ఆయిల్‌పాం సాగులో తెలంగాణ రికార్డులు సాధిస్తోంది. కేవలం ఏడాదిలో దేశంలో ఒక రాష్ట్రంలో 50 వేల ఎకరాల్లో ఆయిల్‌పాం మొక్కలు నాటి తెలంగాణ రికార్డు సృష్టించింది. మార్చి లోపు 1.2 లక్షల ఎకరాల విస్తీర్ణంలో అదనంగా ఆయిల్‌పాం సాగులోకి తీసుకురాబోతోంది. తెలంగాణ రాష్ట్రంలో 11 ఆయిల్‌పాం కంపెనీల ద్వారా 1502 ఎకరాల విస్తీర్ణంలో 38 ఆయిల్‌పాం మొక్కల నర్సరీల ఏర్పాటు చేశారు. ఆయిల్‌ పాం మొక్కలు నాటేందుకు అందుబాటులో నిధులు ఉన్న దృష్ట్యా కేవలం ఏడాదిలో 52 వేల ఎకరాల్లో ఆయిల్‌పాం మొక్కలు నాటి తెలంగాణ రికార్డు సృష్టించింది. వచ్చే మూడు నెలల్లో 70 వేల ఎకరాలలో మొక్కలు నాటడం పూర్తి కావాలని తెలంగాణ లక్ష్యంగా పెట్టుకుంది.


2023-24లో నాటేందుకు కోటి ఆయిల్‌పాం మొక్కలు అందుబాటులో ఉన్నందున అవి మరో లక్ష 50 వేల ఎకరాలకు సరిపోతాయి. ప్రాసెసింగ్ మిల్లుల ఏర్పాటుకు ఆయిల్‌ ఫెడ్‌ సంస్థ ద్వారా 458 ఎకరాల భూమి సేకరణ కూడా పూర్తైంది. నిర్మల్, వనపర్తి, మంచిర్యాలలో ప్రాసెసింగ్ మిల్లుల ఏర్పాటుకు ప్రీ యూనిక్, మ్యాట్రిక్స్ కంపెనీలకు టీఎస్ ఐఐసీ ద్వారా భూమి కేటాయింపుకు తెలంగాణ  ప్రభుత్వం ఆమోదించింది. మిగతా కంపెనీలకు ప్రాసెసింగ్ మిల్లుల ఏర్పాటుకు భూమి కేటాయించేందుకు ధరఖాస్తుల పరిశీలనలో ఉంది.


ఆయిల్‌ పాం సాగు ప్రోత్సహించేందుకు వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు దృష్టి పెట్టడంతోపాటు కంపెనీలు గ్రామాల వారీగా అవగాహన సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.  రైతు వేదికల్లో శిక్షణలు ఇప్పించడంసహా ఆయిల్‌ పాంపై ఆదాయం వచ్చే వరకు రైతులు అంతర పంటలు వేసుకునేందుకు రైతులకు అవగాహన, చైతన్యం కల్పించనున్నారు. కామారెడ్డి జిల్లా బొప్పాస్ పల్లి విత్తన క్షేత్రంలో ఆయిల్‌పాం రీసెర్చ్ గార్డెన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే  నల్లగొండ జిల్లా డిండి వ్యవసాయ క్షేత్రం, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం మాల్ తుమ్మెద విత్తన క్షేత్రంలో ఆయిల్‌పాం మొక్కల క్షేత్రాల ఏర్పాటు సంబంధించి పరిశీలన చేయాలని తెలంగాణ  నిర్ణయించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: