కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు అన్నట్టుగా ఇప్పుడు మీడియా యాజమాన్యాలకు లక్కీ ఛాన్స్ వచ్చి పడింది. ఎప్పటి నుంచో ఉద్యోగులను తప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి యాజమాన్యాలు. ఇప్పటికే రకరకాల వేధింపులకు గురిచేసి తమ ఉద్యోగాలకు రాజీనామా చేసేవిధంగా కొన్ని మీడియా యాజమాన్యాలు ఎత్తుగడలు వేస్తున్నాయి. మరి కొంతమందిని ఎలా తప్పించాలి అనేది తెలియక సతమతం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తంతే  బూరెల  బుట్టలో పడ్డట్టుగా  మీడియా యాజమాన్యాలకు కరోనా వైరస్ గొప్ప వరంగా మారింది. దీనిని సాకుగా చూపించి ఎడాపెడా ఉద్యోగాలకు కోత మొదలుపెట్టారు. ఈ కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అగ్రశ్రేణి మీడియా గా చలామణి అవుతున్న ఈనాడుకు గట్టిగా తగిలింది. ఆంధ్రప్రదేశ్ లోని కడప లో ఉన్న ఈనాడు ప్రింటింగ్ యూనిట్ నిన్ననే మూతపడింది. అక్కడ ఆఫీస్ కట్టిన తరువాత మొదటిసారిగా మూతబడింది. 

 

IHG

వాస్తవంగా ఎప్పటి నుంచో జిల్లా యూనిట్ ఆఫీస్ లను తొలగించాలని రామోజీరావు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం జిల్లాలో ఉన్న యూనిట్ ఆఫీస్ లను తొలగించి మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీ లోనే ఈనాడు వ్యవస్థను తీర్చిదిద్దాలని చూస్తున్నారు. దీనివల్ల చాలా ఖర్చులు ఆదా అవుతాయని రామోజీ ఆలోచన. సరిగ్గా ఆ ఆలోచనలో ఉండగానే ఇప్పుడు కరోనా వైరస్ అనుకోని వరం లా  వచ్చి పడింది. అయితే ఇంత అకస్మాత్తుగా కడప ఆఫీసును మూసివేయాలని రామోజీ కూడా అనుకోలేదు. కానీ కడప లో ఉన్న ఈనాడు ప్రింటింగ్ యూనిట్ ఆలంఖాన్ పల్లె లో ఉంది. ఆ ప్రాంతంలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు బయటపడడంతో ఆ చుట్టుపక్కల ఉన్న సాయిపేట, మూసాపేట, గ్రామాలను రెడ్ జోన్ గా అధికారులు ప్రకటించారు. 

 

ఆ ప్రాంతంలోని ఈనాడు యూనిట్ ఆఫీస్ కూడా ఉండడంతో, పోలీసు పెద్దలకు ఈనాడు సిబ్బంది నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా పోలీసులు కుదరదని చెప్పటంతో తప్పని సరి పరిస్థితితుల్లో ఈనాడు ఆఫీస్ ను మూసివేశారు. రెడ్ జోన్ లో ఉంది కాబట్టి అక్కడ ఏ రికమండేషన్ లు పనిచేయవు అని చెప్పేశారు. అసలే ఏపీ లో ఉంది ఈనాడు కు బద్ధ శత్రువైన జగన్ ప్రభుత్వం. దీంతో జిల్లా యూనిట్ ఆఫీస్ ను మూసివేస్తున్నామని, మీరెవరు డ్యూటీలకు రానవసరం లేదని ఈనాడు తమ సిబ్బందికి చెప్పేసింది. అయితే ప్రింటింగ్ కు ఎక్కడా ఇబ్బంది కలగకుండా అనంతపురం నుంచి తిరుపతి నుంచి ప్రింటింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంది.

 

 ఇదే సరైన సమయంగా భావించి మిగతా జిల్లాల్లో కూడా సిబ్బందిని తగ్గించుకుని, యూనిట్ ఆఫీసులకు కోత పెడితే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఈనాడు ఉంది. ఇంకా అనేక కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు ఈనాడు సిద్దమవుతుండటంతో ఆ సంస్థలో పని చేసే ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తుతోంది. తమ ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియక టెన్షన్ లో ఉన్నారు ఈనాడు సిబ్బంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: