కేసీఆర్ జాతీయ పార్టీ విషయాన్ని బీజేపీ లైట్ గా తీసుకుంటోంది. కావాలనుకుంటే కేసీఆర్ ఐక్యరాజ్యసమితి అనుమతితో అంతర్జాతీయ పార్టీ పెట్టుకోవచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రిని విమర్శించడమే లక్ష్యంగా కేసీఆర్ పెట్టుకున్నారని దుయ్యబట్టిన కిషన్‌రెడ్డి.... సొంత విమానంలో ఓ వైపు అసదుద్దీన్ ఒవైసీ, మరో వైపు అక్బరుద్దీన్ ఒవైసీని ఎక్కించుకొని దేశ పర్యటనకు వెళతారా అని ప్రశ్నించారు.


రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం వివక్ష చూపనందునే అవార్డులు వస్తున్నాయని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బయ్యారం ఉక్కు కర్మాగారం సాధ్యం కాదని 2014లోనే కేంద్ర ప్రభుత్వం చెప్పిందని, రాష్ట్ర విభజన చట్టంలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు సాధ్యతను పరిశీలించాలని మాత్రమే ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. 2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ అంశంపై నిపుణుల కమిటీ వేసిందని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడ ముడి ఇనుము ఉక్కు తయారీకి పనికి రాదని తేల్చినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు.


వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే... బయ్యారంలో ఉక్కు కర్మాగారం సాధ్యం కాదని తేల్చారని కేంద్ర మంత్రి తెలిపారు. గతంలో పలుమారు ఎమ్మెల్యే అయిన కేసీఆర్ బయ్యారం ఉక్కు కర్మాగారంపై ఎందుకు మాట్లాడలేదని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఒకవేళ బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తే... ఆది ఖాయిలా పరిశ్రమగా మారుతుందన్నారు. బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఏనాడూ బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని ప్రకటించలేదని స్పష్టం చేశారు.


బయ్యారంలో ఉక్కు కర్మాగారం సాధ్యం కాదని సుప్రీంకోర్టుకు తమ ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించిందని, పార్లమెంట్‌లోనూ అదే విషయాన్ని చెప్పిందని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.  కేంద్ర ప్రభుత్వం బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయకపోతే తామే ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ పలు సభల్లో ప్రకటించారంటూ అందుకు సంబంధించిన వీడియోలను కిషన్‌రెడ్డి ప్రదర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: