ప్ర‌స్తుతం దేశంలో ఎవ‌రి నోట విన్నా.. క‌రోనా వైర‌స్ గురించిన చ‌ర్చే జోరుగా సాగుతోంది. వైర‌స్ ప్ర‌భావం ఎప్పుడు త‌గ్గుతుంద‌ని, లాక్‌డౌన్‌ను ఎప్పుడు ఎత్తేస్తార‌ని.. త‌మ క‌ష్టాలు ఎప్పుడు తీర‌తాయ‌ని ఇలా ప్ర‌తి ఒక్క‌రూ ఈ అంశాల‌పైనే చ‌ర్చించుకుంటున్నా రు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వాలు క‌రోనా క‌ట్ట‌డి కోసం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై కూడా జోరుగానే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఈ విష‌యంలో కేర‌ళ ప్ర‌భుత్వం ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా వెల్ల‌డించిన గ‌ణాంకాలు చెబుతున్నాయి. అయితే, దీనికి స‌మానంగా.. ఏపీ దూకుడుగా ముందుకు సాగుతోంద‌నేది కేంద్ర ప్ర‌భుత్వ‌మే చెబుతున్న మాట‌. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం అనుస‌రించిన తీరును ప‌క్క రాష్ట్రాలు కూడా అనుస‌రించాయ‌ని.. కేంద్రం తాజాగా వెల్ల‌డించిన నివేదిక‌లో స్ప‌ష్టం చేసింది.

 

ప్ర‌ధానంగా ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ ద్వారా మూడు ద‌శ‌ల్లో ప్ర‌జ‌ల ఆరోగ్యంపై స‌ర్వే చేయ‌డం, అనుమానితులు ఉన్నా.. ఎవ‌రైనా విదేశాల నుంచి వ‌చ్చినా.. వెంటనే ప్ర‌భుత్వానికి స‌మాచారం అందేలా ప‌క్కా వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసుకోవ‌డం ఏపీ ప్ర‌భుత్వం సాధించిన తొలి విజ‌యంగా కేంద్రం పేర్కొంది. ఇక‌, దేశంలోనే తొలిసారిగా కొవిడ్‌-19 నియంత్ర‌ణ‌కు సంబంధించి సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి కృష్ణ‌బాబు నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన రాష్ట్రంగా కూడా ఏపీ నిలిచింది. ప్ర‌చారం క‌న్నా కూడా ప‌రీక్ష‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డంలో కూడా ఏపీ ముందు వ‌రుస‌లో ఉంద‌న్న‌ది కేంద్రం చెబుతున్న మాటే! ఇక‌, క్వారంటైన్ల ఏర్పాటు, ముందుగానే కొవిడ్ -19 ఆసుప‌త్రుల ఏర్పాటు వంటివి కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వ దూర‌దృష్టికి నిద‌ర్శ‌న‌మ‌ని తాజాగా కేంద్ర హోం, ఆరోగ్య శాఖ‌లు వెలువ‌రించిన వేర్వేరు నివేదిక‌ల్లో పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

 

మ‌రీ ముఖ్యంగా ప్ర‌జ‌ల‌ను క‌రోనా విష‌యంలో చైత‌న్యం చేయ‌డంలో కాఠిన్యం కాకుండా అవ‌గాహ‌న ప్ర‌ద‌ర్శించిన తీరుకు ఏపీ పోలీసుల‌కు కేంద్ర హోం శాఖ కితాబు నిచ్చింది. ఇక‌, వైద్యులు కూడా అంకిత భావంతో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ముంద‌స్తు ప‌రీక్ష‌లు చేయ‌డం ద్వారా కేసుల‌ను గుర్తించి క్వారంటైన్ చేయ‌డంలో కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వం స‌క్సెస్‌గా ఉంద‌ని పేర్కొంది. ఇక‌, ఏ రాష్ట్ర ప్ర‌భుత్వ‌మూ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని విధంగా నెల‌కు మూడు సార్లు పేద‌ల‌కు రేష‌న్ పంపిణీ చేయ‌డం, రాష్ట్రంలో పేద‌, ధ‌నిక అనే తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రికీ మూడు మాస్కులు పంపిణీ చేయ‌డం, వీటిని డ్వాక్రా మ‌హ‌ళ‌ల‌కు అప్ప‌గించ‌డం ద్వారా వారికి క‌ష్ట కాలంలో ఉపాధి క‌ల్పించి ఆదాయ మార్గం చూపించ‌డం వంటివి రికార్డు చ‌ర్య‌లుగా కేంద్రం పేర్కొంది.

 

ఇవ‌న్నీ ఇలా ఉంటే.. పేద‌ల‌కు రూ.1000 పంపిణీ చేయ‌డాన్ని కూడా కేంద్రం ప్ర‌శంసించింది. కేంద్రం ఇస్తున్న నిధుల‌కు ఇది అద‌నంగా రాష్ట్రం ఇచ్చిన సాయంగా పేర్కొంటూ.. జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తింది. ఇక‌, జిల్లాను జోన్‌గా కాకుండా మండ‌లాల‌ను జోన్‌గా చేసుకుని క‌ట్ట‌డి చేయ‌డం ద్వారా క‌రోనా వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితోనే ముందుకు సాగుతోంద‌ని వెల్ల‌డించింది. మొత్తంగా చూస్తే.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం క‌రోనా విష‌యంలో అనుస‌రిస్తున్న విధానాల‌కు మంచి మార్కులే ప‌డుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌లు ఎలా ఉన్నా.. ప్ర‌భుత్వం త‌న ప‌నితాను చేసుకుని పోవ‌డం మంచి ప‌రిణామంగా పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: