ఏపీకి దాదాపు 9 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంలో భాగంగా ఏపీ రాష్ట్రంలో పంప్డ్‌ స్టోరేజ్, హైడ్రో ప్రాజెక్ట్స్‌ను ప్రోత్సహించేందుకు  ఆంధ్రప్రదేశ్‌ పంప్డ్‌ స్టోరేజ్‌ పవర్‌ ప్రమోషన్‌ పాలసీ –2022 ఏర్పాటుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఒక్కో మెగావాట్‌కు రూ.2 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వానికి కంపెనీలు చెల్లించనున్నాయి. ఈ కంపెనీలు రైతుల నుంచి భూములు తీసుకుంటే లీజు రూపేణా ఎకరాకు రూ.30వేల చొప్పున ఏడాదికి లబ్ధి కలుగుతుంది.


ప్రతి రెండేళ్లకు 5శాతం లీజు రుసుము పెంపు ద్వారా రైతుకు మరింత లబ్ధి చేకూరనుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదకోట, విజయనగరం జిల్లాలో రైవాడ ప్రాజెక్టు పరిధిలో మొత్తం 1600 మెగావాట్ల పంప్డ్‌ హైడ్రో స్టోరేజ్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌కు ఏపీ సర్కారు అనుమతులు మంజూరు చేసింది. అలాగే వైయ‌స్‌ఆర్‌ జిల్లా సోమశిల వద్ద 900 మెగావాట్లు, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎర్రవరం వద్ద 1200 మెగావాట్ల సామర్ధ్యంతో పంప్డ్‌  హైడ్రో స్టోరేజ్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు శ్రీ షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌కు అనుమతులు మంజూరు చేసింది.


అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు వద్ద 1350 మెగావాట్ల సామర్ధ్యంతో అప్పర్‌ సీలేరు పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టు నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులను ఏపీ సర్కారు మంజూరు చేసింది. వైయస్‌.జగన్‌ అధ్యక్షతన స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు ఆమోదించిన వైఎస్‌ఆర్‌ జిల్లా సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఓకే చెప్పింది. ఈ సంస్థల ద్వారా  2 మిలియన్‌ టన్నులు ఉత్పతి కానుంది. భవిష్యత్తులో మరో 2.5 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సాధించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పనకు కూడా సర్కారు ఆమోదం తెలిపింది. దీంతో మొత్తం రూ.8,880 కోట్ల పెట్టుబడి ఏపీకి రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

ap