మొబైల్‌ ఫోన్‌.. ఇప్పుడు ఇది పది నిమిషాలు కనపడకపోతే.. చాలామందికి మతిస్థిమితం ఉండదు.. పొరపాటున ఫోన్‌ ఎక్కడైనా పెట్టి మర్చిపోయి.. అది దొరక్కపోతే.. అది దొరికే వరకూ మనసు మనసులో ఉండదు. ఎందుకంటే అంతగా మొబైల్ ఫోన్ మన జీవితాల్లో ఒక భాగం అయ్యింది. ఫోన్‌ అంటే కేవలం కాల్‌ చేయడానికి మాత్రమే కాదు.. ఇప్పుడు ఫోన్‌ అంటే మన జీవిత సర్వస్వం. మిత్రులతో మాట్లాడాలన్నా ఫోన్ కావాలి.. టైంపాస్‌కు వీడియో చూడాలంటే.. ఫోన్‌ కావాలి.


బోర్ కొట్టి ఏదైనా గేమ్ ఆడాలన్నా ఫోన్‌ కావాలి.. అర్జంటుగా ఆఫీసు సమాచారం పంచుకోవాలన్నా ఫోన్ కావాలి.. వాట్సప్‌, ఫేస్‌బుక్‌ ఇలా ఎన్నో సామాజిక మాధ్యమాలు వచ్చాక ఫోన్‌ లేకుండా ఎవరికీ నిమిషం కూడా గడవడం లేదు. అదే సమయంలో ఫోన్ మనల్ని ప్రశాంతంగా ఉంచడం లేదు. కనీసం పది నిమిషాలు కుదురుగా ఉండనివ్వడం లేదు. అందుకే.. ఇప్పుడు తమిళనాడులో దేవాలయాల్లో మొబైల్ ఫోన్ల వాడకాన్ని నిషేధిస్తూ మద్రాస్  హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.


ఎందుకంటే.. చివరకు గుడి వచ్చాక కూడా అంతా మొబైల్‌ పైనే ధ్యాస ఉంచుతున్నారు కదా.  మందిరాల స్వచ్ఛత, పవిత్రతను కాపాడటమే లక్ష్యంగా ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు మద్రాసు  ఉన్నత న్యాయస్థానం  పేర్కొంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయాల వద్ద ఫోన్ డిపాజిట్ లాకర్లను ఏర్పాటుచేయాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. తిరుచ్చెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన తర్వాత మద్రాసు హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.


మొబైల్ ఫోన్ల వల్ల ప్రజల దృష్టి మరలుతోందన్న మద్రాసు హైకోర్టు.. అంతే కాకుండా ఆలయాల్లో దేవుళ్ల చిత్రాలను క్లిక్ చేస్తున్నారు. ఇలా చేయడం ఆగమా శాస్త్ర  నిబంధనలను ఉల్లంఘించడమేనని మద్రాసు హైకోర్టులో పిటిషనర్ వాదించారు. ఫొటోగ్రఫీ వల్ల దేవాలయాల భద్రతకు ముప్పు నెలకొందని వాదించారు. అంతే కాదు.. మహిళల అనుమతి లేకుండా కొందరు వారి చిత్రాలను తీస్తున్నారని  పిటిషనర్  పేర్కొన్నారు. వాదనల తర్వాత వారితో ఏకీభవించిన మద్రాసు హైకోర్టు.. ఆలయాల్లో ఫోన్ల వాడకాన్ని నిషేధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: