ప్ర‌స్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పాత్రికేయుల అంశం ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. స‌మాజంలో ఎవ‌రికో ఒక్క‌రికి అన్యాయం జ‌రిగితే.. ప‌దేప‌దే చూపించి, పుంఖాను పుంఖానులుగా వార్త‌లు రాసి.. స‌ద‌రు వ్య‌క్తికి న్యాయం జ‌రిగే వ‌ర‌కు పోరాడే పాత్రికేయులకు నేడు ఆయా మీడియా యాజ‌మాన్యాలు చేస్తున్న‌ది నిజంగా పొట్ట‌కొట్టే ప‌నే! తాము ప‌త్తిత్తుల‌మ‌ని, సుద్ద‌పూస‌ల‌మ‌ని చెప్పుకొనే ద‌మ్మున్న ప‌త్రిక‌లు కానీ, నిజాయితీకి నిలువెత్తుద‌ర్ప‌ణ‌మ‌ని చెప్పుకొనే మేజ‌ర్ స‌ర్క్యులేష‌న్ ఉన్న ప‌త్రిక కానీ, నేడు పాత్రికేయుల‌కు చేస్తున్న ది  అసాధార‌ణ దారుణం!  ఓపిక ఉన్నంత వ‌ర‌కు వినియోగించుకున్న పాత్రికేయుల‌ను నేడు లాక్‌డౌన్ పేరు చెప్పి ఇంటికి పంపిస్తున్నారు.

 

క‌నీసం మాన‌వ‌తా దృక్ఫ‌థం కూడా లేకుండా వ‌చ్చిన‌వారిని వ‌చ్చిన‌ట్టు ఇంటికి పంపేస్తున్నారు. నిజానికి మ‌న ఇంట్లోనే ఎవ‌రైనా ప‌నిచేస్తుంటే..వారిని అక‌స్మాత్తుగా మాన్పించాల్సి వ‌స్తే.. చేతిలో ఎంతో కొంత పెట్టి సంతోషంగా సాగ‌నంపుతాం.. కానీ,విలువ‌లు.. స్ఫూర్తులు అని నిత్యం జ‌పం చేసే ఈ మీడియా అధిపతు లు కోట్లకు కోట్లు వెనుకేసుకుని, త‌ర‌త‌రాల‌కు త‌ర‌గ‌ని ఆస్తులు సంపాయించుకుని.. వీటికి మూలాధార మైన పాత్రికేయుల‌ను నేడు న‌డివీధిలో నిల‌బెడుతున్న వైనం నిజంగా గ‌ర్హ‌నీయం. మ‌రి ఇలా ఒంట‌రు లైన పాత్రికేయుల‌కు హ‌క్కులు లేవా? అనేక శ‌ల్య ప‌రీక్ష‌లకు ఓర్చుకుని సంపాయించుకున్న ఉద్యోగాన్ని, అనేక ఒడిదుడుకులు, స‌మ‌యాస‌మ‌యాలు పాటించ‌కుండా ఆరోగ్యాన్ని, కొన్నిసంద‌ర్భాల్లో కుటుంబాల‌ను కూడా త్యాగం చేసి నిర్వ‌ర్తించిన ఉద్యోగాన్ని.. వ‌ద్దు పొమ్మంటే వ‌దిలేసుకోవాలా?

 

ఇదేమైనా నియంతృత్వ పాల‌నాకాల‌మా?  లేక బిస్కెట్ల‌కు త‌లొగ్గే పెంపుడు జంతువులా పాత్రికేయులంటే.. కానేకాదు. రాజ్యాంగం క‌ల్పించిన పాత్రికేయ హ‌క్కు.. ఒక్క ప‌త్రికా అధిప‌తుల‌కే కాదు.. పాత్రికేయుల కు కూడా ఉంది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఉన్న‌ది కేవ‌లం ప‌త్రికా అధిప‌తుల కోస‌మేనా?  అంటే కానేకాదు.. పాత్రికేయుల‌కోసం కూడా! అయితే, ఈ విష‌యం పాత్రికేయుల్లో ఎంద‌రికి తెలుసు?  ఇప్ప‌టికైనా పాత్రికేయుల హ‌క్కులు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయండి. ఉద్యోగాల నుంచి తీసేయాల్సిన సంద‌ర్భాల‌కు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేక నిర్వ‌చ‌నాలు ఇచ్చింది. ఇలా ఏదైనా సంద‌ర్భంలో తొల‌గించాల్సి వ‌స్తే కూడా మూడు మాసాల వేత‌నాన్ని వెంట‌నే ఇవ్వాలి.

 

అదేస‌మ‌యంలో వెల్ఫేర్ ఫండ్‌ను అప్ప‌టి వ‌ర‌కు ఒక్కొక్క ఉద్యోగి నుంచి ఎంత వ‌సూలు చేశారో.. దానికి ప‌ది రెట్లు క‌లిపి ఇవ్వాలి. అదేస‌మ‌యంలో ఉద్యోగ భ‌ద్ర‌త ల‌భించే వ‌ర‌కు కూడా సంస్థలు స్థూల వేత‌నంలో స‌గం ఇవ్వాల‌ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ చెబుతున్నాయి. అంతేకాదు, ప్ర‌స్తుత ప‌రిణామాల‌పై హైకోర్టును ఆశ్ర‌యించే అవ‌కాశం ఉంది. అదేవిధంగా మాన వ‌హ‌క్కుల ఫోరంను, వినియోగ దారుల ఫోరంను ఆశ్ర‌యించి వెల్ఫేర్ ఫండ్ పై కేసులు వేయొచ్చు. అంటే.. ప్ర‌త్య‌క్షంగా వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. 

 

మీ పే స్లిప్పుల జిరాక్స్‌ల‌ను జ‌త‌ప‌రిచి మూడు ఉన్నా చాలు... అదేస‌మ‌యంలో అప్పాయింట్ మెంట్ లెట‌ర్‌ల‌ను జిరాక్స్‌ల‌ను జ‌త‌ప‌రికి లేఖ రాసినా.. ఈ రెండు ఫోరాలు.. సుమోటాగా కేసులు స్వీక‌రించేందుకు 24 గంట‌లూ.. సిద్ధంగా ఉన్నాయ‌న్న విష‌యం పాత్రికేయులు తెలుసుకోవాలి. పోరాడితే పోయేదేమీ లేదు.. ప‌త్రికాధిప‌తుల నిరంకుశ‌త్వం త‌ప్ప‌.. అనే విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా పాత్రికేయులు గుర్తించాలి. పాత్రికేయుల్లో లేనిది ఐక‌మ‌త్యం! అన్నారు మాజీ జ‌స్టిస్ మార్కండేయ ఖ‌ట్జు. ఇప్ప‌టికైనా నిరంకుశ ధోరణుల‌పై పోరాడితే.. తీసేసిన ప్ర‌తి త‌ల‌కూ క‌నీసంలో క‌నీసం 5 నుంచి  10 ల‌క్ష‌ల వ‌ర‌కు ఈ ప‌త్రికాధిప‌తులు మూల్యం చెల్లించుకోవాల్సిందే!!

మరింత సమాచారం తెలుసుకోండి: