అతి జాగ్రత్త కూడా కొన్నిసార్లు అనవసరమైన చికాకుల్ని తెచ్చి పెడుతుందంటారు. తాజాగా ఏపీ ఎదుర్కొంటున్న పరిస్థితిని చూస్తే ఇది నిజమనిపించకమానదు. దేశంలో మరే రాష్ట్రంలో లేని రీతిలో కోరోనా నిర్దారణ పరీక్షలు ఏపీలోనే ఎక్కువగా చేయటం జగన్ సర్కారుకు కొత్త తలనొప్పిగా మారిందా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. కరోనా నిర్దారణ పరీక్షలు దేశంలో మరే రాష్ట్రంలో లేని రీతిలో నిర్వహిస్తున్నారు.


చాలా రాష్ట్రాల్లో ఆచితూచి అన్నట్లుగా పరీక్షలు నిర్వహిస్తుంటే.. ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా పెద్ద ఎత్తున చేయిస్తుండటం గమనార్హం. గడిచిన కొద్దిరోజులుగా అతి తక్కువ కేసులు నమోదై తెలంగాణ విషయాన్నే చూస్తే.. ఆ రాష్ట్రంలో చేసిన కరోనా నిర్దారణ పరీక్షలు తిప్పితిప్పి కొడితే ఇరవై వేల కంటే తక్కువ. కానీ.. ఏపీ విషయానికి వస్తే.. ఇప్పటివరకూ 74,551 పరీక్షల్ని నిర్వహించారు.

 

కరోనా నిర్దారణ పరీక్షలతో సమస్య ఏమంటే.. వైరస్ ఉంటే దాని ఉనికిని చెప్పేస్తుంది. పరీక్షలు నిర్వహించకుంటే.. ఆ విషయమే బయటకు రాదు. కరోనా వైరస్ సోకిన ప్రతి ఒక్కరూ జబ్బున పడాలన్నది లేదు. చనిపోవటం ఉండదు. కరోనా వైరస్ సోకిన తర్వాత కూడా దాని లక్షణాలు బయటకు రాకుండా.. ఆ వైరస్ నుంచి విముక్తి అయ్యేవారు ఉండదు. ఒక వ్యక్తి రోగనిరోధక శక్తికి అనుగుణంగా కరోనా ఆ వ్యక్తి మీద ప్రభావాన్ని చూపిస్తుందన్నది మర్చిపోకూడదు.

 

దేశంలో ప్రతి పదిలక్షల జనాభాకు చేయిస్తున్న కరోనా నిర్దారణ పరీక్షల కంటే ఏపీలో మూడు రెట్లు ఎక్కువగా చేస్తున్నారని చెప్పాలి. ఏపీలో ప్రతి పదిలక్షల జనాభాకు 1396 టెస్టులు చేస్తున్నారు. ఇదే ఇప్పుడు సమస్యగా మారిందన్న అభిప్రాయం లేకపోలేదు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నిర్దారణ కిట్లను ఆచితూచి అన్నట్లుగా పలు రాష్ట్రాలు ఉపయోగిస్తుంటే.. ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది.
ఎంత ఎక్కువగా పరీక్షలు చేయిస్తే.. వైరస్ విస్తరణ ఎంత మేర జరిగిందో అర్థమవుతుంది. 

 

ఫలితాలు చూసినప్పుడు  ఇబ్బందిగా ఉన్నా.. మాయదారి వైరస్ పీచమణచటానికి నిర్దారణ పరీక్షలు ఎక్కువగా చేయించటానికి మించింది మరొకటి లేదనే చెప్పాలి. ప్రస్తుతానికి కేసుల నమోదు ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఏపీ అనుసరిస్తున్న విధానం లాంగ్ రన్ లో లాభం చేస్తుందంటున్నారు. ముందుచూపు.. మరెవరూ చేయని రీతిలో ఎక్కువ పరీక్షలు చేయటం ఏపీకి తలనొప్పిగా మారిందన్న అభిప్రాయాన్ని కొట్టిపారేయలేం.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: