ఆంధ్రప్రదేశ్ లో విచిత్రమైన పరిస్దితులు కనబడుతున్నాయి. ఒకపుడు రాజకీయాలు వేరుగాను ప్రభుత్వ యంత్రాంగం పనితీరు వేరుగాను ఉండేది. రెండింటి మధ్య ఉన్న సన్నని రేఖ కాస్త చెరిగిపోయి రెండు కలిసిపోయాయి. దాంతో ఒకదానిపై మరొకటి ఆధిపత్యం పెరిగిపోతోంది. రాజకీయ నేతలు తమ అవసరాల కోసం ప్రత్యర్ధులపై బురద చల్లేయటం కోసం ఏకంగా యంత్రాంగంలోని అత్యున్న పోస్టులను కూడా బురదలోకి లాగేస్తున్నారు.

ప్రభుత్వ యంత్రాంగంలో అత్యున్న పోస్టులంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రెండు పోస్టులనే. మొదటిది చీఫ్ సెక్రటరీ, రెండోది డిజిపి. చీఫ్ సెక్రటరీ గా ఎవరున్నా జనాల మధ్యలోకి వచ్చి పనిచేసేది ఉండదు. ముఖ్యమంత్రుల సమీక్షల్లో పాల్గొనటం,  ఉన్నతాధికారులను సమర్ధవంతంగా నడిపించటం లాంటివి చీఫ్ సెక్రటరీకి చాలా కీలకం. కాబట్టి పబ్లిక్ ను కలిసే  పనే ఉండదు. ఆమటకొస్తే మంత్రులు, ఎంఎల్ఏలకు కూడా చీఫ్ సెక్రటరీతో పెద్దగా పనుండదనే చెప్పాలి.

 

ఇదే సమయంలో డిజిపి పనితీరు చాలా భిన్నంగా ఉంటుంది. లా అండ్ ఆర్డర్ మెయిన్ టైన్ చేయటంలో పోలీసులదే ప్రధాన పాత్ర అన్న విషయం అందరికీ తెలిసిందే. ఓ ప్రభుత్వం ఎలా పనిచేస్తోందనేందుకు శాంతి, భద్రతల పరిస్ధితి కూడా కీలకమైనదే. పైగా మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలే కాకుండా నేతలు, మామూలు జనాల్లో కూడా చాలామందికి పోలీసులతో పనిబడుతునే ఉంటుంది. అందుకనే పోలీసు వ్యవస్ధ ప్రభుత్వం మొత్తంలో చాలా కీలకమైపోయింది. ఇంత కీలకమైపోయింది కాబట్టి వివాదాల్లో పడిపోతోంది.

 

ఇంతటి కీలకమైన వ్యవస్ధకు అధిపతిగా ఉండే డిజిపిలే తరచూ వివాదాల్లో కూరుకుపోతున్నారు. ప్రభుత్వానికి అంటే ప్రజలకు తాము జవాబుదారులమన్న విషయాన్ని డిజిపిలు మరచిపోవటమే ప్రధాన కారణం. అధికారంలో ఎవరుంటే వారికి సలాం కొడుతు తమ పదవులను కాపాడుకోవాలన్న ఆరాటం వల్లే అధికారానికి మడుగులొత్తుతున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. చంద్రబాబునాయుడు హయాంలో డిజిపిలుగా జేవి రాముడు, నండూరి సాంబశివరావు, ఆర్పి ఠాకూర్ పనిచేశారు.

 

పై నలుగురిలో సాంబశివరావు, ఠాకూర్ వ్యవహార శైలి ఎంతగా వివాదాస్పదమయ్యిందో అందరికీ  తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి మీద విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగినపుడు ఠాకూర్ చేసిన కామెంట్లు, వ్యవహార శైలి తీవ్ర దుమారమే రేపింది. నిజానికి పై నలుగురు సమర్ధులైన అధికారులే అనటంలో సందేహం లేదు. కానీ అధికారపార్టీ ఒత్తిళ్ళకు లొంగిపోవటంతోనే వివాదాలు రేగాయి. వీళ్ళద్దరినీ వైసిపి ఎంతగా టార్గెట్ చేసిందో అందరికీ తెలిసిందే.

 

ఇపుడు జగన్ హయాంలో డిజిపిగా పనిచేస్తున్న గౌతమ్ సవాంగ్ కూడా సమర్ధుడైన అధికారే. కాకపోతే రాజకీయ కారణాలతోనే టిడిపి వాళ్ళు సవాంగ్ ను టార్గెట్ చేస్తున్నారు. సరే కారణాలు ఏవైనా రాజకీయ మకిలి అంటకూడని డిజిపి లాంటి అత్యున్న పోస్టులను కూడా బురదలోకి లాగేస్తున్నారు మన రాజకీయ నేతలు. మరి ఈ రాజకీయం ఎప్పుడు మారుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: