దేశ‌వ్యాప్తంగా వంద‌ల సంఖ్య‌లో మీడియా సంస్థ‌లు ఉన్నాయి. ప‌త్రిక‌లు కొన‌సాగుతున్నాయి. ఎవ‌రిదారి వారిది. ఎవ‌రి మ‌ద్ద‌తు వారిది. మీడియా అధిప‌తులు ఎవ‌రికి న‌చ్చిన వారికి వారు మ‌ద్ద‌తిస్తున్నారు. ఎవ‌రికి న‌చ్చిన పార్టీకి వారు మ‌ద్ద‌తిస్తున్నారు. అదేస‌మ‌యంలో ఒక‌రితో ఒక‌రు భీక‌ర స్థాయిలో పోటీ ప‌డుతున్నారు. అటు సెర్క్యులేష‌న్‌లోకానీ, ఇటు చానెళ్ల రేటింగ్‌లోకానీ, మీడియా అధిప‌తులు ఎవ‌రికి వారు త‌మ త‌మ దారుల్లో వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతున్నారు. ఈ విష‌యంలో ఎవ‌రూ ఒక దారిలోకి రారు. ఎవ‌రూ కూడా ఒకే విధానాన్ని అనుస‌రించ‌రు.

 

ఎవ‌రి భిన్న‌మైన శైలి వారికి ఉంది. అలాంటి మీడియాలో మాత్రం ఒకే విష‌యంలో అంద‌రూ ఒకే తాటిపైకి వ‌చ్చారు. ఒకే ఒక్క విష‌యంలో అంద‌రూ మూకుమ్మ‌డి నిర్ణ‌యం తీసుకున్నారు. అదే.. క‌రోనా ఎఫెక్ట్‌తో మీడియా న‌ష్ట‌పోతోందంటూ.. ఉద్యోగుల‌ను తొల‌గించ‌డం స‌హా ప‌త్రిక‌లు, మీడియా చానెళ్ల ఖర్చును అదుపు చేసుకోవ‌డంలో విష‌యంలో! ఈ విష‌యంలో దేశ‌వ్యాప్తంగా చూస్తే.. జాతీయ మీడియా ఒక పంథాను అనుస‌రిస్తుంటే.. రాష్ట్ర మీడియాలు మ‌రో పంథాను అనుస‌రిస్తున్నాయి. కొంద‌రు ఉద్యోగుల‌ను నేరుగా ఇంటికి పంపిస్తున్నారు. మ‌రికొంద‌రు మాత్రం సెల‌వుపై పంపుతున్నారు.

 

పంప‌డం ఏమైనా కానీ, తిరిగి మేం పిలిచే వ‌ర‌కు రావొద్దు! అనే ష‌ర‌తును మాత్రం అమ‌లు చేస్తున్నారు. అదేస‌మ‌యంలో ప‌నిచే స్తున్న ఉద్యోగుల వేత‌నాల్లోనూ కోత పెడుతున్నారు. ప్ర‌స్తుతం ప‌నిచేస్తున్న వారి జీతాల్లో 20 నుంచి 25 శాతం వేత‌నాల‌ను కోత పెట్టారు. ఈ మొత్తాల‌ను ఇప్ప‌టికే ఇంటికి పంపిన వారికి వ‌చ్చే నెల నుంచి ఇస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక‌, మ‌రో కీల‌క విష‌యంలోనూ మీడియా అధిప‌తులు ఏక‌తాటిపైకి రావ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ప్ర‌తి నెలా ఉద్యోగుల వేత‌నాల నుంచి వ‌సూలు చేస్తున్న సంక్షేమ నిధిని ఖ‌ర్చుచేయ‌డంపై మాత్రం ఎవ‌రూ పెద‌వి విప్ప‌డం లేదు.

 

దాదాపు ప‌దేళ్లుగా ఈ నిధిని ఉద్యోగుల వేత‌నాల నుంచి వ‌సూలు చేస్తున్నారు. వారి పిల్ల‌ల చ‌దువుల‌కు, వివాహాల కు వ‌డ్డీలేని రూపంలో అప్పులుగా ఇస్తున్నారు. దీనిని కంతుల రూపంలో వ‌సూలు చేసుకుంటున్నారు.కానీ, ఇప్పుడు ఉద్యోగుల‌ను ఇంటికి పంపుతున్న నేప‌థ్యంలో ఈ మొత్తం నుంచి కొంత‌మేర‌కైనా ఇచ్చి త‌మ‌ను ఆదుకోవాల‌న్న ఉద్యోగుల గోడు మాత్రం ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఏదేమైనా.. ఎవ‌రికి వారే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించే మీడియా అధిప‌తులు.. మాత్రం.. ఉద్యోగుల‌ను తొల‌గించే విష‌యంలోను, వారికి వేత‌నాలు క‌ట్ చేసే విష‌యంలోనూ ఒకే మాట‌పై నిల‌బ‌డ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: