పెళ్లి కుదిరింది అని గంతులేసుకుంటూ నిశ్చితార్ధం చేసుకునేందుకు పిల్ల ఇంటికి ఓ ఇరవైమంది చుట్టాలనేసుకుని ఎగేసుకుని కర్ణాటకలోని రాయచూర్ రైలెక్కేశాము. ఇంకా చాలామంది చుట్టాలని రమ్మని పిలిచాం. కానీ భీమవరం - రాయచూరు మధ్య వారానికి అటు నుంచి ఇటు నుంచి కూడా ఒక్కటే ట్రైన్ ఉంది. వా...రం రోజులా ..? ఓరి బాబో మేము అన్ని రోజులు ఉండలేము కానీ మీరు వెళ్ళొచ్చేయండ్రా అని హ్యాండ్ ఇచ్చేసారు మా సుట్టాలు. పోనీ మీరైనా రండ్రా అంటే మా ఫ్రెండ్స్ కూడా అంతే. ఆ వచ్చినోళ్లల్లో ఓ పదిమంది మా ఫ్యామిలీ ఉంటే.. మిగతావోళ్ళు మాత్రం మొహమాటానికి వచ్చిన మా సుట్టాలు. సర్లే మొత్తానికి నిచ్చితార్దానికి మూడు రోజుల ముందే పిల్లగలోళ్ళ ఇంటి ముందు వాలిపోయాం. సుట్టాలకు మర్యాదలు బాగానే చేశారు. 

 

IHG


నాటు కోళ్లు, కాలవ చేపలు అబ్బో బాగానే మర్యాదలు దొరికేసాయ్. ఫంక్షన్ పెట్టారు ఈ ఊరోళ్లందరూ కలిసి ఓ 200 మంది తో ఫంక్షన్ అదిరిపోయింది. ఫంక్షన్ రెండ్రోజుల తరువాత ట్రైన్ ఎక్కడానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయచూరుకి లగేజి పట్టుకుని రైలెక్కేద్దామని వెళ్ళాం. అక్కడ అసలు సంగతి తాతీయగా చెప్పారు. ఓరి బాబు ట్రైన్ లు ఆపేశాం మీ డబ్బులట్టుకుపోండి అంటూ రిజర్వేషన్స్ క్యాన్సిల్ చేసేసారు. పోన్లేరా బాబు అనుకుని బస్సు ఎక్కేద్దామంటే దూరాలు ఎల్లే బస్సులు అన్ని ఆపేశాం అంటూ చావు కబురు చల్లగా చెప్పలేసారు. ఇక చేసేది లేక మళ్ళీ పిల్లొళ్ళింటికి వెనక్కి వచ్చేసాం. అన్నట్టు ఈ ఊరు గురించి చెప్పలేదు కాదు. కర్ణాటకలో ఓ మారుమూల పల్లెటూరు. ఎంత పల్లెటూరు అంటే కనీసం ఎక్కడికైనా ఎల్దమ్ అంటే ఆటో కూడా ఉండని నారాయణ క్యాంప్ అనే గోదావరి వాసులు ఉండే ఓ అసలు సిసలైన పల్లెటూరు. 

 

IHG


 ఏది కావాలన్నా ఓ ఐదు కిలోమీటర్ల దూరం లో ఉన్న బలగనూరు వెళ్లాల్సిందే. ఇక వెనక్కి వచ్చేసాం కదా ! రేపు జనతా కర్ఫ్యూ అయ్యాక యెల్లి మళ్ళీ ఏ బస్సో , రైలు బండో, అది లేకపోతే రెండు కార్లు మాట్లాడుకుని మా ఊరు వెల్లిపడిపోదాం అంటే అప్పుడు చావు కబురు చల్లగా చెప్పారు టీవీలో. ఓరి బాబు కరోనా పెరిగిపోతోంది, ఈ నెలాఖరు వరకు మీరు ఎక్కడోల్లు అక్కడే ఉండండిరో రోడ్ల మీదకు రావొద్దు అంటూ చెప్పడంతో షాక్ అయిపోయాం మాతో వచ్చినోళ్ళు. ఓరి నయానో మరో ఎనిమిది రోజులా ? ఇప్పటికే ఎనిమిది రోజులు ఉన్నామా మళ్ళీ ఎనిమిది రోజులా అంటూ ఢీలా పడిపోయారు మా సుట్టాలు. ఇక పిల్లగలోళ్ళకు తప్పుద్దా ..? మళ్ళీ ఎనిమిది రోజులు భరించాలి కదా ! 


పర్లేదు ఎన్నిరోజులైనా ఉండండి ఏం పర్లేదు అని చెబుతున్నారు. మా సుట్టాలేమో ఇంతమందికి వండి పెట్టడం మాటలా అంటూ మొహమాట పడుతున్నారు. పోనీ ఎల్దామా అంటే ఎల్లేము. ఉండలేము అన్నట్టుగా పరిస్థితి ఉంది. మాకు.. పిల్లగలోళ్ళకి ఎలాగూ తప్పదు. కానీ మా సుట్టాలు మాత్రం తెగ నొప్పులు పడుతున్నారు. మా ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయో అని ఒకరు. మా పెళ్లి రోజు అని ఒకరు, మా పిల్ల పెళ్లి మరో 15 రోజుల్లో ఉందని ఒకరు. ఇలా ఎవరికీ వారు ఉండలేక, వెళ్లలేక చుట్టాలు పెడుతున్న చేపలు, నాటుకోళ్లు, తింటూ కాలక్షేపం చేసేస్తున్నారు. ఇక మా ఊరి నుంచి, మా సుత్తలోళ్ల ఊరి నుంచి ఒరేయ్ మీరు మాత్రం రాకండ్రో మరో పదిరోజులు అక్కడే ఉండండి కొంపలేమీ ములిగిపోవు. ఇక్కడికి వచ్చినా సేసేది ఏమి లేదు అంటూ ఫోన్లు వాయించేత్తున్నారు.


 ఏం కరోనానో ఏంటో తెల్దు కానీ మా సుట్టాలు మాత్రం ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాం నీ పెళ్లి నిశ్చితార్ధం ఎంత పని చేసిందిరా అంటూ నా వైపు దీనంగా చూస్తూ నవ్వుతుంటే ... నా ఫీలింగ్ మాత్రం పైకి చెప్పలేనురా బాబు. 

మరింత సమాచారం తెలుసుకోండి: