ఎట్ట‌కేల‌కు లాక్‌డౌన్ ఎత్తివేత‌కు చ‌ర్య‌లు ఆరంభ‌మ‌య్యాయి. క‌రోనా వైర‌స్ దేశంలో పూర్తిగా త‌గ్గుముఖం ప‌ట్ట‌క‌పోవ‌డంతో లాక్‌డౌన్ ఎత్తివేత‌పై నిర్ణ‌యం ప్ర‌ధాన‌మంత్రి మోదీకి క‌త్తిమీద సాములా మారింద‌నే చెప్పాలి. వాస్త‌వానికి ప్ర‌ధాన‌మంత్రి ముందు ప్ర‌క‌టించిన ప్ర‌కారం..ఏప్రిల్ 14తో లాక్‌డౌన్ ముగించాల్సి ఉంది. అయితే ప్ర‌ధాన‌మంత్రితో పాటు వైద్య నిపుణులు భావించిన‌ట్లుగా క‌రోనా పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. పైగా చాలా రాష్ట్రాల్లో ఉధృత‌స్థాయికి చేరుకుంది. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇప్పుడిప్పుడే త‌గ్గుముఖం ప‌డుతోంది. కేర‌ళలో, తెలంగాణ‌లో కొత్త కేసుల సంఖ్య సింగిల్ డిజిట్‌కు చేరుకున్నాయి. అదే స‌మ‌యంలో మ‌హారాష్ట్ర , ఢిల్లీ, గుజరాత్‌, రాజ‌స్థాన్‌లాంటి రాష్ట్రాల్లో ఉధృతమైంది. 

 

లాక్‌డౌన్ కొన‌సాగింపు వ‌ల్ల దేశంలో అనేక ఆర్థిక స‌మ‌స్య‌లు త‌లెత్తే ప్ర‌మాద‌ముంద‌ని, అలా అని ఎత్తివేస్తే ప్ర‌జ‌ల‌ను ప్ర‌మాదంల ప‌డేసిన‌ట్ల‌వుతుంద‌ని ఇటీవ‌ల ముఖ్య‌మంత్రుల‌తో జ‌రిగిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో వ్యాఖ్య‌నించారు. అయితే ప్ర‌జ‌ల ప్రాణాల‌కు హాని లేకుండానే ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్టే మార్గాన్ని అనుస‌రించాల‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌ధాన‌మంత్రి  ముఖ్య‌మంత్రుల‌కు చెప్పిన‌ట్లుగానే లాక్‌డౌన్‌ను మే3వ‌ర‌కు పొడ‌గిస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి కొద్దికాలం పాటు లాక్‌డౌన్ పొడ‌గింపు ఉంటుంద‌ని దేశ‌మంతా భావించిన మాట వాస్త‌వం అయితే మే3 వ‌ర‌కు పొడ‌గింపు ఉంటుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు.

 

అయితే ఈ నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌డం వెనుక మోదీ వ్యూహాత్మ‌క ధోర‌ణి ఉంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఎక్క‌డైతే వైర‌స్ వ్యాప్తి ప్ర‌భావం ఉందో అక్క‌డ మాత్ర‌మే లాక్‌డౌన్ కొన‌సాగిస్తూ ప్ర‌భావం అంత‌గా లేని చోట్ల‌లో స‌డ‌లింపు ఇవ్వ‌డం..అస‌లు కేసులే నమోదు కాని ప్రాంతాల‌కు పూర్తిగా జ‌న‌జీవనాన్ని సాధార‌ణ స్థితికి చేర్చ‌డ వంటి ల‌క్ష్యాల‌తో దేశం మొత్తాన్ని రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్ జోన్లుగా విభ‌జించేసింది. రెడ్ జోన్ల‌లో మే3 వ‌ర‌కు...అప్ప‌టికి కేసుల నమోదు జ‌రుగుతూ ఉంటే మ‌రికొంత‌కాలం లాక్‌డౌన్ కంటిన్యూ అవుతుంది. ఇక ఆరెంజ్ జోన్ల‌లో నిబంధ‌న‌ల్లో కాస్త స‌డ‌లింపు ఉంటుంది. గ్రీన్ జోన్ల‌లో ఎలాంటి ష‌ర‌తులు ఉండ‌వు. ఈ విధానం వ‌ల‌న లాక్‌డౌన్ ఉంద‌న్న భావ‌న క‌లుగడంతో పాటు ప్ర‌జ‌ల్లో సీరియ‌స్‌నెస్ క‌లిగి ఉండి వైర‌స్పై  పోరాటం కొన‌సాగుతుంద‌ని మోదీ భావించి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: