ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  లేఖ రాశారు. అధికార దుర్వినియోగంలో నిమగ్నమైన యంత్రాంగం.. గతుకుల రోడ్లలో ప్రాణాలు కోల్పోతోన్న యువతరం.. ఇసుక మాఫియా అరాచకం గురించి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  లేఖ రాశారు. ఓవైపు అకాల వర్షాలు, మరోవైపు ఇసుక మాఫియా అరాచకాలలతో నల్గొండ జిల్లాలో ప్రత్యేకించి భువనగిరి లోక్ సభ నియోజకవర్గం పరిధిలో రహదారులు నరకాన్ని తలపిస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖలో తెలిపారు.


గతుకుల రోడ్లు ప్రతిరోజూ కనీసం ఒకటి, రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయని..  నాలుగు రోజుల కిందే మరో హృదయ విదారక ఘటన చోటు చేసుకొందని... అస్తవ్యస్తమైన రోడ్లకు తోడు ఓవర్ లోడ్ తో, అతివేగంతో యమకింకరుల్లా మీదకు దూసుకువచ్చే ఇసుక లారీల కింద ప్రాణాలు నలిగిపోతున్నాయని వివరించారు. తాజాగా 32 ఏళ్ల పైళ్ల ప్రశాంత్ రెడ్డి.. గతుకుల రోడ్లలో ఓ హార్వెస్టర్ ఢీకొని ప్రశాంత్ ప్రాణం గాల్లో కలవగా, ఇద్దరు చిన్నారులు, ఆయన భార్య రోడ్డున పడ్డారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  తెలిపారు.


నేనేమో ఒక ఎంపీగా, బాధ్యతతో నిత్యం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూ నా జనం కోసం హైవేలు వేయిస్తుంటే, మీ సర్కార్ మాత్రం రోడ్ల విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. భారీ వర్షాల మాట అటుంచితే, కనీసం ఇసుక మాఫియాను అడ్డుకున్నా నల్గొండ జిల్లాలో రోజుకు రెండు ప్రాణాలు కాపాడే అవకాశం వుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.


నిత్యం అక్రమంగా 150 టన్నుల ఓవర్ లోడ్ తో, వందల లారీలు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తుంటే అడ్డుకోవాల్సిన యంత్రాంగం, అమ్ముడుపోయిందా.. చేష్టలుడిగి పోయిందా.. అర్థం కావడం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. అలాంటి లారీల వల్ల నా ప్రజల ప్రాణాలు పోతుంటే స్థానిక ఎంపీగా గుండె తరుక్కుపోతోందన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తక్షణమే ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: