ఏ ప్ర‌భుత్వమైనా తాను తీసుకునే నిర్ణ‌యాలు మెజారిటీ ప్ర‌జ‌ల‌కు మేలు చేయాల‌ని భావిస్తుంది. అదేవిధంగా త‌న వ్యూహాలు సంపూర్ణంగా అమ‌లు కావాల‌ని కూడా కోరుకుంటుంది. అయితే, ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణ‌యాలు న్యాయ‌స్థానాల్లో నిల‌వ‌డం లేదు. ఏదో ఒక రూపంలో వాటికి విఘాతం క‌లుగుతూనే ఉంది. హైకోర్టు ఆయా నిర్ణ‌యాల‌ను ప్ర‌శ్నించడ‌మే కాకుండా తొసిపుచ్చుతోంది. దీంతో ప్ర‌జ‌ల‌కు ఏదో మేలు చేయాల‌న్న ప్ర‌భుత్వం ప్ర‌ధాన ఉద్దేశం ఆదిలోనే కొడిక‌డుతోంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. పేద‌ల‌కు ఇళ్లు కేటాయించే విష‌యం కావొచ్చు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల వికేంద్రీక‌ర‌ణ కావొచ్చు.. ఇప్పుడు తెలుగు మీడియం స్థానంలో ఆంగ్ల మాధ్య‌మాన్ని ప్ర‌వేశ‌పెట్టాల‌నే ఉద్దేశం కావొచ్చు.. పీపీపీ పునః ప‌రిశీల‌న కావొచ్చు.. పెట్టుబ‌డుల విష‌యం కావొచ్చు.

 

పంచాయ‌తీ కార్యాల‌యాల‌కు రంగుల విష‌యం కావొచ్చు.. ఇలా అనేక విష‌యాలను జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. వీటిని స‌మూలంగా మార్చ‌డమో లేదా ప్ర‌జ‌ల‌కు మ‌రిన్ని సేవ‌లు అందించ‌డ‌మో చేయాల‌ని భావించింది. కానీ, వీటిని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలు అడుగ‌డుగునా అడ్డుకోవ‌డం, వాటిపై కేసులు వేయ‌డం, ఇవి కోర్టుల్లో విచార‌ణ‌కు రావ‌డం త‌ద‌నంత‌రం వాటిని కొట్టివేయ‌డం ష‌రా మామూలుగా మారింది. ఈ విష‌యంలో జ‌గ‌న్ విఫ‌ల‌మ‌వుతున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు తీవ్ర విమ‌ర్శ‌లు కూడా గుప్పిస్తున్నాయి. నిజానికి ప్ర‌జ‌లు ఒక పార్టీకి మేండేట్ ఇచ్చాక‌.. ఇలాంటి ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయంటే.. ఏ ప్ర‌భుత్వాధినేత‌కైనా త‌దుపరి నిర్ణ‌యం తీసుకునే విష‌యంలో ఒకింత భ‌యాందోళ‌న ఏర్ప‌డ‌డం స‌హ‌జం.

 

ఏమో.. ఏ నిర్ణ‌యం తీసుకుంటే...ఏం జ‌రుగుతుందో..?  కోర్టు ఏం ప్ర‌శ్నిస్తుందో.? ఇలా అనేక ఆలోచ‌న‌లు ప్ర‌భుత్వాన్ని వేధిస్తాయి. ఏ విష‌యంలోనూ సానుకూల నిర్ణ‌యం తీసుకోలేక ఇబ్బందిప‌డే సంద‌ర్భాలు కూడా వ‌స్తాయి మ‌రి ఇలా ఏపీ ప్ర‌భుత్వం విషయానికి వ‌చ్చే స‌రికి ఎందుకిలా నెగిటివ్ ఇంపాక్ట్ ప‌డుతోంది. స‌మ‌ర్ధంగా ప్ర‌భుత్వం త‌ర‌ఫున వాద‌న‌లు వినిపించాల్సిన అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ ఈ విష‌యంలో ఎక్కడైనా విఫ‌ల‌మ‌వుతున్నారా ? ప‌్ర‌భుత్వ న్యాయ వాదులు కూడా ఈ విష‌యాల్లో ఎక్క‌డైన దారిత‌ప్పుతున్నారా?  కీల‌క అంశాల‌ను లేవ‌నెత్తి.. స‌ద‌రు ప్ర‌భుత్వ వాద‌న‌ను కోర్టుల్లో గ‌ట్టిగా వినిపించ‌లేక పోతున్నారా ? అంటే.. తాజా ప‌రిణామాలు గ‌మ‌నిస్తున్న వారు స‌హా ప్ర‌భుత్వంలోని పెద్ద‌లు కూడా ఔన‌నే అంటున్నారు.

 

ప్ర‌స్తుతం ఉన్న న్యాయాధికారులు, న్యాయ‌వాదులపై సీఎం జ‌గ‌న్‌కూడా ఇటీవ‌ల కాలంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌నే అంటున్నారు. ఈ క్ర‌మంలో రాబోయే రోజుల్లో కీల‌క మార్పులు చోటు చేసుకునే అవ‌కాశం కూడా ఉంటుంద‌ని చెబుతున్నారు. ఏదేమైనా.. ప్ర‌భుత్వ వాద‌న వినిపించే స‌రైన అధికారులు, న్యాయ‌వాదుల అవ‌స‌రం మాత్రం జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఖ‌చ్చితంగా ఉంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: