ఏపీలో టీడీపీ జోరు చూపిస్తోంది. ఏదో ఒక అంశంపై రోజూ వార్తల్లో ఉంటోంది. ఇటీవల ఆ పార్టీ చేపట్టిన తాజా ఉద్యమం అన్న క్యాంటీన్ ఉద్యమం.. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో.. గత హయాంలోని చివరి రోజుల్లో అన్న క్యాంటీన్లను అప్పటి ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రంలోని పలు చోట్ల ఈ అన్న క్యాంటీన్లు నిర్వహించింది. పేదలకు చాలా తక్కువ ఖర్చుతో భోజనం పెట్టడం ఈ అన్న క్యాంటీన్ల ప్రత్యేకత.


ఈ అన్న క్యాంటీన్ల కాన్సెప్టు కొత్తదేమీ కాదు.. అటు తెలంగాణలోనూ.. దక్షిణాదిలోని తమిళనాడులోనూ.. కర్ణాటకలోనూ ఏదో ఒక పేరుతో ఉన్నదే.. పేదలకు పట్టెడన్నం పెట్టే ఏ కార్యక్రమాన్నయినా స్వాగతించాల్సిందే. అయితే.. చంద్రబాబు సర్కారు తీసుకొచ్చిన ఈ పథకాన్ని వైఎస్ జగన్ సీఎం కాగానే నిలిపేశారు. అన్న అంటే ఎన్టీఆర్.. ఎన్టీఆర్ పేరుతో పసుపు రంగులో ఉన్న అన్న క్యాంటీన్లే ఇందుకు కారణంగా అంతా భావించారు.


ఎన్టీఆర్ పేరు నచ్చకపోతే.. అన్న క్యాంటీన్లను రాజన్న క్యాంటీన్లుగా మార్చినా బావుండేది. పేరు ఏదైనా పేదోడికి అన్నం దక్కడం ప్రధానం కదా.. అయితే.. ఎందుకో జగన్ సర్కారు ఈ విషయంలో మాత్రం పట్టించుకోలేదు. అన్న క్యాంటీన్లను పునరుద్ధరించలేదు. ఇప్పుడు దీన్నే టీడీపీ తన రాజకీయ అస్త్రంగా మార్చుకుంటోంది. ఎన్నికలు రాబోతున్న సమయంలో రాష్ట్రంలోని ప్రతి చోటా టీడీపీ నాయకులు సొంత డబ్బుతో అన్న క్యాంటీన్లు, అన్నదానాలు ఏర్పాటు చేస్తున్నారు.


అయితే.. అనేక చోట్ల ఈ అన్న క్యాంటీన్లను పోలీసులు అడ్డుకుంటున్నారు. బహిరంగ ప్రదేశాల్లో, ట్రాఫిక్ ప్రదేశాల్లో ఈ అన్న క్యాంటీన్లను నిర్వహించడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఏదేమైనా జగన్ సర్కారు అన్న క్యాంటీన్లను అడ్డుకుంటోందన్న పేరు వస్తోంది. అమ్మ పెట్టదు.. అడుక్కుతిననివ్వదు అన్న తరహాలో జగన్ సర్కారు.. అన్న క్యాంటీన్లను తెరవదు.. ఇటు టీడీపీ వాళ్లు అన్న క్యాంటీన్లు సొంత డబ్బుతో తెరిచినా సహించదు అన్న విమర్శలు  పెరుగుతున్నాయి. ఇది జగన్ సర్కారుకు మంచిదికాదు.. నలుగురికి అన్నం పెట్టే కార్యక్రమాలను అడ్డుకుంటే అది మంచి సంకేతాలు పంపదు. వైసీపీ సర్కారు ఈ విషయాన్ని గమనిస్తే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: