కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారి ఈ భూమి మీదకు వచ్చి వంద రోజులైంది. ఎలా వచ్చిందన్నదానిపై క్లారిటీ లేకపోయినా.. ప్రపంచానికి పెనుముప్పు అని కొద్ది రోజుల్లోనే తేలిపోయింది. చైనాలో మాంసం మార్కెట్ల నుంచి పుట్టుకొచ్చిందని కొందరు అంటే.. గబ్బిళాల సూపుల్లో ఉద్భవించిందని కొందరంటున్నారు. ఏదేమైనా చైనాలోని వుహాన్‌ నగరంలో ఊపిరిపోసుకున్న ఈ రాక్షసి.. అక్కడి నుంచి ప్రపంచాన్ని కబళించేందుకు బయలు దేరింది.

 

 

జనవరిలో వెలుగు చూసిన ఈ కరోనా వైరస్ ఫిబ్రవరి నాటికి ప్రపంచదేశాల్లో చాలా వాటిని ఆక్రమించేసింది. చైనా వాడు సరిగ్గా సమాచారం ఇవ్వకుండా.. ఈ వైరస్ ను ప్రపంచం మొత్తానికి అంటించేశాడు. చైనా నుంచి కొరియాలు, ఇండియా, ఇటలీ, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్.. ఇలా కరోనా వైరస్ అడుగుపెట్టని ప్రాంతమే లేదిప్పుడు. పుట్టిన గడ్డ చైనాలో కేవలం 3 వేల మంది ప్రాణాలు మాత్రమే తీసిన ఈ మహమ్మారి ఇప్పుడు ప్రపంచమంతా కలిపి సుమారు 16 లక్షల మందికి సోకింది. సుమారుగా లక్ష మందిని పొట్టన పెట్టుకుంది.

 

 

ప్రస్తుతానికి ఈ కరోనా కారణంగా దారుణంగా దెబ్బతిన్నది ఇటలీయే. ఈ దేశంలో ఇప్పటి వరకూ కరోనాతో 18 వేల మందికి పైగానే చనిపోయారు. అయితే తాజా పరిస్థితి చూస్తే.. అమెరికా అతి పెద్ద బాధితురాలిగా కనిపిస్తోంది. ఎందుకంటే.. ఈ దేశంలో దాదాపు 5 లక్షల మంది ఈరోజుకు కరోనాతో బాధపడుతున్నారు. ఏకంగా 17 వేల మంది వరకూ కరోనాతో కన్నుమూశారు. అంతే కాదు.. ఈ దూకుడు ఇంకొన్నాళ్లు కొనసాగే అవకాశం కనిపిస్తోంది కూడా.

 

 

ప్రపంచ పెద్దన్నగా పేరున్న అమెరికాతో సహా సంపన్న దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్ కూడా కరోనా కట్టడిని అడ్డుకోలేకపోయాయి. ఇక భారత్ ప్రస్తుతానికి లాక్‌డౌన్‌ తో కాస్త కట్టడి చేసినా.. ఎంతకాలం కరోనాను అదుపు చేయగలుగుతుందో అర్థం కాని పరిస్థితి. మొత్తానికి ఈ ఆధునిక కాలంలో ప్రపంచం ఎన్నడూ చూడనంత మరణ విలయాన్ని కరోనా చూపించింది. ప్రకృతికి మానవుడు చేస్తున్న ద్రోహానికి ప్రతీకారమేమో అనిపించేలా కబళిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: