కొడంగల్.. ఇది తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సొంత నియోజక వర్గం.. అక్కడ ఆయన పలుసార్లు గెలిచారు. కానీ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ పార్టీ టార్గెట్ చేసి మరీ రేవంత్ రెడ్డిని అక్కడి నుంచి ఓడించింది. దీంతో రేవంత్ రెడ్డి కొడంగల్‌ను వదిలి పెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ఎంపీ ఎన్నికల్లో ఆయన మల్కజ్‌గిరి నుంచి పోటీ చేసి ఎంపీ అయిన సంగతి తెలిసిందే. అయితే.. కొడంగల్‌ను గెలుచుకున్న ఆనందంలో మంత్రి కేటీఆర్‌ ఆ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటున్నాని అప్పట్లో ప్రకటించారు.


మరి కొడంగల్‌ను దత్తత తీసుకున్నమంత్రి కేటీఆర్‌ నాలుగేళ్ళలో ఏం అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేస్తున్నారు. టీఆర్ఎస్  పాలనలో కొడంగల్ నియోజక వర్గానికి తుప్పు పట్టిందని రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. డ్రామారావు దత్తత తీసుకోవడం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి తప్ప టీఆర్ఎస్‌కు ఏ ప్రాజెక్టుతో కూడా సంబంధం లేదన్న రేవంత్‌ రెడ్డి..  అన్ని ప్రాజెక్టులు కాంగ్రెస్‌ హయాంలో జరిగినవేనన్నారు.


పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని డిమాండ్‌ రేవంత్‌ రెడ్డి చేశారు. 2019 జనవరి 1 నుంచి కొడంగల్‌కు టీఆరెస్ ఎమ్మెల్యే ఉన్నారని అయినా ప్రయోజనం లేదని రేవంత్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కొడంగల్ అభివృద్ధికి నిధులు వచ్చే వరకు ఎమ్మెల్యే ఆమరణ నిరాహార దీక్ష చేయాలని, ఆయన నిధులు ఇచ్చేవరకు తన దీక్ష కొనసాగించాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. అసెంబ్లీలో కొడంగల్ అభివృద్ధిపై నిర్దిష్టమైన ప్రకటన చేయాలని, లేకపోతే గ్రామ గ్రామాన తిరిగి...తెరాస తీరును ఉతికి ఆరేస్తామని రేవంత్‌ రెడ్డి  హెచ్చరించారు.


గాంధీ కుటుంబమే విచారణ సంస్థలను గౌరవించాయన్న రేవంత్‌ రెడ్డి... టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నారని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో వెస్ట్ బెంగాల్ తరహా రాజకీయం చేస్తున్నారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. కేంద్రం కవితను, రాష్ట్రం బీఎల్ సంతోష్‌లను ఎందుకు అరెస్టు చేయడంలేదని రేవంత్‌ రెడ్డి నిలదీశారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీసేందుకే తెరాస, బీజేపీ లు కుట్ర చేస్తున్నాయని  రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

KTR