జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ వైసీపీ అరాచకాలపై మండిపడుతున్నారు. జనసేన ఉనికిని తీసిపారేయడం ఎవరి తరం కాదని.. ప్రజలే ఆ పార్టీని కాపాడుకుంటారని స్పష్టం చేస్తున్నారు. విజయవాడ పశ్చిమ, జగ్గయ్యపేటలలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణలను  వైకాపా వర్గాలు అడ్డుకున్న తీరుపై ఆయన ఘాటుగా స్పందిస్తున్నారు. శాంతి భద్రతలకు ఇబ్బంది కలగచేయకూడదనే సదుద్దేశ్యంతోనే  ఇంత జరుగుతున్నా తను రోడ్ మీదకు రాలేదంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాను రోడ్డెక్కడం తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు.


పోలీసులు సర్వీస్ కాలమంతా డ్యూటీలోనే గడుపుతారని.. మరో పార్టీ ప్రభుత్వం వస్తే   తలదించుకునే పరిస్థితి రాకూడని కోరుకుంటున్నానని.. ధర్మాన్ని పాటించమని  అధికారులను కోరుతున్నారు. విజయవాడ పశ్చిమ, జగ్గయ్యపేటలలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణలను  వైకాపా వర్గాలు అడ్డుకున్న తీరు వారిలోని ఓటమి భయాన్ని తేటతెల్లం చేస్తోందంటున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో    రాష్ట్ర అధికార ప్రతినిధి  పోతిన వెంకట మహేష్  జనసేన జెండా ఆవిష్కరణ చేయకుండా వైకాపా నేతలు, పోలీసులు అడ్డుపడిన వైనం... మహేష్ ను అదుపులోకి తీసుకుని రిమాండ్ చేయడానికి చేసిన ప్రయత్నాలను పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండిస్తున్నారు.


అలాగే జగ్గయ్యపేటలో జనసేన పతాక ఆవిష్కరణ కోసం పార్టీ  శ్రేణులు నిర్మించుకున్న జెండా దిమ్మెను  అర్థరాత్రి వైకాపా దౌర్జన్యకారులు జె.సి.బి.తో కూల్చివేసిన సంఘటనలో దోషులపై కేసు నమోదు చేయడానికి బదులు ప్రశ్నించిన జనసేన నాయకులపై కేసులు పెట్టడం ఎంతవరకు న్యాయబద్ధమో పోలీస్ అధికారులు ఆలోచించాలని పవన్ కల్యాణ్‌ విజ్ఞప్తి చేస్తున్నారు. జనసేన శ్రేణులు తలపెడుతున్న ప్రతి కార్యక్రమాన్ని అనుమతి లేదన్న సాకుతో పోలీసులు  అడ్డుపడడం అధికార పార్టీకి వత్తాసు పలకడంగానే భావిస్తున్నట్లు పవన్ అంటున్నారు.


అయితే పవన్ కల్యాణ్ ఇలా పత్రికాప్రకటనతో హెచ్చరించడమే తప్ప.. నిజంగా రోడ్డుపైకి రావడం లేదన్న ఆందోళన సొంత పార్టీ శ్రేణుల్లోనే ఉంది.. ఎన్నికలకు సమయం దగ్గరపడతున్నందువల్ల తమ నాయకుడు నిజంగానే రోడ్లపైకి రావాలని జన సైనికులు కోరుకుంటున్నారు. మరి పవన్ నిజంగా రోడ్డుపైకి వస్తారా.. వస్తే.. జగన్ ఆ పరిస్థితిని తట్టుకోలేనంత సీన్ ఉంటుందా.. చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: