అనుకుని చేసినా, అనుకోకుండా చేసినా ఒక్కోసారి శత్రువు కూడా మనకు మేలు చేస్తాడు అనే విషయం ఇప్పుడు ఏపీ సీఎం జగన్ విషయంలో రుజువైంది. వైసిపి నాయకులు, జగన్ దృష్టిలో పచ్చ మీడియా గా పిలువబడుతున్న కొన్ని పత్రికలు, ఛానళ్ల లిస్టులో ఈనాడు కూడా ఉంది. ఆ పత్రికలో ఎప్పుడూ టీడీపీ అనుకూల కథనాలు, వైసీపీకి వ్యతిరేకంగా కథనాలు వండి వార్చుతారనే పేరు ఉంది. ఈనాడు పూర్తిగా చంద్రబాబు కనుసన్నల్లో పనిచేసే పత్రిక అని, కుల అభిమానంతో ఈనాడు తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ వస్తోంది అని అనేకసార్లు అనేక సందర్భాల్లో జగన్ తో పాటు ఆ పార్టీ నాయకులు విమర్శలు చేస్తూనే వస్తున్నారు. టిడిపికి ఈనాడు, ఆంధ్రజ్యోతి రెండు కళ్లలా  మద్దతు పలుకుతున్న కారణంగా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే సాక్షి దినపత్రిక జగన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి తమ వాదనను చెప్పుకునేందుకు వైఎస్ కుటుంబానికి అప్పటి కాంగ్రెస్, ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఏర్పడింది.

 

IHG


 ఇక ఇప్పటి విషయానికి వస్తే శుక్రవారం ఈనాడు దినపత్రికలో జగన్ కు మేలు చేసే విధంగా కొన్ని కథనాలు ఈనాడు ప్రచురించింది. కానీ ఇవే కథనాలు సాక్షి దినపత్రికలో మరింత హైలెట్ చేసుకునే అవకాశం ఉన్నా... ఆ పత్రిక ఆ ప్రాధాన్యాన్ని గుర్తించడంలో విఫలమైంది. 2 రోజుల క్రితం ఏపీ సీఎం జగన్ కరోనా కు సంబంధించి మాట్లాడిన మాటల్లో ఇది సాధారణ జ్వరం మాత్రమేనని, మరి కొంత కాలం పాటు కరొనతో సహజీవనం చేయాల్సి వస్తుంది అంటూ మాట్లాడి ప్రజల్లో ఉన్నభయాందోళన పోగొట్టే విధంగా, భరోసా ఇచ్చేలా జగన్ మాట్లాడారు. అంతేకాకుండా గ్రీన్ జోన్ లలో లాక్ డౌన్ ఎత్తివేయాలని కూడా జగన్ సూచించారు. ఆ విధంగానే ప్రధాని మోదీ నిర్ణయమూ వెలువడింది. 

 


ఇక అతి ముఖ్యమైన విషయం సుదీర్ఘకాలం లాక్ డౌన్ నిబంధనలు పొడిగించుకుంటూ వెళ్తే ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుందని, సామాజిక దూరం పాటిస్తూనే లాక్ డౌన్ ఎత్తివేసి రోజువారి కార్యకలాపాలు సాగించేందుకు వీలుగా నిబంధనలు సడలించాలని జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయంలో టిడిపి అనుకూల మీడియాగా చెప్పుకుంటున్న కొన్ని పత్రికలు, ఛానళ్లు జగన్ ను టార్గెట్ గా చేసుకుని తీవ్రస్థాయిలో వ్యతిరేక కథనాలు ప్రచారం చేశాయి. దీని కారణంగా జగన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి జగన్ కు ఊరట కలిగించే విధంగా ఈనాడు దినపత్రిక మన దేశంలో పేరు ఉన్న ఇద్దరు ప్రముఖులు అభిప్రాయాలను బ్యానర్ వార్తగా ప్రచురించింది.

 

IHG


 వారే  ప్రముఖ ఇన్ఫోసిస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్ నారాయణమూర్తి, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్. సుదీర్ఘ లాక్ డౌన్ మంచిది కాదు శీర్షికతో రాహుల్ గాంధీ ముఖాముఖిలో ఆర్.బి.ఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నట్టుగా కథనాన్ని ఈనాడు ప్రచురించింది. ఇదే కథనంలో కరోనా యుద్ధం లో 100% విజయం సాధించడం అసాధ్యం అంటూ రఘురాం రాజన్ అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని కూడా ఈనాడు ప్రస్తావించింది. భారత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి అనుసరించాల్సిన అంశాలపై కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమెరికాలో ఉన్న రఘురాం రాజన్ తో వీడియో కాన్ఫరెన్స్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా రఘురామ్ రాజన్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మళ్లీ లాక్ డౌన్ కి వెళ్తే విధ్వంసకర పరిణామాలు ఎదురవుతాయని, ఆర్థిక వ్యవస్థ కోలుకోని విధంగా దెబ్బతింటుందని, గతంలో జగన్ చెప్పిన మాటలనే రఘురాం రాజన్ చెప్పారు. ఇదే విషయాన్ని ఈనాడు ప్రచురించింది.

 

IHG

 ఇక ఇన్ఫోసిస్ వ్యవస్థాపక అధ్యక్షుడు నారాయణ మూర్తి అభిప్రాయం ఈనాడు ప్రచురించింది. నిర్బంధమే ఎక్కువ ప్రాణాలను హరిస్తుంది అనే శీర్షికతో నారాయణమూర్తి వ్యాఖ్యలను ఈనాడులో చక్కగా వివరించారు. మరికొంత కాలం కొనసాగితే వైరస్ కన్నా ఆకలి చావులే దేశంలో ఎక్కువగా ఉంటాయని ఆయన చెప్పిన విషయాలను ఈనాడు ప్రచురించింది. అంతేకాకుండా భారత్ లో ఏటా 90 లక్షల మంది చనిపోతున్నారని, వారిలో నాలుగో వంతు మంది కాలుష్యం కారణంగా చనిపోతున్నారని, కానీ గత రెండు నెలల్లో కరొనతో చోటుచేసుకున్న మరణాలు వెయ్యి వరకు మాత్రమే ఉన్నాయని, ఇది  మనం ఊహించినంత ఆందోళనకరమైన విషయం ఏమీ కాదని ఆయన చెప్పిన అభిప్రాయాలను ఈనాడు ప్రచురించింది. ఇవన్నీ జగన్ కు మేలు చేసే కథనాలే. 


ఎందుకంటే గతంలో ఇవే విషయాలను జగన్ చెప్పారు. కరొనతో మనం మరి కొంతకాలం కలిసి ప్రయాణం చేయాల్సి ఉంటుందని, జగన్ చెప్పిన విషయాలను ఇప్పుడు ఈ ఇద్దరు ప్రముఖులు చెప్పడం వాటిని ఈనాడు ప్రచురించడం, జగన్ వ్యాఖ్యలకు మద్దతు పలుకుతున్నట్టుగా వారి అభిప్రాయాలు ఉన్నాయి. ఇవే అభిప్రాయాలను సాక్షి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. కరోనా ఉనికిని అంగీకరించాలి అనే శీర్షికతో లాక్ డౌన్ కొనసాగించడం సరికాదు: నారాయణమూర్తి అంటూ మూడో పేజీలో సింగిల్ కాలమ్ వార్త ప్రచురించారు. ఆచితూచి పునరుద్ధరణ అనే శీర్షికతో రాహుల్ తో రఘురాం రాజన్ అంటూ మరో సింగిల్ కాలం వార్తను అదే మూడో పేజీలో ప్రచురించారు. 


ఒక పక్క ఈ విషయాలపై జగన్ కార్నర్ అవుతున్న సమయంలో ఈ ఇద్దరి ప్రముఖులు అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇచ్చి మొదటి పేజీలో వాటిని ప్రచురించి ఉంటే జగన్ కు మరింత మైలేజ్ వచ్చేది. కానీ ఆ విషయంలో సాక్షి ఫెయిల్ అయ్యింది. ఇవే విషయాలను మొదటి పేజీలో ప్రచురించి వాటికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఈనాడు పరోక్షంగా జగన్ కు మేలు చేకూర్చింది. ఇప్పుడు ఈనాడులో వచ్చిన కథనాలపై వైసీపీలను చర్చ మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: