోని సాఫ్ట్‌వేర్‌ను సీఎంఎఫ్‌ఎస్‌తో అనుసంధానించి త్వరితగతిన పని ముందుకు సజావుగా చూడాలని వారు కోరుతున్నారు. పది రోజుల్లోగా ఆర్ధికశాఖ స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: