ఏపీ ఆర్థిక పరిస్థితిపై కాగ్ నివేదిక ఇచ్చింది. దీని ప్రకారం..  2020-21 లో 1,17,136 కోట్ల రెవెన్యూ రాబడులు ఉంటే 20,018 కోట్లు వడ్డీగా చెల్లింపులు చేశారు. రాష్ట్రప్రభుత్వం తీసుకున్న ప్రజా రుణం 44.07 శాతం మేర పెరిగిందని కాగ్‌ నివేదిక ఆక్షేపించింది. కేంద్ర నుంచి జరిగిన పన్నుల బదిలీలు రాష్ట్రానికి రాబడులు పెంచాయని.., 580 కోట్ల గ్రాంట్ కోవిడ్ కోసం ప్రత్యేకంగా కేంద్రం ఇచ్చిందని కాగ్‌ నివేదిక తెలిపింది. కోవిడ్ సహాయ చర్యలపై రాష్ట్రప్రభుత్వం 337.25 కోట్లు వ్యయం చేసిందని కాగ్‌ నివేదిక  పేర్కొంది.


జీఎస్ డీపీలో పరిశ్రమలు, సేవల వృద్ధి రేటులో క్షీణత నమోదు అయ్యిందని కాగ్‌ నివేదిక  తెలిపింది. 2015 నుంచి 2021 వరకూ వర్తించేలా ఏపీ ఎఫ్ఆర్ బీఎం చట్టానికి సవరణ చేశారని కాగ్‌ నివేదిక  గుర్తు చేసింది.  2020-21లో రాష్ట్ర సొంత పన్నుల రాబడి 0.33 తగ్గిందన్న కాగ్‌...., కేంద్ర ప్రభుత్వం నుంచి పొందే గ్రాంట్లు 45.69 శాతం పెరిగిందని తెలిపింది. రెవెన్యూ ఖర్చులు 11.06 శాతం మేర పెరిగాయని కాగ్‌ నివేదిక  తెలిపింది. సామాజిక సేవలపై రెవెన్యూ ఖర్చు 3.10 శాతం తగ్గిందన్న కాగ్..., ఆర్ధిక సేవలపై రెవెన్యూ ఖర్చు 56.11 శాతం పెరిగిందని వివరించింది.


అంతే కాదు.. రెవెన్యూ వ్యయాన్నే మూలధన వ్యయంగా ప్రభుత్వం వర్గీకరించిందని కాగ్‌ పేర్కొంది. గృహనిర్మాణాల కోసం చేసిన 6278 కోట్ల వ్యయాన్ని మూలధన వ్యయంగా పరిగణించారని కాగ్ తన నివేదికలో తెలిపింది. కాగ్ నివేదిక ఇలా ఉంటే.. సీఎం జగన్ మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భేషుగ్గా ఉందని ఇటీవలే అసెంబ్లీలో వివరణ ఇచ్చారు. ఏపీ పరిస్థితి శ్రీలంకలా మారుతుందని వస్తున్న వార్తలను ఆయన కొట్టి పారేశారు. అయితే కాగ్ నివేదిక ప్రభుత్వాలను తప్పబట్టడం అత్యంత సహజం అని విశ్లేషకులు చెబుతున్నారు. కాగ్‌ చెప్పిన తప్పులను సరి చేసుకుంటూ ముందుకు వెళ్లాలని వారు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

cag