కరోనా సంక్షోభంలో కూడా రాజకీయాలు చేయటం ఒక్క తెలుగుదేశంపార్టీకే చెల్లుతుంది. చంద్రబాబునాయుడు, లోకేష్, టిడిపి నేతలు, పచ్చమీడియా దృష్టిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమి చేసినా తప్పే, ఏమీ చేయకపోయినా తప్పే అన్నట్లుంది. తాజాగా ఓ రైతు బాధలు చెప్పుకోవటాన్ని కూడా నారా లోకేష్, టిడిపి నేతలు ట్విట్టర్లో పోస్టు చేసి తెగ ప్రచారం చేస్తున్నారు. పైగా బాధలు చెప్పుకుంటున్న  రైతు వీడియోకి జగన్ ఫొటోను ట్యాగ్ చేసింది టిడిపి.

 

రైతు వీడియాకు ట్యాగ్ చేసిన ఫొటోపైన జగన్ పాలనలో రైతుల పరిస్ధితి ఇది... అని రాశారు. అలాగే ఫొటోపై మిస్సింగ్ అని రెడ్ కలర్లో స్టాంప్ వేశారు. ఫొటోకు క్రిందవైపు కనబడటం లేదు అని ఉంది. దానికింద పేరుః వైఎస్ జగన్మోహోన్ రెడ్డి అని వృత్తిః ముఖ్యమంత్రి అని ప్రింట్ చేశారు. అంటే తన వీడియోలో రైతు మాట్లాడుతూ ’ అయ్యా జగన్మోహన్ రెడ్డి నీవు ఎక్కడున్నావో ఏమో’ అని అన్నాడు. ’ పాదయాత్రలో నేను ఉన్నాను, నేను చూశాను’ అని చెప్పావు ’నీవు ఏమి చూశావో ఏమి విన్నావో అర్ధం కావటం లేదు’ అని తన బాధను చెప్పుకున్నాడు.

దాన్ని పట్టుకుని టిడిపి వాళ్ళు ట్విట్టర్లో జగన్ కనబడటం లేదంటూ కరోనా రాజకీయం మొదలుపెట్టేశారు. జగన్ ఎక్కడున్నాడో రాష్ట్రంలో అందరికీ తెలుసు. తాడేపల్లిలోని సొంత ఇంట్లోనే గడచిన నెల రోజులుగా కూర్చుని కరోనా వైరస్ సంక్షోభాన్ని ప్రతిరోజు మానిటర్ చేస్తున్న విషయం టిడిపికి అంతమాత్రం తెలీదా ?  రైతేదో తన బాధ చెప్పుకుంటే మధ్యలో టిడిపి వాళ్ళు దూరి జగన్ కనబడటం లేదంటూ బురద రాజకీయాలు చేయటం చవకబారుగా ఉంది.

 

ఒకవైపేమో వైసిపి ఎంఎల్ఏల వల్లే కరోనా వైరస్ వ్యాపిస్తోందంటూ చంద్రబాబు అండ్ కో తో పాటు ఎల్లోమీడియా ఒకటే యాగీ చేసేస్తోంది. అదే సమయంలో కేసులు ఎక్కువగా ఉన్న  కర్నూలు  జిల్లాలో పర్యటించే ధైర్యం జగన్ కు ఉందా అంటూ సవాళ్ళు విసురుతున్నారు. అంటే వైసిపి ఎంఎల్ఏల వల్లే కరోనా వ్యాపిస్తోందని ఒకవైపు చెబుతునే మరోవైపు జగన్ జిల్లాల్లో తిరిగి బాధితులను పరామర్శించాలనే మతిలేని డిమాండ్లు చేయటం టిడిపి నేతలకే చెల్లింది.

 

చంద్రబాబేమో హైదరాబాద్ లోని తన ఇంట్లోకి ఎవరినీ రానీయకుండా సేఫ్ గా ఉండాలి. అదే సమయంలో జగన్ మాత్రం బాధితులను పరామర్శించి తాను కూడా వైరస్ ను తగిలించుకోవాలన్న టిడిపి శాడిజం బయటపడిపోతోంది.  తనింట్లో కూర్చుని జగన్ వైరస్ సంక్షోభంపై సమీక్షలు చేయటాన్ని కూడా టిడిపి తట్టుకోలేకపోతోందన్న విషయం అర్ధమైపోతోంది. లేకపోతే ముఖ్యమంత్రిని పట్టుకుని కనబడటం లేదని ట్విట్టర్లో బురద చల్లుతుందా ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: