బలం ఉన్నా బల పడలేని దుస్థితిలో ఏపీ బీజేపీ చాలా కాలంగా ఇబ్బందులు పడుతోంది. ముఖ్యంగా బిజెపి నాయకుల మధ్య ఏ విషయంలోనూ క్లారిటీ లేకపోవడం, సమన్వయం లేని కారణంగా ఇంకా ఇటువంటి దుస్థితిలో బీజేపీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కేంద్రం బిజెపి నాయకుల వ్యవహారానికి, ఏపీ బీజేపీ నాయకుల వ్యవహారానికి అసలు పొంతన లేకుండా పోతోంది. దీంతో పార్టీలోనే తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఏపీ బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. జగన్ ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని తప్పు పడుతూ, అందులోని లోపాలను ఎత్తి చూపుతూ విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీతో గొంతు కలిపి మరి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు. కానీ, కేంద్ర బిజెపి పెద్దలు మాత్రం వైసీపీకి అన్ని రకాలుగా సహకారం అందిస్తూ... మీ వెనుక మేముంటామంటూ జగన్ కు ప్రతి విషయంలోనూ, ప్రతి సందర్భంలోనూ అండగా నిలబడి మద్దతుగా ఉన్నట్లు గా వ్యవహరిస్తున్నారు.

 

IHG

 ఏపీ బిజెపి నాయకులకు ఈ వ్యవహారం మింగుడు పడటంలేదు. కేంద్రం వైసీపీతో సఖ్యత గా ఉంటుంది కాబట్టి తాము అదే విధంగా వ్యవహరిద్దమనే ఆలోచన ఏపీ బీజేపీ  నాయకులకు లేకుండా పోతోంది. ఈ విషయంలో కేంద్రం కూడా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తోంది తప్ప, ఏపీ బిజెపి నాయకులకు ఏ విధమైన సూచనలు చేయడం లేదు. కొద్ది రోజుల క్రితం ఏపీలో స్థానిక సంస్థల వ్యవహారాన్ని చూసుకుంటే బిజెపి అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా వైసీపీ నాయకులు అడుగడుగున అడ్డుకోవడం, రోడ్లపై పరిగెత్తించి కొట్టడం ఈ అన్ని విషయాల పైన పెద్ద రాద్ధాంతం జరిగింది. ఈ విషయాన్ని ఏపీ బీజేపీ నేతలు సీరియస్ గా తీసుకోవడంతో పాటు కేంద్ర బీజేపీ పెద్దల దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ తంతు ఇలా సాగుతుండగానే ఆ తర్వాత కరోనా వైరస్ కారణంగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి రమేష్ కుమార్ ప్రకటించారు. 

 

IHG
ఈ విషయంపై వైసీపీ తీవ్రస్థాయిలో నిమ్మగడ్డ పై విమర్శలు చేసింది. ఇక అప్పటి నుంచి నిమ్మగడ్డ ను తప్పించేందుకు వైసీపీ తీవ్ర స్థాయిలో ప్రయత్నించింది. ప్రస్తుతం కరోనా వ్యవహారం తీవ్ర స్థాయిలో ఉన్న ఈ పరిస్థితుల్లోనూ, వైసీపీ తన పంతం నెగ్గించుకుంది. ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఏపీ ఎన్నికల అధికారి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విషయంలో కేంద్రం ఏపీ ప్రభుత్వానికి పూర్తిగా సహకారం అందించింది. ఎందుకంటే రాజ్యాంగ పదవిలో ఉన్న ఒక అధికారిని తప్పించడం అంటే అది ఏపీ ప్రభుత్వం వల్ల కాని పని. కేవలం గవర్నర్ ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఏపీ ప్రభుత్వం దీనికోసం ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం, వెంట వెంటనే దానికి గవర్నర్ ఆమోదం తెలపడం, కొత్త ఎన్నికల అధికారిని నియమించడం ఇవన్నీ వెంటవెంటనే జరిగాయి. ఈ వ్యవహారం ఏపీ బీజేపీ నేతలకు మింగుడు పడడం లేదు. 


తాము వైసిపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుంటే, కేంద్రం ఈ విధంగా వైసీపీకి అన్నిరకాలుగా సహకరిస్తూ ఉండడం వారికి ఇబ్బందికరంగా మారింది. వైసీపీ విషయంలో రాష్ట్ర నాయకులు ఒక విధంగా, కేంద్ర నాయకులు ఒక విధంగా వ్యవహరిస్తూ గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారు. దీంతో బిజెపి కి ఏ విషయంలోనూ క్లారిటీ లేదు అన్న అభిప్రాయం ప్రజల్లో కి బలంగా వెళ్తోంది. ఇటువంటి పరిణామాలే బీజేపీ ఏపీలో ఎదగకుండా చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: