ఈ ఆదివారం కొత్తపలుకులో జగన్మోహన్ రెడ్డి గురించి రాసింది చదివిన తర్వాత అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి.  జగన్-చంద్రబాబునాయుడు అయినా ఎప్పుడైనా కలుస్తారేమో కానీ జగన్-వేమూరి రాధాకృష్ణ మాత్రం కలిసేది కల్ల అని అందరికీ తెలిసిందే.  ఎందుకంటే జగన్ అంటే  వేమూరికి నిలువెల్లా ఎంత ధ్వేషముందో అందరికీ తెలిసిందే. వారం వారం రాసే కొత్తపలుకులో  ఏ అంశం తీసుకున్నా ఆవువ్యాసం లాగ తిరిగి తిరిగి టాపిక్  జగన్ దగ్గరకే వస్తుంది. జగన్ గురించి చేయని ఆరోపణలు, విమర్శలు లేవనే చెప్పాలి.

 

అవసరం ఉన్నా లేకపోయినా అసందర్భమయినా సరే జగన్ పై ఆరోపణలు చేయాల్సిందే, విమర్శలు చేయాల్సిందే. జగన్ పాలనలో ఎల్లోమీడియాకు  ఒక్క మంచి కూడా కనబడలేదు.  చేస్తున్న ప్రకటనలు, అమలు చేస్తున్న పథకాల్లో ప్రత్యేకంగా బొక్కలు వెతికి మరీ వ్యతిరేక కథనాలు, వార్తలు వండి వారుస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. అయితే తాజాగా రాసిన కొత్తపలుకును చదివితే మాత్రం ఎల్లోమీడియాకు ఏమైందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

 

’జగన్ రూటే సపరేటు’  అనే హెడ్డింగ్ తో ఎల్లోమీడియాలో జగన్ గురించి పూర్తి పాజిటివ్ గా కథనం వచ్చింది. జగన్ గురించి కొత్తపలుకులో పాజిటివ్ గా కథనం రాయటానికి వేమూరి ఎంతగా బాధపడుంటాడో అర్ధం చేసుకోవచ్చు.  అయితే ఇంతగా బాధపడిపోయి అంతగా పాజిటివ్ కథనం రాయాల్సిన అవసరం ఏమిటి ? ఇపుడిదే ప్రశ్న ఎవరికీ అర్ధం కావటం లేదు.  ఇక్కడ గమనించాల్సిన  విషయం ఏమిటంటే జగన్ కు వ్యతిరేకంగా ఎల్లోమీడియా జనాలను రెచ్చగొట్టటానికి ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కావటం లేదు. ఒకవైపు కులపెద్ద చంద్రబాబునాయుడుకు జాకీలేసి లేపటం అదే సమయంలో జగన్ పై బురద చల్లటమనే రెండంచెల విధానాన్ని అవలంభిస్తున్నా ఉపయోగం కనబడటం లేదు.

 

అందుకనే జగన్ దెబ్బకు ప్రతిపక్షాలన్నీ కకావికలమైపోయిన విషయాన్ని ఎల్లోమీడియానే అంగీకరించింది. ప్రతిపక్షాలన్నీ కలసినా జగన్ ను నిలుపుదల చేయలేకపోతున్నట్లు స్పష్టంగా ఒప్పేసుకున్నది. మొత్తం కథనమంతా చూసిన తర్వాత బహుశా ఎల్లోమీడియా యజమానికి జగన్ తో ఏమైనా పనిపడిందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జగన్ గురించి నెగిటివ్ గా మాత్రమే చూడటానికి అలవాటు పడిపోయిన ఎల్లోమీడియాకు   పనిగట్టుకుని జగన్ కు భజన చేయాల్సిన అవసరం ఏమిటి ?

 

తెలంగాణాలో కేసియార్ తో గొడవలు పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. దాని పర్యవసానం కూడా అందరూ చూసిందే. నోటికొచ్చినట్లు అడ్డదిడ్డంగా రాసిన ఫలితంగా ఛానల్, పేపర్ కొంత కాలం పాటు తెలంగాణాలో ఎక్కడా కనబడలేదు. దేవుడికైనా దెబ్బే గురువు అన్నట్లుగా తర్వాత కేసియార్ కు సరెండర్ అయిపోయింది ఎల్లోమీడియా. ఇదే పరిస్ధితి ఏపిలో కూడా కనబడుతోంది. ఇంతకాలం జగన్ గురించి నోటికొచ్చింది రాసిన ఎల్లోమీడియా హఠాత్తుగా ప్లేటు ఫిరాయించి పాజిటివ్ కథనం రాయటంతోనే అందరికీ అనుమానాలు పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: