మొదటి నుండి జగన్మోహన్ రెడ్డి వైఖరి ఇలాగే ఉంటోంది. ప్రతిపక్షంలో ఉన్నపుడంటే ప్రజా సమస్యల కోసం పోరాటం చేసే వాడు కాబట్టి ఇష్టమున్నా లేకపోయినా మీడియా ఎంతో కొంత కవరేజ్ చేసేది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జనాల్లోకి వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి చేస్తున్న పనులన్నీ జనాలకు తెలియాలంటే  కచ్చితంగా ప్రచారం అవసరమే. కానీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం జగన్ కు ప్రచారం అలవాటు లేదని చెప్పటమే విచిత్రంగా ఉంది. జగన్ కు పనిచేయటమే ముఖ్యం కానీ ప్రచారం అలవాటు లేదని సజ్జల చెప్పటం తప్పే.

 

ప్రచారం అలవాటు లేదని చెప్పటం ఓ విధంగా కరెక్టే కానీ మరో విధంగా తప్పనే చెప్పాలి. ఎందుకంటే పనిచేయటం ఎంత ముఖ్యమో చేసిన పనిని జనాల్లోకి తీసుకెళ్ళటం కూడా అంతే ముఖ్యం.  చంద్రబాబునాయుడు విషయమే తీసుకుంటే ’గోరంత పని చేసి కొండంత ప్రచారం’ చేసుకోవటం బాగా అలవాటు. చివరకు ఆ అలవాటే మొన్నటి ఎన్నికల్లో ఆయన కొంప ముంచేసిందనుకోండి అది వేరే సంగతి. జరగని పనులు రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, రాజధాని నిర్మాణం లాంటి జరగని పనులు  కూడా జరిగిపోయినట్లు చేసుకున్న ప్రచారమే చివరకు కొంప ముంచేసింది.

 

చంద్రబాబు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అచ్చంగా ప్రచారం మీదే బతికేస్తుంటాడు. ఈ విషయం ఆయనకే కాదు ప్రతి ఒక్కళ్ళకూ తెలుసు.  ఒక్కోసారి ప్రచారం వికటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా ఆయన పద్దతి మార్చుకోవటం లేదు. ఎందుకంటే కొందరు సిగిరెట్లకు అలవాటు పడిపోతారు. మరికొందరు మందుకు అలవాడు పడతారు. ఒక్కోళ్ళకి ఒక్కో వ్యసనం ఉన్నట్లే చంద్రబాబుకు ప్రచారమనే వ్యసనం పట్టుకుంది.

 

సరే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ విషయాన్ని పక్కన పెట్టేస్తే జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చేస్తున్న పనులను కూడా సరిగా చెప్పుకోలేకపోతున్నాడు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇచ్చిన హామీలను అమలు చేయటమే ధ్యేయంగా పనిచేస్తున్నా ప్రచారంలో మాత్రం వెనకబడిపోయాడనే చెప్పాలి. సిఎం అయిన దగ్గర నుండి దాదాపు పదిమాసాల పాటు అసలు మీడియా సమావేశమే పెట్టలేదంటే ఏమిటర్ధం. స్ధానిక సంస్ధల ఎన్నికలు వాయిదా పడిన సందర్భంలోనే జగన్ మొదటిసారిగా మీడియా సమావేశం పెట్టాడు.

 

నిజానికి జగన్ కు ప్రచారం ఇచ్చే మీడియా సంఖ్య కూడా తక్కువే. ఎందుకంటే మెజారిటి మీడియా చంద్రబాబుకే మద్దతుగా ఉంది. అయినా సరే ప్రెస్ మీట్ లేకపోతే ప్రెస్ నోట్ జారీ చేస్తే కచ్చితంగా జగన్ పేరుమీదే రాయాల్సుంటుంది. ఆ పని కూడా జగన్ చేయటం లేదు. తనకు ప్రచారం అవసరం లేదని అనుకుంటే కుదరదు. కచ్చితంగా ప్రచారం ఉండాల్సిందే అదికూడా పాజిటివ్ ప్రచారం తెచ్చుకోవాల్సిందే. లేకపోతే ఎన్ని మంచిపనులు చేసినా, ఎంత కష్టపడినా చివరకు నెగిటివ్ ప్రచారమే వస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నపుడు జనాల్లోకి వెళ్ళినట్లుగా సిఎం హోదాలో వెళ్ళటం కుదరదు. అందుకనే ప్రచారం అవసరం. మరి ఈ విషయం తెలిసి కూడా జగన్ ప్రచారానికి ఎందుకు దూరంగా ఉంటున్నాడో అర్ధం కావటం లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: