వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏదో ఒక విధంగా ఈ ప్ర‌భుత్వంపై అరాచ‌కం అనో.. నేర ప్ర‌భుత్వం అనో.. విధ్వంస‌క‌ర ప్ర‌భుత్వం అనో ముద్ర వేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నా రు.. అనేది మేధావుల మాట‌. ఈ క్ర‌మంలోనే ఆయ‌న రాష్ట్రంలో జ‌రుగుతున్న ప్ర‌తి ప‌రిణామాన్నీ త‌న‌కు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అయితే, ఇలా చంద్ర‌బాబు ఎంత యాగీ చేసినా, రాజ్యాంగ బ‌ద్ధ సంస్థ‌ల‌కు ఫిర్యాదులు చేసినా కూడా అనుకున్న‌ది సాధించ‌లేక పోతున్నారు. ఎవ‌రూ కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని త‌ప్పుప‌ట్టే ప‌రిస్థితిని క‌ల్పించేలేక పోతున్నారు.

 

గ‌తంలో త‌న పార్టీ కార్య‌క‌ర్త‌లు, నేత‌ల‌పై వైసీపీ ప్ర‌భుత్వ ఉక్కుపాదం మోపుతోంద‌ని, పోలీసులు రౌడీల మాదిరిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చంద్ర‌బాబు ఊరూవాడా పెద్ద ఎత్తున యాగీ చేశారు. గుంటూరు జిల్లా ఆత్మ‌కూరులో త‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు గ్రామ బ‌హిష్కారం చేశార‌ని, ఓ గ్రామంలో ద‌ళితులు వెళ్లేందుకు వీలు లేకుండా అడ్గుగా రోడ్డును నిర్మించార‌ని ఆయ‌న ఇసుక‌, ఉల్లిపాయ‌ల ఉద్య‌మాల‌కు ముందు దీనిని పెద్ద ఎత్తున భుజానేసుకున్నారు.

 

ఈ  క్ర‌మంలోనే తగుదున‌మ్మా అంటూ టీడీపీ ఎంపీలు ఏకంగా జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేశారు. అంతేకాదు, క‌మిష‌న్ సభ్యుల‌ను గుంటూరుకు తీసుకువ‌చ్చి ఆత్మ‌కూరులో ఊరూవాడా తిప్పారు. వారు ఇల్లిల్లూ.. వీధి వీధి తిరిగారు. ప్ర‌తి ఒక్క‌రినీ ఇంట‌ర్వ్యూ చేశారు. దీంతో ఇక‌, జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి జాతీయ స్తాయిలో మొట్టికాయ‌లు ప‌డ‌తాయ‌ని టీడీపీ నాయ‌కులు భావించారు. అయితే, అనూహ్యంగా హ‌క్కుల క‌మిష‌న్ స‌భ్యులు ఏపీ పోలీసుల‌కు, ప్ర‌భుత్వానికి కూడా క్లీన్ చిట్ ఇచ్చి వెళ్లారు. దీంతో బాబు స‌హా త‌మ్ముళ్లు మౌనంపాటించారు. 

 

ఇక‌, ఇప్పుడు రాజ‌ధానిలో మ‌హిళ‌ల‌పై పోలీసులు లాఠీ చార్జ్ చేశార‌నే వార్త‌ల‌తో సుమోటోగా స్పందించి న జాతీయ మ‌హిళా క‌మిష‌న్ స‌భ్య‌లు కూడాఇక్క‌డ ప‌ర్య‌టించారు. అయితే, వీరు కూడా ఇక్క‌డ అంతా నిబంధ‌న‌ల మేర‌కే పోలీసులు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వ్యాఖ్యానించ‌డంతోపాటు.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి చ‌ర్య‌ల‌కూ ఆదేశించ‌లేదు. దీంతో అప్పుడు ఇప్పుడు కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వం కాకుండా చంద్ర‌బాబే ప‌ల‌చ‌న‌య్యార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. గోరంతలు కొండంత‌లు చేస్తున్నార‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: