ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డి 11 నెల‌లు పూర్త‌వుతున్నాయి. గ‌త ఏడాది మేలో వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ సీఎంగా ప్ర‌మాణం చేశారు. అనంత‌రం ఆయ‌న కేబినెట్ ఏర్పాటు చేసుకుని రాష్ట్రంలో పాల‌న ప్రారంభించారు. అయితే, ఈ కాలంలో ఆయ‌న ఎప్పుడూ కూడా మీడియా మీటింగులు పెట్ట‌లేదు. నిజానికి గ‌త పాల‌కుడు, టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో సీఎం జ‌గ‌న్‌ను పోలిస్తే.. మీడియా మీటింగులు జీరో అనే చెప్పాలి. చంద్ర‌బాబు ప్ర‌తి విష‌యాన్నీ ప్ర‌చార కోణంలో చూశార‌ని, నిత్యం మీడియాతోనే అంట‌కాగార‌నే విమ‌ర్శ‌ల‌కు పూర్తి భిన్నంగా సీఎం జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించారు. జ‌గ‌న్ ఏనాడూ మీడియా ముందుకు రాలేదు. ప్ర‌భుత్వం త‌ర‌ఫున ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మాలు ప్రారంభించిన స‌మ‌యంలోనూ ఆయ‌న మౌనం వ‌హించారు. 

 

అదేస‌మ‌యంలో సీఎం జ‌గ‌న్ కు వ్య‌తిరేక మీడియా కూడా రాష్ట్రంలో ఎక్కువ‌గా చ‌క్రం తిప్పుతుండ‌డంతో ఆయ‌న దాదాపు మీడియాను బాయికాట్ చేశార‌నే చెప్పాలి. వాస్త‌వానికి జ‌గ‌న్‌కు సొంత మీడియా ఉంది. అయినా కూడా ఆ మీడియాకుకూడా సీఎంగా ఆయన ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చింది లేదు. ఇంట‌ర్వ్యూలు ఇచ్చింది లేదు. అయితే, రాష్ట్రంలో తొలిసారి ఆయ‌న మీడియా మీటింగ్ పెట్టింది.. స్థానిక ఎన్నిక‌ల‌ను వాయిదా వేస్తూ.. అప్ప‌టి రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ బాబు తీసుకున్న మెరుపు నిర్ణ‌యం నేప‌థ్యంలోనే జ‌గ‌న్ మీడియా ముందుకు వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో త‌న‌ను వ్య‌తిరేక భావంతో చూస్తున్న మీడియాను ఆయ‌న ప్రెస్‌మీట్‌కు ఆహ్వానించ‌లేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. 

 

ఇక‌, రాష్ట్రంలో క‌రోనా నేప‌థ్యంలో గ‌త నెల మార్చిలో లాక్‌డౌన్ విధింపున‌కు ముందు, త‌ర్వాత ఇప్ప‌టికి నాలుగు సార్లు మీడియా మీటింగుల‌కు వ‌చ్చారు సీఎం జ‌గ‌న్. అయితే, జ‌గ‌న్ లైవ్ ప్రోగ్రామ్‌ల‌ను కొన్ని ఛానెళ్లు ప్ర‌సారం చేయ‌గా.. ఆయ‌న‌ను వ్య‌తిరేకించే కొన్ని ఛానెళ్లు మాత్రం దూరం పెట్టాయి. దీంతో ఇవి ఇక మార‌వులే! అని అనుకున్నారు ప్ర‌భుత్వంలోని వైసీపీ నాయ‌కులు. అయితే, తాజాగా సోమ‌వారం సాయంత్రం నిర్వ‌హించిన సీఎం జ‌గ‌న్ ప్రెస్‌మీ్ట్‌ను మాత్రం దాదాపు అన్ని ఛానెళ్లు.. అంటే.. జ‌గ‌న్‌పై ప‌నిగ‌ట్టుకుని వ్య‌తిరేక ప్ర‌చారం చేసిన ఛానెళ్లు కూడా లైవ్ ఇచ్చాయి. దీనికి రెండు ప్ర‌ధాన కార‌ణాలు ఉన్నాయి. 

 

ద‌క్షిణాది రాష్ట్రాల్లో నిన్మ‌మొన్న‌టి వ‌ర‌కు క‌రోనా కేసుల విష‌యంలో ఏపీ ఫ‌ర్వాలేద‌ని అనిపించినా.. గ‌డిచిన మూడు రోజులుగా ద‌క్షిణాది రాష్ట్రాల్లో క‌రోనా ప్ర‌భావిత రాష్ట్రంగా మారిపోయింది. రెడ్ జోన్లు పెరిగిపోయాయి. ఈ నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్ ఆస‌క్తిక‌ర నిర్ణ‌యాలు తీసుకుంటారేమో.. అనే ఉత్సాహంతో లైవ్ ఇచ్చార‌నే వాద‌న ఉంది. అదేస‌మ‌యంలో లాక్‌డౌన్‌పై ఆయ‌న ఏమంటారు? అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం ల‌భిస్తుంద‌ని కూడా ఛానెళ్లు భావించాయ‌నే వాద‌న ఉంది. ఇదిలావుంటే, సోమ‌వారం దేశ ప్రధాని మోడీ కూడా క‌రోనాపై అన్ని రాష్ట్రాల సీఎంల‌తోనూ వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. 

 

జ‌గ‌న్ కూడా రాష్ట్ర ప‌రిస్తితిని ఆయ‌నకు వివ‌రించారు. ఈ క్ర‌మంలో ఆయా విశేషాలు సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా వెల్ల‌డించే అవ‌కాశం ఉంద‌ని భావించిన అన్ని ఛానెళ్లు రేటింగ్ మిస్ కాకూడ‌ద‌నే ఉద్దేశంతో సీఎం జ‌గ‌న్ ప్రెస్‌మీట్‌ను దాదాపు 11 నెల‌ల త‌ర్వాత అన్ని చానెళ్లు లైవ్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. అయితే, సీఎం జ‌గ‌న్ చేసిన ప్ర‌సంగం మాత్రం నిస్త‌త్తువ‌గా ఉంద‌ని వ్యాఖ్య‌లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: