అయోమయం దేవాలయం అన్నట్టుగా తయారైపోయింది జనసేన పార్టీ పరిస్థితి. ఈ మాట అంటే జన సైనికులకు కోపం రావచ్చు ఏమో కానీ..! వాస్తవాలు మాట్లాడుకుంటే మొదటి నుంచి పవన్ రాజకీయాల్లో తప్పటడుగులు వేస్తూనే వస్తున్నారు. అసలు తాను రాజకీయాల్లోకి ఏ ఉద్దేశంతో  వచ్చారు..?  ఈ ఉద్దేశంతో ఇలా వ్యవహరిస్తున్నారు అనేది సామాన్య ప్రజలకే కాదు.. ఆ పార్టీ నాయకులకు, పవన్ చుట్టూ ఉండే వారికి కూడా అర్థం కావడంలేదు. దీనంతటికీ కారణం పవన్ రాజకీయాల్లో అనుమానాస్పదంగా వ్యవహరించడమే. ఏ విషయం పైన క్లారిటీ లేకుండా స్పందించడం, ఆ తరువాత వాస్తవం తెలుసుకుని సైలెంట్ అయిపోవడం పవన్ కు మొదటి నుంచి అలవాటుగా మారిపోయింది. 


జనసేన పార్టీ పెట్టిన తర్వాత తాను ప్రశ్నించడాని కే పార్టీ పెట్టానని, పదవులు అవసరం లేదంటూ గట్టిగా అరిచి చెప్పాడు. మళ్లీ కొద్దిరోజులకే తనను సీఎం సీఎం అని పిలవాలి అంటూ అభిమానులను అడిగి మరి పిలిపించుకున్నాడు. అంతకు ముందు టిడిపి, బిజెపి పార్టీలకు మద్దతుగా నిలబడి ఎన్నికల ప్రచారం కూడా చేశాడు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆయా ప్రభుత్వాలు అమలు చేయకపోతే ఆ బాధ్యత నాది అని పవన్ బహిరంగంగానే చెప్పాడు. అనుకున్నట్టుగానే కేంద్రంలో బిజెపి, ఏపీలో టిడిపి అధికారంలోకి వచ్చాయి. కానీ పవన్ ఎక్కడా అధికార పార్టీని ప్రశ్నించే సాహసం అయిదేళ్ల కాలంలో చేయలేకపోయారు. 


అప్పుడు ఇప్పుడు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ అధినేత జగన్ ను టార్గెట్ గా చేసుకుని పవన్ విమర్శలు చేస్తున్నారు. విమర్శలు చేయడంలో తప్పులేదు కానీ ఏ విషయాల పై విమర్శలు చేయాలి..?  ఏ విషయాల పై చేయకూడదు అనే విషయాన్ని మరిచిపోయి, రాజకీయంగా ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి తాను స్పందిస్తున్నాను అన్నట్లుగా పవన్ వ్యవహరిస్తూ వస్తున్నారు.


 కొద్ది రోజుల క్రితం హడావిడిగా ఢిల్లీకి వెళ్లి బీజీపీతో పొత్తు పెట్టుకున్న పవన్ ఆ తర్వాత బిజెపి వ్యవహారశైలి తెలిసి రావడంతో ఏపీకి వచ్చి బీజేపీతో తెగదెంపులు చేసుకుంటాను అన్నట్లుగా మాట్లాడారు. అంతకు ముందు అమరావతి విషయంలోనూ ఓ సందర్భంలో మాట్లాడుతూ అమరావతికి బిజెపి మద్దతు ఇస్తానన్నది కాబట్టి తాను బీజేపీతో పొత్తు పెట్టుకున్నాను అని చెప్పారు.  పవన్ మూడు రోజుల క్రితం అమరావతి కి వెళ్లి రాజధాని అంశం కేంద్రం పరిధిలోని కాదని, పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని, దీంట్లో బిజెపి నిందించడం తప్పు అని మాట్లాడారు. దీంతో అక్కడి జనాలు కూడా పవన్ వ్యవహారశైలి ఏంటో అర్థమైంది. 


పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నవారిలో ఇప్పుడు ఎంతమంది పవన్ ను అంటిపెట్టుకున్నారు అని ఆరా తీస్తే ఆ పార్టీలో ఉన్న పరిస్థితి ఏమిటో అర్థం అయిపోతుంది. ఇప్పుడు కూడా బీజేపీతో పొత్తు బెడిసికొడితే ఏమైంది తెలుగుదేశం ఉందిగా అన్నట్లుగా పవన్ వ్యవహరిస్తుండడంతో ఆయనపై ఇంకా జనాల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి. అసలు పవన్ రాజకీయాలకు సెట్ అవుతారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పవన్ కూడా ఇదే డౌట్ ఉందో ఏమో తెలియదు కానీ గతంలో తాను సినిమాల్లో నటించను అని చెప్పి ఇప్పుడు ఆ సంగతి మరిచిపోయి సినిమాలు చేసుకుంటున్నాడు. 


పవన్ ఒక పక్క సినిమాల్లో నటిస్తూ మరోపక్క రాజకీయాల్లో కూడా రాణించడం లో తప్పులేదు. కానీ ఇలా ఆయనే స్టేట్మెంట్లు ఇచ్చి ఆయనే వాటిని పాటించకుండా, క్లారిటీ లేకుండా వ్యవహరించడంపైనే విమర్శలు వస్తున్నాయి. పవన్ వ్యవహార శైలి కారణంగా ఎక్కువగా ఇబ్బంది పడేది ఆయన అభిమానులు, జనసేన పార్టీ నాయకులే. ఎందుకంటే పవన్ చేస్తున్నవి వ్యూహాత్మక తప్పిదాలు అని తెలిసినా వారు ఆయన మీద ఉండే అభిమానం తో వాటిని బహిరంగంగా ఒప్పుకునేందుకు ఇష్టపడలేక.. పవన్ మీద అభిమానాన్ని చంపుకోలేక సతమతం అయిపోతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: