ఒక‌ప‌క్క అటు ప్ర‌పంచంతోపాటు, ఇటు దేశ‌మంతా క‌రోనా భ‌యంతో విల‌విల్లాడుతోంది. అయితే చాలా దేశాల‌తో పోలిస్తే భార‌త్‌లో క‌రోనాను ఇప్ప‌టిదాకా స‌మ‌ర్థంగా ఎదుర్కొన్న‌ట్టే..! విప‌త్తును నివారించేందుకు చురుగ్గా స్పందించిన ప్ర‌ధాని మోదీ ప్ర‌జ‌ల‌కు క‌ష్ట‌మైనా తప్ప‌ద‌ని తెలిపి దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించడం క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్ర‌త‌ను దేశంలో నిలువ‌రించేందుకు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డింది. మ‌న‌కున్న ప‌రిమిత ఆర్థిక వ‌న‌రులు, వైద్య‌సౌక‌ర్యాలతో క‌రోనా వ్యాప్తి నియంత్ర‌ణ‌కు అటు కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వం ఇటు రాష్ట్రంలోని వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తున్నాయ‌ని చెప్పాలి. 

 

అయితే ఇదే స‌మ‌యంలో గ‌తంలో ఇదే కోవిడ్ 19 కార‌ణంగా నిలిచిపోయిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను కొన‌సాగించేందుకు వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం చురుగ్గా చేప‌ట్టిన చ‌ర్య‌లు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ స‌మయంలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ ప్ర‌మాదానికి కార‌ణ‌మవుతుంద‌ని విమ‌ర్శిస్తూ, ఈ  అంశాన్ని విప‌క్ష టీడీపీ ప్ర‌భుత్వం అధికార ప‌క్షంపై రాజ‌కీయంగా దాడి చేసేందుకు ప్ర‌చారాస్త్రంగా ఎంచుకుంది. ఈ నేప‌థ్యంలోనే ఏప్రిల్ 14 త‌రువాత దేశంలో కొన‌సాగుతున్న లాక్‌డౌన్ తొల‌గించాలా లేక కొన‌సాగించాలా అనే అంశంపై ప్ర‌ధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో టెలీ కాన్ఫ‌రెన్స్ ద్వారా చ‌ర్చించి అభిప్రాయాలు తెలుసుకున్నారు. మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా మ‌రికొన్ని రోజులులాక్ డౌన్ కొనసాగిస్తేనే మేల‌ని  ప్ర‌ధానికి సూచించారు. 

 

కానీ ఏపీ సీఎం జగన్ మాత్రం క‌రోనా తీవ్ర‌త‌ను ప‌రిశీలించి జోన్ల వారీగా వెసులుబాటు ఇవ్వాలని కోరారు. వైఎస్ జ‌గ‌న్ ఆవిధంగా కోర‌డం వెనుక హేతుబ‌ద్ద‌మైన కార‌ణాలే ఉన్నాయి. రాష్ట్రంలో ఉత్త‌రాంధ్ర‌లోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క క‌రోనా కేసు కూడా నమోదు కాలేదు. మ‌రి దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ కార‌ణంగా ఆ ప్రాంతాల్లో సైతం జ‌న‌జీవ‌నం పూర్తిగా స్తంభించిపోయింది. ఇదేవిధంగా క‌రోనా కార‌ణంగా ర‌వాణా వ్య‌వ‌స్థ స్తంభించ‌డం, మార్కెటింగ్ సౌక‌ర్యం లేక‌పోవ‌డంతో రైతులు పండించిన ఉత్ప‌త్తులు చేల‌ల్లోనే పాడైపోతున్న ప‌రిస్థితి ఉంది. దీంతో రైతుల ఆర్థిక ప‌రిస్థితి అధ్వానంగా మారడంతోపాటు స‌మీప భ‌విష్య‌త్తులోనే ఆహార కొర‌త ఉత్ప‌న్న‌మ‌య్యే ప్ర‌మాద‌మూ పొంచి ఉంది. 

 

ఇక చిరు వ్యాపారులు, దిన‌స‌రి కూలీల ప‌రిస్థితి క‌రోనా కార‌ణంగా అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. అస‌లే అంతంత మాత్రం ఆర్థిక ప‌రిస్థితిలో ఉన్న ఏపీలాంటి రాష్ట్రానికి ఈ ప‌రిస్థితిని ఎదుర్కోవ‌డమంటే పెనుగండ‌మే. అయితే ప్రధాని మోడీ మాత్రం మంగ‌ళ‌వారం జాతినుద్దేశించి చేసిన ప్ర‌సంగంలో  మే-3 వరకు లాక్ డౌన్ కొనసాగించాలని నిర్ణయించిన‌ట్టు ప్ర‌క‌టించారు. ఏప్రిల్ 20 వరకు కఠినంగా ఉండాలని, ఆ తర్వాత పరిస్థితిని అంచనా వేసి మ‌ర‌లా నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ప్ర‌ధాని ప్ర‌క‌టించారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక ప్ర‌క్రియ ముందుకు సాగ‌డం ప్ర‌స్తుతానికి సందిగ్ధంలో ప‌డిన‌ట్టే. దీనిపై సీఎం జ‌గ‌న్ ఎలా స్పందిస్తారోన‌నేది ఉత్కంఠగా మారింది.  మ‌రోప‌క్క‌ ఏప్రిల్ 20 త‌రువాత లాక్‌డౌన్ మిన‌హాయింపులు ఏవిధంగా ఉంటాయ‌నేదానిపైన ఇప్పుడు అంద‌రిలో ఆసక్తి నెల‌కొంది.  

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: