అప్పుడెప్పుడో 2010లో వ‌చ్చిన రోబో సినిమా త‌ర్వాత ర‌జ‌నీ వ‌రుస పెట్టి కుర్రాడిలా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడే త‌ప్పా ఒక్క హిట్లు బొమ్మ కూడా లేదు. కుర్రాళ్ల‌తో పోటీ ప‌డుతూ సినిమాలు చేస్తే సరిపోదు.. త‌న వ‌య‌స్సుకు త‌గ్గ‌ట్టు పాత్ర‌లు ఎంచుకోవాలి... క‌థ‌లు ఎంపిక చేసుకోవాలి... స‌రైన డైరెక్ట‌ర్‌ను ప‌ట్టుకోవాలి. ఎవ‌రో ఒక‌రు వ‌చ్చి క‌థ చెప్పారు... డ‌బ్బులు పెట్టేందుకు నిర్మాత ఎవ‌డో ఒక‌డు దొరికేశాడు క‌దా అని సినిమా తీస్తే కాలాలు, క‌బాలీలు, లింగాలు ఇప్పుడు ద‌ర్బార్‌లు అయ్యి కూర్చుంటాయి.

 

ఓ డ్ర‌గ్ మాఫియా, దానిని చేధించే క్ర‌మంలో కూతురును విల‌న్లు చంపేస్తే వాళ్ల‌పై హీరో రివేంజ్ తీర్చుకోవ‌డం ఈ త‌ర‌హా క‌థ‌ల‌తో 1970వ ద‌శ‌కంలోనే తెలుగులో కోకొల్లులుగా సినిమాలు వ‌చ్చేశాయి. అలాంటి మూస‌, ముత‌క‌, రొట్ట క‌థ‌తో ర‌జ‌నీ ఎందుకు ?  సినిమా చేయాల‌నుకున్నాడో ? అందులోనూ మురుగ‌దాస్‌తో ఈ సినిమా ఎందుకు చేసిన‌ట్టో ఈ సినిమా చూసిన కామ‌న్ ఆడియెన్స్‌కే కాదు.. ర‌జ‌నీ అంటే ర‌క్తం చిందించే వీరాభిమానుల‌కే అర్థం కాలేదు.

 

సినిమా ఫ‌స్టాఫూ లేదు.. సెకండాఫూ లేదు... ఆ సీనూ లేదు.. ఏ సీనూ లేదు... ఏవో ఒక‌టి రెండు సీన్లు త‌ప్పిస్తే అంతా పాత య‌వ్వార‌మే అన్న‌ట్టుగా ఉంది. ప్రమాదంలో గాయపడిన వల్లీ (నివేథా థామస్‌) మరో రెండు గంటల్లో చనిపోతుందని, బ్రెయిన్‌ హ్యామరేజ్‌ గురించి డాక్టర్‌ ఆమెతో సుదీర్ఘంగా సంభాషించడం ఏమాత్రం తర్కానికి అందదు. ఆమె ప‌రిస్థితి విష‌యంగా ఉంటే డాక్ట‌ర్లు వైద్యం చేయ‌కుండా ఆమెతో తీరిగ్గా మాట్లాడుతూ కూర్చుంటారు. ఇలాంటి వైద్య‌శాస్త్రం, డాక్ట‌ర్లు ఎంత క‌ర్క‌శులు అయినా నిజ జీవితంలో కూడా ఉండ‌రేమో అన్న‌ట్టుగా ఉంటుంది.

 

ఇక హీరోయిన్ న‌య‌న‌తార సినిమాలో ఎందుకు ఉందో ? ఎవ్వ‌రికి అర్థం కాదు. ఆ మాత్రం రోల్‌కు అస‌లు ఆమె ఉంటే ఏం.. లేక‌పోతే ఏం అన్న‌ట్టుగా ఉంది. ర‌జ‌నీ బిడ్డ‌గా నివేధ థామ‌స్ రోల్ మాత్రం క‌దిలించింది. ఇక 2.0లో విల‌న్ కోసం అక్ష‌య్‌కుమార్‌ను తీసుకువ‌చ్చి శంక‌ర్ విఫ‌ల‌మైతే... ఈ సినిమా కోసం మురుగ‌దాస్ సునీల్‌శెట్టిని పెట్టి ఆయ‌న ప‌రువు తీసేశాడు. విల‌న్‌గా సునీల్‌శెట్టి పాత్ర పేలవంగా సాగింది. ఆయన స్థాయి నటుడు చేయాల్సిన పాత్ర కాదేమో అన్న భావన కలుగుతుంది. యోగిబాబు కామెడీలో ఎలాంటి ఛమక్కులు లేక విసిగిస్తుంది. అనిరుధ్‌ సంగీతం ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఒక్క పాట గుర్తుంచుకునే విధంగా లేదు.

 

అనిరుధ్ లౌడ్‌లో ముక్క‌లైన ఆ పదాల‌కు అర్థాలు చెప్పిన వాళ్ల‌కు తెలుగు సాహిత్యంలో ఓ 10-15 డిగ్రీలు ఇచ్చి ప‌డేయొచ్చు. ఆ లైకా వాళ్లు ఎప్పుడూ భారీ కాంబినేష‌న్లు అంటూ సెట్ చేయ‌డం.. సినిమాల‌కు ముందు ఏదో ఒక వివాదాల్లో ప‌డ‌డం మామూలు అవుతున్నా..ఈ సినిమాకు కూడా డ‌బ్బులు గ‌ట్టిగానే పెట్టిన‌ట్లుంది. ఏడు ప‌దుల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీ సినిమా వ‌స్తుందంటే జ‌నాలు థియేట‌ర్ల ద‌గ్గ‌ర అర్ధ‌రాత్రి నుంచే క్యూలో టిక్కెట్ల కోసం కాచుకుని కూర్చొనే ఉంటారు. రెండు రోజుల ముందు నుంచే పండ‌గ చేసుకుంటారు. కానీ ర‌జ‌నీ మాత్రం త‌న అభిమానుల‌ను కూడా ప‌దేళ్లుగా మెప్పించ లేక‌పోతున్నాడు.

 

ర‌జ‌నీ వేగంగా సినిమాలు తీయ‌డంలో ప‌రిగెత్త‌డం కాదు... త‌న సినిమాలు వ‌స్తున్నాయంటే ప్ర‌తి ఒక్క ప్రేక్ష‌కుడు థియేట‌ర్ల‌కు ప‌రిగెత్తుకుని వెళ్లి సినిమా చూసే లాంటి క‌థ‌ల‌తో సినిమాలు తీయాలి. ఏదేమైనా మ‌రోసారి ద‌ర్బార్‌తో ర‌జ‌నీ ఊసురోమ‌నిపించాడు. ఇటు ర‌జ‌నీకి, అటు ర‌జ‌నీ ఫ్యాన్స్‌కు నెక్ట్స్ టైం బెట‌ర్ ల‌క్ అని ఈ సారికి స‌రిపెట్టేసుకోవ‌డ‌మే..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: