కార్మిక ఉద్య‌మాల నుంచి ఎందరో నాయ‌కులు ఉన్న‌త‌స్థాయికి ఎదిగారు.. కార్మికుల అండ‌దండ‌ల‌తో మ‌రెంద‌రో రాజ‌కీయంగా నిల‌దొక్కుకున్నారు. ప్ర‌భుత్వాల్లో కీల‌క ప‌ద‌వులు చేప‌ట్టారు. నేడు అంత‌ర్జాతీయ కార్మిక దినోత్స‌వం మే డే సంద‌ర్భంగా కార్మిక ఉద్య‌మాల నుంచి ఎదిగిన మాజీ మంత్రి నాయిని న‌రసింహారెడ్డిపై ప్ర‌త్యేక క‌థనం మీ కోసం..  ఉద్య‌మాల ఖిల్లా ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా దేవ‌ర‌కొండ మండ‌లం నేరేడుగొమ్ము గ్రామంలో 1944 మే 12న రైతు కుటుంబంలో జ‌న్మించారు నాయిని. చిన్న‌త‌నం నుంచే సోష‌లిస్టు భావాలు క‌లిగిన నాయిని ఎక్క‌డ అన్యాయం జ‌రిగినా ఎదిరించేవారు. పోరాటం చేయ‌డంలో ఆయ‌న ఎప్పుడూ ముందువ‌ర‌స‌లోనే ఉండేవారు. ఈ క్ర‌మంలో మొద‌ట‌గా వీఎస్‌టీ ప‌రిశ్ర‌మలో కార్మిక‌ సంఘం నాయ‌కుడిగా ఆయ‌న‌‌ ప్ర‌స్థానం ప్రారంభించారు. కార్మికుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం, వారి హ‌క్కుల కోసం నాయిని అవిశ్రాంతంగా పోరాటం చేశారు. నాయిని ఇలా కొద్దికాలంలోనే మంచి కార్మిక సంఘం నేత‌గా గుర్తింపు పొందారు. ఒక‌సారి కార్మికుల గురించి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు నాయిని. * కార్మికుల‌కు మంచి చేస్తే.. నెత్తిమీద‌పెట్టుకుని పూజిస్తారు.. చెడుచేస్తే మాత్రం కాలుకింద పెట్టి తొక్కేస్తారు* అని నాయిని చెప్ప‌డం గ‌మ‌నార్హం. అంత‌టి అంకిత‌భావంతో కార్మికుల కోసం నాయిని ప‌నిచేయ‌డం వ‌ల్లే.. నేత‌గా ఎదిగార‌ని ప‌లువురు అంటుంటారు.

 

 అంతేగాకుండా.. 1969వ‌లో జ‌రిగిన తెలంగాణ ఉద్య‌మంలోనూ నాయిని న‌ర్సింహారెడ్డి చ‌రుకైన పాత్ర పోషించారు. అనేక మార్లు జైలు పాల‌య్యారు. సుమారు 30సార్లు ఆయ‌న జైలుకు వెళ్లారు. ఇక‌ జ‌న‌తాపార్టీలో చేరి కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. 1978లో జ‌న‌తాపార్టీ నుంచి ముషీరాబాద్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. అప్ప‌ట్లో సంజీవ‌య్య‌ను ఓడించి సంచ‌ల‌నం సృష్టించారు. ఆ త‌ర్వాత‌ 1985, 2004లోనూ ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న‌ ఎమ్మెల్యేగా గెలిచారు. స్వ‌రాష్ట్ర సాధ‌నే ల‌క్ష్యంగా కేసీఆర్ నాయ‌కత్వంలో ఏర్ప‌డిన టీఆర్ఎస్ పార్టీలో చేరి, కేసీఆర్‌కు అత్యంత న‌మ్మ‌క‌మైన నేత‌గా గుర్తింపుపొందారు. ఇదే స‌మ‌యంలో కేసీఆర్ కూడా నాయినికి మంచి ప్రాధాన్యం ఇస్తూ.. అండ‌గా నిలిచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ఏర్ప‌డిన తొలి ప్ర‌భుత్వంలోనే ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయినికి కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించారు. 2014 నుండి 2018 వరకు తెలంగాణ రాష్ట్ర హోంమంత్రిగా ఆయ‌న కొన‌సాగారు. అంతేగాకుండా.. ఉమ్మ‌డి రాష్ట్రంలో 2005 నుంచి 2008 వరకు వైఎస్ రాజశేఖ‌ర్‌ రెడ్డి  క్యాబినెట్లో కూడా నాయిని మంత్రిగా ఉన్నారు. ఇటీవ‌ల తెలంగాణ‌లో జ‌రిగిన ఆర్టీసీ కార్మికుల స‌మ్మెకు మ‌ద్దుతుగా నాయిని న‌ర‌సింహారెడ్డి నిలిచి, కార్మిక ప‌క్ష‌పాతిన‌ని నిరూపించుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: