కరోనా వైరస్ దెబ్బకు అగ్రరాజ్యం అమెరికాలో పరిస్ధితులు చాలా ఘోరంగా మారిపోయాయి.  వైరస్ దెబ్బకు దాదాపు అన్నీ రంగాలు కుదేలైపోయాయి. వివిధ రంగాల్లో సుమారు 3 కోట్లమంది  ఉద్యోగ, ఉపాధి కోల్పోయారు. దాంతో చేయటానికి ఉద్యోగాలు లేక, ఉద్యోగాలు ఉన్నా జీతాలు రాక, తినటానికి తిండి లేక, ఉండటానికి ఇళ్ళు కూడా లేక కొన్ని లక్షల మంది నానా అవస్తలు పడుతున్నారు.  రోడ్లమీద, పార్కుల్లో, ఓల్డేజి హోముల్లో తల దాచుకుంటున్న వాళ్ళకు లెక్కలేదు.

 

ఇందులో భాగంగానే అమెరికాలోని చిన్న పిల్లల్లో ప్రతి ఐదుగురిలో ఒకడికి తినటానికి తిండి దొరకటం లేదనే విషయం తాజాగా బయటపడింది. ది బ్రూకింగ్ ఇన్ స్టిట్యూట్ దేశవ్యాప్తంగా 12 లోపు పిల్లల తిండి విషయంలో సర్వే చేసింది. ఆ సర్వేలో పాల్గొన్న పిల్లల తల్లులు భయంకరమైన వాస్తవాలు చెప్పారు. సర్వేలోని ప్రశ్నలకు తల్లులు చెప్పిన వాస్తవాలు విని సర్వే బృందానికే షాక్ కొట్టిందట. తమ పిల్లలకు కడుపునిండా తిండి కూడా సరిగా పెట్టలేకపోతున్నట్లు సర్వేలో పాల్గొన్న తల్లుల్లో 17 శాతం మంది పచ్చి నిజాలు బయటపెట్టారు.

 

వీరి దయనీయ పరిస్ధితిని అధ్యయనం చేసిన బృందానికి అమెరికాలో పిల్లల వాస్తవ పరిస్ధితులేంటో కళ్ళకు కట్టినట్లు కనిపించాయి. కడుపునిండా తినటానికి పెద్దలకే తిండి లేనపుడు ఇక పిల్లలకు ఎక్కడి నుండి తెచ్చి పెడతారు  ? అన్నది ప్రధాన ప్రశ్న. పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫుడ్ బ్యాంకుల్లో కూడా ఎప్పటికప్పుడు ఆహార పదార్ధాలు అయిపోతున్నాయి. దాంతో బయటనుండి సప్లై లేకపోవటంతో బ్యాంకులను మూసేస్తున్నారు.

 

ఏరోజూ ఫుడ్ బ్యాంకుల వైపు కన్నెత్తి కూడా చూడని వేలాదిమందికి కడుపు నింపుకోవటానికి  ఇపుడు ఫుడ్ బ్యాంకులే  ఆధారమయ్యాయంటే పరిస్ధితి ఎంత దయనీయంగా ఉందో అర్ధమైపోతోంది.  డబ్బులుండి సరుకులు కొనుక్కునే స్తోమత ఉన్న వాళ్ళు డిపార్టుమెంటు స్టోర్లకు వెళుతున్నారు. అయితే అక్కడ కూడా వచ్చిన సరుకులు వచ్చినట్లే అయిపోతున్నాయి. దాంతో కొందరి చేతిలో డబ్బున్నా కొనటానికి సరుకులుండటం లేదు.

 

అందుకనే రోడ్ల మీద ఎక్కడపడితే అక్కడ బిచ్చగాళ్ళు పెరిగిపోతున్నారు. నిజానికి వీళ్ళెవరూ బిచ్చగాళ్ళు కాదు. ఉద్యోగాలు కోల్పోవటంతో డబ్బు లేక, తిండి లేక, ఉండటానికి ఇల్లులేక చివరకు బిచ్చగాళ్ళ మాదిరిగా అయిపోయారు. అందుకనే స్టోర్ల ముందు నిలబడి కాస్త తిండి ఉంటే పెట్టమని, ఏదేనా కొనుక్కోవటానికి కాసింత డబ్బులు దానం చేయమని బ్రతిమలాడుకుంటున్నారట రోడ్లపైనే. వీళ్ళంతా రెండు మూడు నెలల క్రితం వరకూ కాస్త గౌరవప్రదమైన జీవితాలు గడిపిన వారే కావటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: