కేసీఆర్‌.. తెలంగాణ సాధించిన ధీరుడు.. అయితే.. తెలంగాణకే పరిమితం కాకుండా ఆయన దేశ్‌కీ నేత కావాలనుకుంటున్నారు. మరి అలాంటి సమయంలో ఆయన విశాల దృక్పథం అలవరుచుకోవాలని నేతలు సూచిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో జీ-20 శిఖరాగ్ర సమావేశానికి భారతదేశం ఆతిథ్యం ఇస్తున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీల అధినేతల అభిప్రాయాలను సేకరించే నిమిత్తం ప్రధానమంత్రి నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గైర్హాజరు కావడం చర్చకు దారి తీస్తోంది.


దేశానికి సంబంధించిన కార్యక్రమానికి కేసీఆర్ డుమ్మా కొట్టడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అరవింద్‌ కేజ్రీవాల్,  మమతా బెనర్జీ, స్టాలిన్‌ వంటి మోదీ వ్యతిరేకులు కూడా ఈ భేటీకి వచ్చారు. ఇలాంటి భేటీకి కేసీఆర్ డుమ్మా కొట్టడం విచారకరమని బీజేపీ రాష్ర్ట వ్యవహారాల ఇంచార్జీ తరుణ్‌ చుగ్‌ మండిపడ్డారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం సాధించిన ఈ అపూర్వ విజయం ప్రతి భారతీయుడికి గర్వకారణమని తరుణ్‌ చుగ్‌  అన్నారు. విశ్వవ్యాప్తంగా ఉన్న భారతీయులు దీనిని వేడుకగా జరుపుకుంటున్నారన్న తరుణ్‌ చుగ్‌ .. సమాఖ్య స్పూర్తితో ప్రధానమంత్రి దిల్లీలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేశారన్నారు.


సైద్ధాంతిక భావజాలాలకు అతీతంగా రాజకీయ పార్టీల అధినేతలు, ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరై తమ విలువైన సూచనలు ఇచ్చారని తరుణ్‌ చుగ్‌  చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఈ సమావేశానికి గైర్హజరై తెలంగాణ ప్రజలను అవమానించారన్న తరుణ్‌ చుగ్‌..  కేసీఆర్‌కు రాజ్యాంగం పట్ల దేశం పట్ల గౌరవం లేదని విమర్శించారు. ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చిన కనీసం మర్యాదపూర్వకంగా స్వాగతం పలికేందుకు కూడా కేసీఆర్‌ ముందుకు రాలేదని తరుణ్‌ చుగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.


గతంలో బాలాకోట్ సర్జికల్ స్ర్టైక్‌కు రుజువులు చూపించమని కేసీఆర్ అడిగారని తరుణ్‌ చుగ్‌  గుర్తు చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా సైన్యం భారత్‌ను దంచికొడుతుందంటూ మన సైన్యాన్ని కించపరిచారని తరుణ్‌ చుగ్‌  దుయ్యబట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: