ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ రమేశ్ బదిలీ కాబోతున్నారు. ఇటీవల వీరు ఇద్దరినీ బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. వీరితో పాటు పలువురు తెలంగాణ జడ్జిలను బదిలీ చేయాలని కొలిజీయం సిఫారసు చేసింది. కానీ జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ రమేశ్ బదిలీ సిఫారసులపై లాయర్లు మండిపడుతున్నారు. నిన్న న్యాయవాదులు విధులు బహిష్కరించారు.


ఎలాగైనా వీరి బదిలీలు ఆపించాలని ప్రయత్నిస్తున్నారు. గుజరాత్‌లో గతంలో న్యాయవాదులంతా ఒక్కమాటపై నిలబడి అక్కడి న్యాయమూర్తి బదిలీని నిలిపేయించుకున్నారు. తాము కూడా  అదే తరహాలో ఏకతాటిపై నిలబడి బదిలీలను ఆపించుకోవాలని సీనియర్‌ లాయర్లు ఆలోచిస్తున్నారు. ఈ బదిలీలపై న్యాయవాదుల సంఘం నిన్న అత్యవసరంగా సమావేశమై చర్చించింది. ఈ బదిలీ ప్రక్రియను నిలిపేసి, ఇద్దరు న్యాయమూర్తులను ఏపీ హైకోర్టులో కొనసాగించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేస్తూ తీర్మానం చేసింది.


అంతే కాదు.. ఈ ఇద్దరు జడ్జిల  బదిలీలకు వ్యతిరేకంగా వివిధ రూపాల్లో నిరసనలు చేపట్టాలని న్యాయవాదుల సంఘం నిర్ణయించింది. ఇరువురు జడ్జీలను ఇక్కడే ఉంచేలా చర్యలు చేపట్టాలంటూ ఏపీ బార్ కౌన్సిల్ ఛైర్మన్‌ను కోరుతూ న్యాయ వాదుల సంఘం తీర్మానం చేసింది కూడా. అయితే.. లాయర్ల విధుల బహిష్కరణకు తాము పిలుపు ఇవ్వలేదని ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం  అధ్యక్షుడు కె.జానకి రామిరెడ్డి ప్రకటన విడుదల చేయడం మరో విశేషం.


కొందరు న్యాయవాదుల గ్రూప్ చేసిన తీర్మానానికి ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం నుంచి ఆథరైజేషన్ లేదని చెప్పడం కొసమెరుపు. అంటే లాయర్లలోనే చీలికలు కూడా ఉన్నాయని భావించాల్సి వస్తోంది. అయితే.. ఇలా జడ్జిల బదిలీలను వ్యతిరేకించడం కూడా చర్చకు దారి తీస్తోంది. జడ్జిల బదిలీలు సహజమేనని.. కానీ.. ఇలా వ్యతిరేకించాల్సి రావడం ఏంటన్న ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి. మరి ఈ ఇద్దరు జడ్జిల బదిలీలు ఆగుతాయా.. లేదా.. చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: