ఏమాట కామాటే చెప్పుకోవాలి. ఎంతైనా.. ఇప్ప‌టికీ పాత చింత‌కాయ్ ప‌చ్చ‌డి మాదిరిగా.. ఉన్న ఈనాడునే ప్ర‌జ‌లు ఎందుకు చ‌దువుతున్నారు?  దాదాపు ఫార్టీ ఇయ‌ర్స్ అయినా ఇప్ప‌టికీ ఎందుకు ఈ ప‌త్రికంటే .. ప‌డి చ‌చ్చిపోతున్నారు? అంటే.. దీనికి తిరుగులేని స‌మాధానం.. రోజు రోజుకు ప‌త్రిక నాజూకు పెంచుకొం టోంది కాబ‌ట్టే! ఎంత ఎత్తు ఎగ‌రాలో.. ఎప్పుడు ఎగ‌రాలో.. ఎవ‌రిమీద ఎగ‌రాలో.. అవ‌కాశం చూసుకుని ఎగ‌ర‌డం ఈనాడు ప్ర‌ధాన ల‌క్ష‌ణం. ఒక‌వైపు రాజ‌కీయాల‌కు మ‌ద్ద‌తిస్తే.. దండ‌లోని నాయ‌కం పూస మాదిరిగా త‌న వ్యాపార కోణాన్ని లౌక్యంగా నిర్వ‌హిస్తున్నారు ఈ ప‌త్రిక అధిప‌తి రామోజీ అన‌డంలో ఏమాత్రం సందేహం లేదు.

 

ఎందుకంటే.. నిజానికి క‌రోనా ఎఫెక్ట్‌తో ప‌త్రికా ప్ర‌పంచంకూడా ఇబ్బంది ప‌డుతున్న మాట వాస్త‌వం. దీనిలో ప్ర‌ధానంగా న్యూస్ పింట్‌(ముద్ర‌ణా పేప‌ర్‌) ర‌వాణా నిలిచిపోయింది. ఇంపోర్టెడ్ పేప‌ర్ కావ‌డంతో దేశాలు లాక్‌డౌన్ పాటించ‌డంతో న్యూస్ ప్రింట్ నిల్వ‌లు ఉన్న‌మేర‌కే పేప‌ర్‌ను ముద్రించాల్సిన అగ‌త్యం ఏర్ప‌డిం ది. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలోని అన్ని పేప‌ర్లు కూడా పేజీల సంఖ్య‌ను భారీ ఎత్తున కుదించాయి. నిత్యం జిల్లా వార్త‌ల‌ను మ‌న ముందుంచే టాబ్లాయిడ్‌ను పూర్తిగా ప‌రిహ‌రించి.. మెయిన్ పేజీల్లోనే క‌లిపేశారు. మొత్తంగా ఎలా చూసినా.. ప‌ది నుంచి 12 పేజీల‌కు ఏ పేప‌ర్ కూడా మించ‌డం లేదు.

 

దీంతో  ఇప్ప‌టి వ‌ర‌కు 20 పేజీల టాబ్లాయిడ్‌కు, 18 పేజీల మెయిన్‌కు అల‌వాటు ప‌డిన పాఠ‌కుల‌కు ఒక‌ర‌కంగా వెలితిగానే ఉంటుంది. అన్ని వార్త‌లు కేవ‌లం 10 పేజీల‌కే ప‌రిమిత‌మైతే.. పేప‌ర్ చ‌దివిన‌ట్టు ఏమ‌నిపిస్తుంది? అనే అసంతృప్తి కూడా ఉంటుంది. అయితే, ఈనాడు ఈ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంది. ఇస్తున్నవి ప‌ది పేజీలు, ప‌న్నెండు పేజీలే అయిన‌ప్ప‌టికీ.. సంపూర్ణంగా అన్నింటినీ క‌వ‌ర్ చేస్తుండ‌డం విశేషం. క‌రోనా నేప‌థ్యంలో కేవ‌లం దీనిపై అవ‌గాహ‌న పెంచేందుకు ఒక పేజీని ఫుల్లుగా కేటాయిస్తోంది.

 

ఇక‌, వ‌సుంధ‌ర వంటి మ‌హిళా పేజీని, ఎడిటోరియ‌ల్ పేజీని కూడా సమూలంగా క‌రోనాకే కేటాయించ‌డం, విభిన్న క‌థ‌నాలు వెలువ‌రించ‌డం, మొత్తం ప్రాముఖ్యం ఉన్న వార్త‌లే కాకుండా ఫొటోల‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వ‌డం వంటివి మిగిలిన ప‌త్రిక‌ల‌తో పోల్చిన‌ప్పుడు ఈనాడు మ‌ళ్లీ ప‌తాక స్థాయిలోనే నిలిపింది. దీనిని గ‌మ‌నించిన పాఠ‌కులు.. రామోజీ త‌న మార్కు చూపిస్తున్నారుగా! అని అన‌కుండా ఉండ‌లేక పోతుండ‌డం గ‌మ‌నార్హం. నిజానికి ఎంతో అధునాత ఎక్విప్‌మెంట్ ఉంద‌ని చెప్పుకొనే సాక్షి కూడా ఈ త‌ర‌హాలో పాఠ‌కుల‌ను సంతృప్తి ప‌ర‌చ‌క‌లేక పోతోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. పాఠ‌కుల నాడి ప‌ట్ట‌డంలో ఇదే రామోజీకి, మిగిలిన వారికి ఉన్న తేడా!!

మరింత సమాచారం తెలుసుకోండి: