పాదయాత్ర.. రాజకీయాల్లో ఇదో బలమైన అస్త్రం.. ఆనాటి మహాత్మా గాంధీ నుంచి ఈనాటి రాహుల్ గాంధీ వరకూ ప్రజల్లోకి వెళ్లేందుకు ఎంచుకున్న బ్రహ్మాస్త్రం ఇది. ఏపీ రాజకీయాల్లో ఈ పాదయాత్రలకు చాలా ప్రాధాన్యం ఉంది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఈ పాదయాత్ర ద్వారానే సీఎం కాగలిగారు. ఆ తర్వాత చంద్రబాబు సుదీర్ఘమైన యాత్ర చేశారు.. సీఎం అయ్యారు. ఆ తర్వాత జగన్ కూడా తండ్రి బాటలోనే సుదీర్ఘ పాదయాత్ర చేశారు.. ఆయన కూడా సీఎం అయ్యారు.


ఇప్పుడు తాజాగా నారా లోకేశ్ కూడా పాదయాత్ర చేయబోతున్నారు. మొత్తం 450 రోజుల షెడ్యూల్‌ ఖరారైనట్టు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టి రాష్ట్రం మొత్తం చుట్టేలా ఈ యాత్రను డిజైన్‌ చేస్తున్నారు. నారా లోకేశ్‌ జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయబోతున్నారు. సంక్రాంతి తర్వాత నారా లోకేశ్‌ పాదయాత్ర ప్రారంభం అవుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ముందుగా అక్టోబరు నుంచే పాదయాత్ర  చేపట్టాలని ఆయన అనుకున్నా.. ఆ తర్వాత పార్టీలో చర్చల తర్వాత ముహూర్తాన్ని జనవరికి మార్చేశారు.


జనవరిలో ప్రారంభమయ్యే నారా లోకేశ్ పాదయాత్ర.. 2024 మార్చి వరకూ సాగే అవకాశం ఉంది. దాదాపు 450 రోజులపాటు ఆయన పాదయాత్ర చేసే అవకాశం లభిస్తుంది. మార్చి నాటికి లోకేశ్ పాదయాత్ర రాష్ట్రం మొత్తం పూర్తయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారు. లోకేశ్ యాత్ర రాయలసీమ నుంచి ప్రారంభమై ఉత్తరాంధ్రలో ముగుస్తుందని తెలుస్తోంది. దాదాపు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు కవర్ అయ్యేలా రూట్‌ మ్యాప్‌ తయారు చేస్తునత్నారు. అంతే కాదు.. పాదయాత్రలో విరామం ఉండదట. వారంలో మొత్తం ఏడు రోజులూ పాదయాత్ర చేస్తారట.


వాస్తవానికి నారా లోకేశ్ కంటే నారా చంద్రబాబు పాదయాత్ర ద్వారా ఎక్కువ ప్రభావం ఉంటుందని భావించినా చంద్రబాబు వయస్సు రీత్యా ఆ సాహసం చేయడం లేదు. ఆయన రోడ్‌ షోలకు పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి నారా లోకేశ్ పాదయాత్ర జనంపై ఏ మేరకు ప్రభావం చూపుతుంది.. అది జగన్‌ను గద్దె నుంచి దింపేందుకు ఉపకరిస్తుందా.. లేక.. లోకేశ్‌కు కాళ్ల నొప్పులు మిగులుస్తుందా అన్నది వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: