ఇక ఢిల్లీకి చెందిన సలోని భరద్వాజ్ ఇంగ్లండ్‌లోని 'యూనివర్సిటీ ఆఫ్‌ షెఫీల్డ్‌'లో చదివారు. ఆ తర్వాత ఆమె యూకేలోని బీబీసీ రేడియోలో పనిశారు. సలోని విదేశాల్లో ఉన్నప్పుడు ఎన్నో రకాల వాలంటరీ యాక్టివిటీస్‌లో పాల్గొనేవారు. యూఎస్ వెళ్లి అక్కడ మహిళల కోసం సిన్సినాటి నిధుల సేకరణలో పాల్గొన్నారు. తర్వాత ఆమె ఇండియాకు తిరిగి వచ్చినప్పుడు ఇక్కడ వాలంటీర్‌గా సేవ చేయడం కోసం 'లోటస్ పెటల్' అనే ఒక స్కూల్‌కు వెళ్లారు. చిన్న గదిలో ఉన్న ఆ స్కూల్లో ఏడుగురు పిల్లలు మాత్రమే ఉన్నారు. మురికివాడల్లోని పిల్లల కోసం నడుపుతున్న ఆ స్కూల్‌లో ఎలాంటి వసతులు, టీచర్లు లేకపోవడం చూసి దాన్ని మార్చాలనుకున్నారు. వెంటనే ఉద్యోగం మానేసి అందులో చేరారు. ఆమె ఎంతో కష్టపడి ఆ స్కూల్ రూపురేఖల్ని పూర్తిగా మార్చేశారు.గురుగ్రామ్‌లోని మురికివాడలో మొదలైన ఈ స్కూల్‌లో ఏడుగురు స్టూడెంట్స్, ఒక మ్యాథ్స్ టీచర్ ఉండేవాడు. మూడు కంప్యూటర్లు మాత్రమే ఉండేవి. స్కూల్‌ను కిరాయి గదిలో నడిపే వాళ్లు. అయితే సలోని రాకతో ఈ స్కూల్ రూపం పూర్తిగా మారిపోయింది. నిధులు సేకరించి, విరాళాల సాయంతో స్కూల్‌ను వేరే బిల్డింగ్‌లోకి మార్చారు సలోని. దాంతో స్కూల్‌లో స్టూడెంట్స్‌తో పాటు, ప్రోగ్రామ్స్ కూడా పెరిగాయి.


ప్రస్తుతం ఈ స్కూల్‌లో 1,400 మంది స్టూడెంట్స్, 160 మంది స్టాఫ్ ఉన్నారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు రెండు క్యాంపస్‌లు ఉన్నాయి. ఇక్కడ ఎడ్యుకేషన్ పూర్తిగా ఫ్రీ. ఇందులో ఫౌండేషన్‌ టైలర్డ్‌ ప్రోగ్రాం, ప్రతిష్టాన్‌ లెర్నింగ్‌ సెంటర్‌, ఫాస్ట్‌-ట్రాక్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్స్ వంటి అడ్వాన్స్‌డ్ ప్రోగ్రామ్స్‌ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ 11, 12 తరగతుల్లో కంప్యూటర్‌ బేసిక్స్‌, డేటా ఎంట్రీ, ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌ వంటి ట్రైనింగ్ కోర్సులతో పాటు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ లాంటి ఇతర సబ్జెక్టులు కూడా ఉంటాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే మురికివాడల్లోని పిల్లల కోసం ఏర్పాటు చేసిన కార్పొరేట్ తరహా మోడల్ స్కూల్ ఇది. ఇక్కడి లెర్నింగ్ మెథడ్స్ ఎంత పాపులర్ అంటే.. వాటి కోసం ఇతర స్కూల్స్ కూడా లోటస్ పెటల్‌ స్కూల్‌ను కాంటాక్ట్ చేస్తుంటాయి.ఒక చిన్న గదిలో 2012లో మొదలైన ఈ స్కూల్ ప్రస్తుతం ఐదు ఎకరాల స్థలంలో ఉంది. కార్పొరేట్ స్కూళ్లలో ఉన్న సౌకర్యాలతో పాటు సీబీఎస్‌ఇ సిలబస్ కూడా ఉంది. ఈ మధ్యనే ఇ-లెర్నింగ్‌ మాడ్యూల్‌ మొదలైంది. దీని ద్వారా రాజస్తాన్‌, ఒరిస్సా, ఉత్తరాఖండ్‌తో సహా ఐదు రాష్ట్రాల్లోని పిల్లలకు చదువు చెప్తున్నారు. త్వరలో మరిన్ని రాష్ట్రాలకు ఈ సదుపాయాలను విస్తరించే ఆలోచనలో ఉన్నామని స్కూల్ స్టాఫ్ చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: