దేశమంతా రోజురోజుకి క‌రోనా ఊబిలోకి జారిపోతుంటే కేర‌ళ రాష్ట్రమాత్రం ఆశ్చ‌ర్య‌క‌రంగా మ‌హ‌మ్మారిపై విజ‌యం సాధిస్తోంది. మందులేని ఈ మ‌హ‌మ్మారిని ఎదుర్కొనేందుకు ప్ర‌పంచ‌మంతా  కేవ‌లం నియంత్ర‌ణ మంత్రాన్నే జ‌పిస్తోంది. అందుకే భూ మండ‌లంపై ఉన్న స‌గానికి పైగా దేశాలు ఇప్పుడు లాక్‌డౌన్‌ను పూర్తిగానో,పాక్షికంగానో అమ‌లుచేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు క‌రోనా దూర‌ని దేశం లేదంట ఆశ్చ‌ర్యం లేదు. అయితే ఒక‌టి రెండు చిన్న దేశాల‌ను ఇంకా ఆ వైర‌స్ తాక‌లేదు. అయితే భూమండ‌లంపై వాటి ఉనికి కూడా చాలా త‌క్కువే..జ‌నాభా ప‌రంగాను కోటికి మించ‌ని దేశాలే మ‌రి.

 

600కోట్ల‌కు పైగా జ‌నాభా క‌రోనా పేరెత్త‌గానే ఇప్పుడు వ‌ణికిపోతోంది. కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుతో ప్ర‌పంచ ప్ర‌జ‌లు పోరాటం చేస్తున్నారు. రోజురోజుకు ల‌క్ష‌ల సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. వేల‌ల్లో ప్రాణాలు గాలిలో క‌లిసిపోతున్నాయి. ఆదుకునేవారు లేక అగ్ర‌రాజ్యాలు సైతం దుఃఖ‌సాగ‌రంలో మునిగిపోతున్నాయి. నియంత్ర‌ణ‌పై ముందు నిర్ల‌క్ష్యం వ‌హించిన ఇట‌లీ, అమెరికా వంటి దేశాల్లో క‌రోనా క‌రాళా నృత్యం చేస్తోంది. ప్ర‌పంచ‌మంతా క‌రోనా సంక్షోభం నెల‌కొన్న వేళ భార‌త్‌లోని కేర‌ళ రాష్ట్రం ఈ ఊబి నుంచి బ‌య‌ట‌ప‌డుతున్న తీరు అంద‌రిలో ఆలోచ‌న‌ను రేకెత్తిస్తోంది. ఈ రాష్ట్రంలో స్వీయ‌నిర్బంధం అద్భుతంగా అమ‌ల‌వుతోంది.

 

సామాజిక దూరం పాటించ‌డంలో ప్ర‌జ‌లు చూపుతున్న శ్ర‌ద్ధ‌ను కొనియాడ‌క త‌ప్ప‌దు. దీనికి తోడు ప్ర‌భుత్వం ఇళ్ల వ‌ద్ద‌కే నిత్యావ‌స‌రాలను ప్ర‌భుత్వ యంత్రాంగంతో స‌ప్లై చేయ‌డంతో రోడ్ల‌పైకి రావాల్సిన అవ‌స‌రం జ‌నాల‌కు కూడా లేకుండాపోతోంది. ఇక దీనికితోడు కేర‌ళ‌లో ఆయుర్వేద వైద్యం, ఆహార‌పు అల‌వాట్లు కూడా ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెంచేలా ఉండ‌టం ఈ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అద‌నంగా క‌లిసి వ‌చ్చే అవ‌కాశంగా అంత‌ర్జాతీయ ప‌త్రిక‌లు సైతం ప్ర‌త్యేక క‌థ‌నాలు ప్ర‌చురించ‌డం గ‌మ‌నార్హం. ఒక క‌మ్యూనిస్టు పార్టీ పాల‌న‌లో ఉన్న రాష్ట్రంలో క‌రోనా క‌ట్ట‌డి అయ్యింద‌ని అంటూ అమెరిక‌న్ ప‌త్రిక‌లు క‌థ‌నాల్లోకొనియాడ‌టం విశేషం.


వాస్త‌వానికి జ‌న‌వ‌రి 30న కేర‌ళ‌లోనే భార‌త్‌లో తొలి క‌రోనా కేసు న‌మోదైంది.  చైనా నుంచి వ‌చ్చిన ఒక న‌ర్సుకు క‌రోనా పాజిటివ్ గా తేల‌డంతో అక్క‌డి ప్ర‌భుత్వం అల‌ర్ట్ అయింది. ఆ త‌ర్వాత అక్క‌డ క‌రోనా కేసుల సంఖ్య క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతూ వ‌చ్చింది. ప్ర‌స్తుతం కేర‌ళ‌లో  మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 378.  వీరిలో ఇద్ద‌రు మ‌ర‌ణించార‌ట‌. మ‌రో 198 మంది క‌రోనా నుంచి కోలుకున్న‌ట్టుగా కేర‌ళ ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. గ‌త కొన్నాళ్లుగా డైలీ సింగిల్ డిజిట్ స్థాయిలోనే కేసులు పెరుగుతూ ఉండ‌టం.. వీటితో అంద‌రి దృష్టీ కేర‌ళ మీద ప‌డే ప‌రిస్థితి ఏర్ప‌డింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: