తెలంగాణ బీజేపీలో పాత నాయ‌కుల‌పై జాతీయ నాయ‌క‌త్వానికి న‌మ్మ‌కం పోయిన‌ట్లుంది. మీరు వేస్ట్ మీ మీద మాకు న‌మ్మ‌కాల్లేవ్ అంటూనే దూకుడు రాజ‌కీయాల‌కు పెట్టింది పేరు అయిన క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్‌కు తెలంగాణ బీజేపీ ప‌గ్గాలు అప్ప‌గించారు. ఇక గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల నాటి నుంచి తెలంగాణ బీజేపీకి వెల‌గ పెట్టింది ఏంట‌న్న‌ది చూస్తే 2018లో ఆ పార్టీ ఇర‌వై ఏళ్ల ప‌త‌న స్థితికి చేరిపోయింది. పార్టీకి ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేల్లో కేవ‌లం ఒకే ఒక్క ఎమ్మెల్యే మాత్ర‌మే గెలిచారు. కిష‌న్‌రెడ్డి, పార్టీ అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ లాంటి వాళ్లు చిత్తుగా ఓడిపోయారు. అయితే 2019లో మాత్రం పెద్ద ఊర‌ట ల‌భించింది. ఈ సంవ‌త్స‌రం తెలంగాణ‌లో బీజేపీ వెలిగిపోయింది. 2019లో కొన్ని అద్వితీయ‌మైన విజ‌యాల‌ను అందుకుని భ‌విష్య‌త్‌పై ఆశాజ‌న‌కంగా ముందుకు సాగుతోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కేవ‌లం ఒక్క‌సీటుకే ప‌రిమిత‌మైన బీజేపీ పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో మాత్రం ఏకంగా నాలుగు సీట్ల‌ను గెలుచుకోవ‌డం విశేషం. 

 

ఆదిలాబాద్‌, కరీంన‌గ‌ర్‌, నిజామాబాద్‌, సికింద్రాబాద్ స్థానానాలను కైవ‌సం చేసుకుని బీజేపీ అధిష్ఠానం సైతం ఆశ్చ‌ర్య‌పోయే ఫ‌లితాల‌ను న‌మోదుకావ‌డం విశేషం.  టీఆర్ఎస్ కంచుకోట అయిన ఉత్త‌ర తెలంగాణ‌లో ఏకంగా బీజేపీకి మూడు ఎంపీ సీట్లు వ‌చ్చాయి. ఇందులో డి శ్రీనివాస్ త‌న‌యుడు అర‌వింద్ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌య క‌విత‌పై భారీ మెజార్టీతో విజ‌యం సాధించ‌డం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీసింది.బీజేపీ కొట్టిన దెబ్బ‌కు క‌ల్వకుంట్ల కుటుంబం ఇంకా స్పృహ‌లోకి రాలేద‌ని బీజేపీ శ్రేణులు సెటైర్లు వేస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఇక అదేస్థాయిలో పార్టీ వ్య‌వస్థాప‌క స‌భ్యుడిగా టీఆర్ ఎస్‌లో కొన‌సాగుతున్న వినోద్‌కుమార్‌పై క‌రీంన‌గ‌ర్‌లో బండి సంజ‌య్ అద్భుత విజ‌యం సాధించారు. యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించారు. 

 

వాస్త‌వానికి అప్ప‌టి నుంచే సంజ‌య్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి రేసులోకి వ‌చ్చారు. అదే ఆదిలాబాద్‌లో సోయం బాపురావు ఎలాంటి అంచ‌నాల్లేకుండా సైలెంట్‌గా త‌న విజ‌యాన్ని న‌మోదు చేసి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ మ‌న‌సును కూడా చూర‌గొన‌డం విశేషం. అంబ‌ర్‌పేట్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన కిష‌న్‌రెడ్డి తిరిగి సికింద్రాబాద్ ఎంపీగా విజ‌యానందుకున్నారు. ఇప్పుడు కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రిగా ఉన్నారు. అయితే ఈ ఊపు పార్ల‌మెంటుకు ప‌రిమిత‌మైంది. పార్టీని న‌డిపించే నాథుడు.. టీఆర్ఎస్‌ను ఢీ కొడుతూ కేసీఆర్ ఛ‌రిష్మా ముందు నిల‌బ‌డే నాయ‌కులే పార్టీలో లేకుండా పోయారు. 

 

హుజూర్‌న‌గ‌ర్  ఉప  ఎన్నిక‌లో పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న జ‌రిగింది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ బీజేపీ ఘోర ప‌రాజ‌యంతో స‌రిపెట్టుకుంది. మ‌రీ ఘోరంగా కాంగ్రెస్‌తో చేతులు క‌ల‌ప‌డం కూడా ఆ పార్టీ ప‌రువు తీసేసింది. వ‌చ్చే ఐదేళ్లలో పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని అధిష్ఠానం, రాష్ట్ర ముఖ్య‌నేత‌లు ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్ర‌త్యామ్నాయం తామేన‌ని, కాంగ్రెస్ స్థానాన్ని ఆక్ర‌మించి ఆ త‌ర్వాత అధికార పీఠంపైకి చేరుకోవాల‌ని బీజేపీ చూస్తోంది. ఇక అక్క‌డ‌క్క‌డా పార్టీకి బ‌ల‌మైన నాయ‌కులు ఉన్నా చాలా జిల్లాల్లో అస్స‌లు కేడ‌రే లేదు. ఇక ఇప్పుడు దూకుడు స్వ‌భావం ఉన్న బండి సంజ‌య్‌కు తెలంగాణ అధ్య‌క్ష ప‌గ్గాలు ఇవ్వ‌డంతో ఆయ‌న అయినా టీఆర్ఎస్‌ను ఢీ కొట్టి ఇక్క‌డ పార్టీని అధికారంలోకి తీసుకు వ‌స్తాడా ?  తెలంగాణలో బీజేపీకి వెలిగేంత సీన్ ఉందా ? అన్న‌ది చూడాలి.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: