ఒకపుడు ఇద్దరు బాగా సన్నిహితులే. కాకపోతే కాలప్రభావం వల్ల ఇద్దరు బద్ధ శతృవులయ్యారు. దాంతో ఇద్దరి దారులు వేర్వేరయిపోయాయి. ఒకరు టిడిపిలోనే ఉండిపోగా మరొకరు టిడిపికి రాజీనామా చేసేసి వైసిపిలో చేరిపోయారు. సీన్ కట్ చేస్తే వైసిపిలో చేరిన నేతేమో ఇపుడు మంత్రియపోగా టిడిపి నేతేమో మాజీ మంత్రిగా మిగిలిపోయారు. ఈ పాటికే అర్ధమైపోయుంటుంది ఇదంతా ఎవరిని ఉద్దేశించో. అవును కరెక్టే గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావు గురించే. గంటాకు అవంతి పెద్ద షాక్ ఇచ్చిన విషయం మీదే  ఈ కథనం.

 

మొన్నటి ఎన్నికలయిపోయిన దగ్గర నుండి విశాఖపట్నం జిల్లాలోని భీమిలో ఎంఎల్ఏగా గెలిచిన అవంతి శ్రీనివాస్ మంత్రయిపోయాడు. టిడిపి హయాంలో మంత్రిగా ఓ వెలుగు వెలిగిన గంటా శ్రీనివాస్ ఇపుడు మాజీ మంత్రిగా మిగిలిపోయాడు. గంటా వ్యవహారం ఎలాగుంటుందంటే ప్రతిపక్షంలో కూర్చోవటానికి ఏమాత్రం ఇష్టపడడు. అంటే అధికార పార్టీలో లేనిదే అందులోను మంత్రిగా చక్రం తిప్పనిదే గంటాకు తోచదు.  మొన్నటి వరకు గంటా అనుకున్నది అనుకున్నట్లే జరిగింది. కానీ ఇపుడు మాత్రం సీన్ రివర్సవుతోంది.

 

మంత్రి అవంతి మాజీ మంత్రికి చెక్ పెట్టేసినట్లే అయిపోయింది. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఓడిపోయినా విశాఖనగరంలోని ఉత్తర నియోజకవర్గంలో గంటా గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. వైసిపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి పార్టీలోకి వచ్చేద్దామని గంటా చేయని ప్రయత్నమంటూ లేదు. అయితే ఎప్పటికప్పుడు గంటాను పార్టీలోకి రానీయకుండా అవంతి  ఏదో రూపంలో అడ్డుకుంటునే ఉన్నాడు. తన బద్దశతృవు వైసిపిలో చేరితే తన ఉనికికే ఇబ్బందవుతుందని అవంతి ఆందోళన పడుతున్నాడు.

 

ఎందుకంటే గంటా ఊరికే ఉండే రకంకాదు. తనకున్న అంగ, అర్ధబలంతో పార్టీ అధినేతలను ఈజీగా ప్రసన్నం చేసుకుంటారు. ఒకసారంటూ పార్టీ అధినేత గంట బుట్టలో పడితే ఇక అంతే సంగతులు. పార్టీలో కొత్తగా చేరినా అప్పటికే ఉన్న వారిని డామినేట్ చేయటం మొదలుపెడతాడు. దాంతో పార్టీలో గొడవలు మొదలవుతాయి. ఈ విషయాలు అందరికీ తెలిసినా గంటా అదృష్టం కొద్ది అనుకున్నది అనుకున్నట్లు సాగింది. ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా తెలిసిన వాడు కాబట్టే అవంతి మాజీ మంత్రి రాకను అడ్డుకుంటున్నాడు.

 

ఈ నేపధ్యంలోనే విశాఖలో వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి  మీడియా మాట్లాడుతూ గంటాను పార్టీలో చేర్చుకునేది లేదని తేల్చి చెప్పేశాడు. గంట ఎంతమాత్రం నమ్మదగ్గ వ్యక్తి కాదంటూ విజయసాయి ఓపెన్ గా చెప్పేయటంతో గంటా ఆశలపై నీళ్ళు చల్లినట్లే. ఎందుకంటే ఇప్పటి వరకు వైసిపిలో చేరిన చాలామంది నేతలు ముందుగా విజయసాయితో మాట్లాడుకున్న వారే. అలాంటిది విజయసాయే సాధ్యం కాదని చెప్పేసిన తర్వాత వైసిపిలోకి గంటా ఎంట్రీ దాదాపు మూసుకుపోయినట్లే అనుకోవాలి. ఈ విధంగా విజయసాయితో అవంతి గంటాకు చెక్ పెట్టించినట్లే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: