విశాఖ మధురవాడ వికలాంగుల కాలనీలో ప్లాస్టిక్ డ్రమ్ లో మహిళ మృతదేహం కేసులో అనేక సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రిషి అనే వ్యక్తి ఈ మహిళను హత్య చేసినట్టు నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ వెల్లడించారు. మృతురాలు శ్రీకాకుళం జిల్లాకు చెందిన బమ్మిడి ధనలక్ష్మి గా గుర్తించారు. ఏడాదిన్నర క్రితం శ్రీకాకుళం జిల్లాలోని ఓ బస్ స్టాప్ లో రిషికి ధనలక్ష్మికి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో మధురవాడలో ఇంటికి తీసుకువచ్చి శారీరకంగా ఇద్దరూ కలిశారు.


అయితే..  ఆ పరిస్థితిని ఆసరాగా తీసుకుని రిషిని.. ధనలక్ష్మి డబ్బులు డిమాండ్ చేసింది. ఆ విషయం చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుందని రిషి భయపడ్డాడు. అందుకే చున్నీతో మెడను బిగించి  ధనలక్ష్మిని హత్య చేశాడు. విషయం బయటకు తెలియకుండా మృత దేహన్నీ ఖాళీ డ్రమ్ లో పెట్టి ఇంటికి తాళం వేసి నిందితుడు రిషి వెళ్లిపోయాడు. అనుకోకుండా చంపాల్సి రావడంతో మృత దేహాన్ని ఎటూ తరలించలేక నిందితుడు డ్రమ్ లో వదిలేశాడని పోలీసులు చెబుతున్నారు.


ఇంటి యజమానికి మాత్రం తన భార్య డెలివరీ కి వెళ్ళిందని రిషి చెబుతూ వచ్చాడు. భార్య వచ్చిన తర్వాత అద్దె  చెల్లిస్తామని చెప్పుకుంటూ వచ్చాడు. రిషి ఆర్థిక పరిస్థితి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఏడాదికాలంగా అద్దె  చెల్లించలేకపోయాడు. దీంతో ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. ఖాళీగా ఉన్న ఇంటికి కరెంటు బిల్లు అధికంగా వచ్చింది. దీంతో యజమాని రమేశ్ సామాన్లు బయటికి తీసేందుకు ఇంట్లోకి వెళ్లాడు. సామాన్లు బయటపడేస్తుండగా ఈ హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది.


రిషి చెప్పిన వివరాలు ప్రకారం మృతురాలు ధనలక్ష్మిగా గుర్తించినా.. దాన్ని నిర్ధారించేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్ కు నమూనాలు పంపించారు. నిందితుడ్ని కోర్టు అనుమతితో పోలీసు కస్టడీకి తీసుకుని లోతుగా విచారించనున్నారు. అయితే.. ఈ కేసులో ముందుగా ప్రచారం జరిగినట్టు.. దిల్లీ యువతి తరహాలో మృతదేహాన్ని ముక్కలుగా చేయలేదని పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: